చైనా టూర్ ప్యాకేజీలు రద్దు

By రాణి  Published on  30 Jan 2020 6:25 AM GMT
చైనా టూర్ ప్యాకేజీలు రద్దు

ముఖ్యాంశాలు

  • హడలెత్తిస్తోన్న కరోనా..
  • చైనా ఊసేతెత్తితేనే బెంబేలెత్తుతున్న ప్రజలు
  • టూర్లు క్యాన్సిల్ చేసుకుంటున్న పర్యాటకులు

చైనా..ఏటా లక్షల సంఖ్యలో పర్యాటకులు ఈ దేశానికి వస్తుంటారు. కానీ ఇప్పుడు చైనాకి వెళ్లే పర్యాటకుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. పర్యాటకులు తమంతట తామే చైనా పర్యాటనను రద్దు చేసుకుంటున్నారు. వీరిలో ఎక్కువగా చైనా విహారయాత్రకు వెళ్లేది తెలుగువారే కావడం గమనార్హం. ప్రపంచ దేశాల్ని హడలెత్తిస్తోన్న 'కరోనా'నే దీనంతటికి ముఖ్య కారణం. ఒక్క చైనాకే కాదు...ఏ దేశానికి వెళ్లాలన్నా భయమే. కొంతమంది టూర్ వెళ్దామని చేసుకున్న ప్లాన్లను రద్దు చేసుకుంటే...మరికొంతమంది తమ టూర్ ఆపరేటర్లను సంప్రదించి ప్యాకేజీలను రద్దు చేసుకుంటున్నారు. చైనాకు రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయి. ఏటా తెలంగాణ నుంచి 65 వేల వరకూ, ఏపీ నుంచి 30-35 వేల మంది చైనాకి వెళ్లే పర్యాటకుల్లో ఉంటారు. ఎక్కువగా చైనాలోని బీజింగ్, షాంఘై నగరాలతో పాటు ప్రధానంగా ఆకర్షించే నగరం హాంకాంగ్ కే పర్యాటకులు వెళ్తుంటారు. అంతేకాదు చైనాలో ఫర్నిచర్లు కూడా చాలా తక్కువ ధరలకే దొరుకుతాయి. విహారయాత్రతో పాటు పనిలో పనిగా ఇంటిలోకి కావాల్సిన ఫర్నిచర్ షాపింగ్ కూడా చేసేస్తారు.

అలాగే ఇండియాతో పోలిస్తే...చైనాలో మెడిసిన్ చదివేందుకు అయ్యే ఖర్చు తక్కువ. దీంతో కొన్నేళ్ల నుంచి పెద్దసంఖ్యలో విద్యార్థులు చైనాలోని చెంగ్డూ, వుహాన్ నగరాల్లో విద్యనభ్యసించేందుకు అక్కడికి వెళ్తుంటారు. విద్యార్థుల కోసం హైదరాబాద్ నుంచి చైనాకు వారానికోసారి టూర్ ప్యాకేజీలు ఇస్తున్నారు టూర్ ఆపరేటర్లు. రూ.70 వేల నుంచి లక్ష రూపాయల వరకూ ఉండే ఈ ప్యాకేజీలో విమాన టికెట్లు, ఇండియా భోజనం, వసతి, స్థానిక రవాణా తదితర సదుపాయాలుంటాయి. అయితే వుహాన్ నగరం నుంచే కరోనా వైరస్ ప్రబలుతుండటంతో అక్కడున్న భారతీయ విద్యార్థులు భయభ్రాంతులకు గురవుతున్నారు. వారిని క్షేమంగా ఇండియాకి తీసుకువచ్చేందుకు మోదీ సర్కారు ఏర్పాట్లు చేస్తోంది.

డిస్నీల్యాండ్ మూసివేత

కరోనా ప్రభావంతో ఒక్క హైదరాబాద్ లోనే సుమారు 100 మంది ఆపరేటర్ల బిజినెస్ దెబ్బతింటోంది. హాంకాంగ్ లోని డిస్నీ లాండ్ (చిన్నారుల వింత ప్రపంచం) ను కూడా అక్కడి ప్రభుత్వం తాత్కాలికంగా మూసివేసింది. డిస్నీ ల్యాండ్ థీం పార్క్ ను ప్రపంచ దేశాల నుంచే పర్యాటకులు పెద్దసంఖ్యలో సందర్శిస్తారు. దీనిని మొదటగా అమెరికాలో ఏర్పాటు చేసిన సంస్థ..తర్వాత ప్యారిస్, హాంకాంగ్ లో ఏర్పాటు చేసింది. ఏటా పిల్లలకు వేసవి విడిది కోసం తల్లిదండ్రులు అక్కడికి వెళ్లి వస్తుంటారు. అయితే...కరోనా దృష్ట్యా కొంతకాలం పాటు డిస్నీ ల్యాండ్ ను మూసివేయాలని అమెరికా సంస్థ నిర్ణయించినట్లు సమాచారం.

వెలవెలబోతున్న ఎగ్జిబిషన్లు

ఇతర దేశాల నుంచి వచ్చే పర్యాటకులను ఆకర్షించేందుకు గాను చైనా టూర్ ఆపరేటర్లు పెద్దఎత్తున ఎగ్జిబిషన్లను నిర్వహిస్తుంటారు. ఏటా జనవరి 28-31 తేదీల్లో ఢిల్లీ, ముంబై నగరాల్లో ఈ ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేసి..ఇతర నగరాల నుంచి టూర్ ఆపరేటర్లను ఆహ్వానిస్తారు. అక్కడే చైనా , మనదేశంలోని టూర్ ఆపరేటర్లకు మధ్య ఒప్పందాలు జరుగుతుంటాయి. ఈసారి మాత్రం కరోనా భయంతో ఈ ఎగ్జిబిషన్లు కూడా వెలవెలబోతున్నాయి.

Next Story