హాలీవుడ్ హారర్ సినిమాలో లాగానే...ఆ రోడ్డంతా..

By రాణి  Published on  15 Dec 2019 5:23 AM GMT
హాలీవుడ్ హారర్ సినిమాలో లాగానే...ఆ రోడ్డంతా..

వేల్స్ : ఆ రోడ్డు హాలీవుడ్ హారర్ సినిమాను తలపించింది. ఆ ఘటనను చూసిన యువతి భయంతో వణికిపోయి తాను చూసిన ఘటనను భర్తకు చెప్పింది. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వార్త చదవాల్సిందే. బ్రిటన్ కు చెందిన హన్నా అనే యువతి చికిత్స నిమిత్తం ఓ ఆస్పత్రిలో అపాయింట్ మెంట్ తీసుకుని, ఇంటి నుంచి బయల్దేరింది. అయితే ఆమె ఆస్పత్రికి వెళ్లే మార్గంలో ఓ చోట ఆకాశంలో కొన్ని పక్షులు ఎగురుతూ ఉండటం గమనించింది. ఇన్ని పక్షులు ఎక్కడి నుంచి వస్తున్నాయా? అని అనుకుంటూనే ఆస్పత్రికి చేరుకుంది. అక్కడ చికిత్స చేయించుకుని తిరిగి వస్తుండగా...తనకు పక్షులు కనిపించిన ప్రాంతాన్ని సమీపించిందో లేదో ఆమె గుండె బెంబేలెత్తిపోయింది.Hundereds Of Starlings Dead On Road 2

ఆస్పత్రికి వెళ్లేటపుడు హన్నా చూసిన పక్షులన్నీ రోడ్డుపై తలలు పగిలి వాటి శరీర భాగాలు ఛిద్రమై విగతజీవులుగా పడి ఉన్నాయి. భయంభయంగా ఇంటికి చేరుకున్న హన్నా తాను చూసిన దృశ్యాన్ని భర్త ఎడ్వర్డ్ కు వివరించింది. ఆమె చెప్పింది నమ్మ శక్యంగా లేదనుకున్న ఎడ్వర్డ్ తాను కూడా అక్కడికెళ్లి చూడాలంటూ హన్నా చెప్పిన ప్రాంతానికి వెళ్లాడు. నిజంగానే భార్య చెప్పినట్లు 225 స్టార్ లింగ్స్ అనే పక్షులు చనిపోయి ఉండటాన్ని చూసి షాక్ తిన్నాడు. వెంటనే తనతో తీసుకెళ్లిన కెమెరాలో ఆ దృశ్యాల్ని బంధించాడు. పక్షులు ఎందుకు చనిపోయాయో అర్థంకాకపోవడంతో..ఎడ్వర్డ్ మూగజీవాల సంరక్షణ విభాగానికి, వాతావరణ విభాగానికి సమాచారం అందించాడు. స్పందించిన అధికారులు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా ప్రాంతాన్ని పరిశీలించిన నార్త్ వేల్స్ పోలీసులు ఆ పక్షులు ఎలా చనిపోయాయన్నది ఇప్పుడే చెప్పలేమన్నారు. తాము అనుకున్న కారణాలు నిజమని విచారణలో తేలితే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. సరిగ్గా 12 ఏళ్ల క్రితం ఇదే ప్రాంతంలో ఇలాంటి ఘటనే జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. మొత్తానికి పక్షులు చనిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ మధ్య కాలంలో వచ్చిన ఓ హాలీవుడ్ చిత్రంలో అచ్చం ఇలాగే ఉన్న సీన్ ను నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. ఈ ఘటన ఈ నెల 10వ తేదీన బ్రిటన్ లోని వేల్స్ ప్రాంతంలో జరిగింది.

Next Story