బ్రేకింగ్: పాపం పండింది.. హాజీపూర్‌ శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష ఖరారు

By సుభాష్  Published on  6 Feb 2020 1:07 PM GMT
బ్రేకింగ్: పాపం పండింది.. హాజీపూర్‌ శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష ఖరారు

హాజీపూర్‌ వరుస హత్య కేసులో నల్గొండ ఫోక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. సైకోకిల్లర్‌ శ్రీనివాస్‌రెడ్డిని దోషిగా తేల్చిన న్యాయస్థానం.. ఉరిశిక్ష ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది. ముగ్గురు మైనర్‌ బాలికల అత్యాచారం, హత్య కేసుల్లో ఈ తీర్పు వెలువరించింది. 90 రోజుల్లో విచారణ పూర్తి చేసిన కోర్టు.. మొత్తం 101 మంది సాక్షులను విచారించింది. శ్రీనివాస్‌ రెడ్డిపై నేరం రుజువు కావడంతో ఉరిశిక్ష విధిస్తున్నట్లు జడ్జి స్పష్టం చేశారు.

యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్‌లో ముగ్గురు బాలికలపై అత్యాచారం, హత్యల కేసుల్లో శ్రీనివాస్‌ రెడ్డి దోషిగా తేల్చింది. అతడికి ఉరే సరైన శిక్ష అని కోర్టు అభిప్రాయపడింది. శ్రవణి కేసులో ఉరిశిక్ష, కల్పన కేసులో ఉరిశిక్ష, మనీషా కేసులో జీవిత ఖైదుగా విధించింది. ఈ కేసులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫోక్సో ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఈ రోజు తుదితీర్పునిచ్చింది.

గత ఏడాది ఛార్జిషీట్‌

ముగ్గురు మైనర్‌ బాలికలపై అత్యాచారానికి పాల్పడి, అత్యంత దారుణంగా చంపేసినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. 2019 జులై 31న కోర్టులో ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. ఫోరెన్సీ రిపోర్టులో కూడా శ్రీనివాస్‌ రెడ్డి చేసిన దారుణాలు బయటపడ్డాయి. కిల్లర్‌ శ్రీనివాస్‌ సెల్‌ఫోన్‌లో ఉన్న మెసేజ్‌లు, వీడియోల ఆధారంగా ఈ దారుణానికి పాల్పడినట్లు తేలింది. ఇక శ్రీనివాస్‌ రెడ్డికి ఉరిశిక్ష విధించాలంటూ బాధిత కుటుంబీకులు, గ్రామస్తులు సైతం పెద్ద ఎత్తున డిమాండ్‌ చేశారు.

ఈకేసుపై విచారణ చేపట్టిన పోలీసులు 300 మంది సాక్షులను ప్రశ్నించగా, అందులో 101 మంది వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఈ కేసులో నాకు ఎలాంటి సంబంధం లేదని, తాను ఏ నేరం చేయలేదని శ్రీనివాస్‌రెడ్డి జడ్జి ముందు చెప్పుకొచ్చారు. శ్రీనివాస్‌రెడ్డి నేరం చేశాడని నిరూపించేందుకు డీఎన్‌ఏ పరీక్షలు, పోస్ట్‌ మార్టం రిపోర్ట్‌, సంఘటన స్థలంలో దొరికి ఆధారాలు, సెల్‌ ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారాలుగా నిలిచాయి. అలాగే గ్రామంలో అదృశ్యమైన ముగ్గురు బాలికల మృతదేహాలు ఉరి శివార్లో పాడుబడిన బావిలో లభ్యమయ్యాయి. ఓ బాధితురాలిని శ్రీనివాస్‌ రెడ్డి బైక్‌పై లిప్ట్‌ ఇచ్చి తీసుకెళ్లినట్లు సీసీటీవీ పుటేజ్‌ కూడా లభ్యమయ్యాయి. ఇలా పూర్తి ఆధారాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు. దీంతో నేరం రుజువు కావడంతో కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది.

Next Story