వెలగపూడిలో జరుగుతున్న కేబినెట్ భేటీ వార్తలు, రాజధాని తరలింపు వద్దంటూ రైతులు చేస్తున్న ఆందోళనలను కవరేజ్ చేసేందుకు వచ్చిన మీడియా ప్రతినిధులపై జరిగిన దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు గుంటూరు రేంజ్ ఐజీ వినీత్ బ్రిజల్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. రైతుల ముసుగులో కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు మీడియా వారిపై దాడికి పాల్పడినట్లుగా గుర్తించామన్నారు. మీడియా వాహనంపై రాళ్ల దాడి చేసి, ధ్వంసం చేయడం హేయమైన చర్య అని, దాడికి పాల్పడిన వారిని గుర్తించి..వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. మీడియా వాహనంపై జరిగిన దాడిలో మహిళా రిపోర్టర్ తో పాటు కెమెరా మెన్, ఇతర జర్నలిస్ట్ లు గాయపడినట్లు ఆయన తెలిపారు.

ముఖ్యమంత్రి జగన్‌ ఏపీకి మూడు రాజధానులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీలో పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఉద్దండరాయునిపాలెంలో నిరసన దృశ్యాలను చిత్రీకరిందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులపై మహిళలు దాడి చేశారు. రాజధాని మహిళలతో ఓ మీడియా అనుచితంగా మాట్లాడటంతో మహిళలు దాడికి దిగినట్లు తెలుస్తోంది. మహిళా యాంకర్‌, కెమెరామెన్‌లను వెంటపడి మరి దాడి చేసినట్లు సమాచారం. కాగా, అక్కడున్న మహిళలు మమ్మల్ని చూపించమని అడగడంతో, అందుకు మీడియా ప్రతినిధులు మీరు కూలీలు అని సంబోధించడంతో మహిళలు తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది. జగన్‌ మూడు రాజధానులు ప్రకటించిన నేపథ్యంలో తాము నిరసనలు, ఆందోళనలు చేపడుతుంటే మీకు కూలీలుగా కనిపిస్తున్నామంటూ వారిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తినట్లు తెలుస్తోంది.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.