సీఏఏ, ఎన్ఆర్సీ లకు వ్యతిరేకంగా నగరంలో మిలియన్ 'మార్చ్' లు

By రాణి  Published on  4 Jan 2020 7:07 AM GMT
సీఏఏ, ఎన్ఆర్సీ లకు వ్యతిరేకంగా నగరంలో మిలియన్ మార్చ్ లు

ముఖ్యాంశాలు

  • ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
  • నెక్లెస్ రోడ్, చార్మినార్ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి పౌరసత్వ సవరణ చట్టం (CAA)కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ర్టాల్లో సీఏఏకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళన మంటలు ఇంకా చల్లారలేదు. తెలుగు రాష్ర్టాల్లో కూడా సీఏఏ, ఎన్ ఆర్సీ లకు వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఎన్ఆర్సీకి తమ ప్రభుత్వం వ్యతిరేకమని ప్రకటించారు.

తెలంగాణలో ఎన్ఆర్సీ, సీఏఏ లకు వ్యతిరేకంగా శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకూ దళిత విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, ముస్లిం సంఘాలతో కూడిన జేఏసీ మిలియన్ మార్చ్ నిర్వహించనున్నాయి. డిసెంబర్ 28నే జరగాల్సిన ఈ మిలియన్ మార్చ్ కు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంపై సవాల్ చేస్తూ..జేఏసీ హై కోర్టును ఆశ్రయించగా..ఈ విషయాన్ని పోలీసులు మరొక్కసారి పరిశీలించాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో మిలియన్ మార్చ్ జరిగే ప్రాంతాలను పరిశీలించిన పోలీసులు..అనుమతినివ్వక తప్పలేదు.

మరోవైపు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆధ్వర్యంలో ఎంఐఎం కూడా నగరంలో సీఏఏ, ఎన్ఆర్సీ లకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఎంఐఎం సీపీ అంజనీకుమార్ ను అనుమతి కోరింది. చార్మినార్ నుంచి ధర్నా చౌక్ వరకూ, దారుస్సలాం నుంచి ఈద్ గా బిలాలి వరకూ ఎంఐఎం మార్చ్ జరుగుతుందని ఎంఐఎం పోలీసులకు తెలిపింది. కాగా..నెక్లెస్ రోడ్ లో జరిగే మిలియన్ మార్చ్ ను ఎంఐఎం మార్చ్ ఢీ కొనే అవకాశం ఉండటంతో..ఓవైసీకి కొందరు నెటిజన్లు ర్యాలీ 5వ తేదీకి వాయిదా వేయాల్సిందిగా కోరారు. అయినప్పటికీ ఓవైసీ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.

ఏదేమైనా ఒకే రోజు ముస్లిం సంఘాలతో కూడిన జేఏసీ ఒకవైపు, ఎంఐఎం మరోవైపు సీఏఏ, ఎన్ఆర్సీ లకు వ్యతిరేకంగా చేయదలచిన మిలియన్ మార్చ్, భారీ ర్యాలీల ఫలితంగా వాహనదారులు ఇబ్బందులెదుర్కోక తప్పడం లేదు. వీటి ప్రభావం ఎక్కువగా ఉద్యోగస్తులు, విద్యార్థులపైనే ఉందని చెప్పాలి. మిలియన్ మార్చ్ నేపథ్యంలో నెక్లెస్ రోడ్ వైపు పోలీసులు వాహనాలను అనుమతించడంలేదు. చార్మినార్ వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది.

Next Story