కోడిగుడ్ల గురించి నమ్మలేని నిజాలు

By రాణి  Published on  29 Jan 2020 10:30 AM GMT
కోడిగుడ్ల గురించి నమ్మలేని నిజాలు

ముఖ్యాంశాలు

  • గుండె జబ్బులున్నవాళ్లు హాయిగా గుడ్లు తినొచ్చు
  • రోజుకో కోడి గుడ్డు తినడంవల్ల పోషకాలు లభిస్తాయి
  • అంతర్జాతీయ స్థాయిలో జరిగిన లోతైన పరిశోధనలు
  • ఉడకబెట్టిన గుడ్లను తినడంవల్ల ఎక్కువ లాభాలు
  • తాజా అధ్యయనాలు వెల్లడించిన అద్భుత ఫలితాలు
  • అతి చవకలో దొరికే అత్యంత విలువైన పోషకాహారం

కోడిగుడ్డు ఆరోగ్యానికి మంచిదా? కాదా? కోడిగుడ్డు తింటే గుండె జబ్బులకు దూరంగా ఉండొచ్చా? లేదా? ఎప్పట్నుంచో సామాన్యులు ఈ ప్రశ్నలతో సతమతమైపోతున్నారు. ఎటూ తేల్చుకోలేక నలిగిపోతున్నారు. కానీ సర్వసాధారణంగా జన సామాన్యంలో ప్రచారంలో ఉన్న విషయం ఏంటంటే కోడిగుడ్డువల్ల ఆరోగ్యానికి మేలేకానీ కీడు లేదని. కోడిగుడ్డులో గుండెకు హానిచేసే చెడుకొలెస్టాల్ లేనందువల్ల నిర్భయంగా నిరభ్యంతరంగా తీసుకోవచ్చనీ, ముఖ్యంగా ఉడకబెట్టిన గుడ్డైతే మరీ శ్రేష్ఠమనీ డాక్టర్లుకూడా చెబుతున్నారు. రోజుకు కనీసం ఒక ఉడకబెట్టిన గుడ్డును తీసుకుంటే పోషకాహార లోపంనుంచి కొంతలో కొంతైనా బయటపడొచ్చని డైటీషియన్ల సలహాకూడా. అందుకే సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో పిల్లలకు ప్రత్యేకంగా రోజూ ఓ గుడ్డునుకూడా ఆహారంలో కచ్చితంగా ఇవ్వాలన్న నిబంధనలనుకూడా ప్రభుత్వం విధించింది.

మెక్ మాస్టర్ యూనివర్సిటీ ఆండ్ హ్యామిల్టన్ హెల్త్ సైన్సెస్ చేసిన రీసెర్చ్ ఫలితాలు ఈమధ్యే అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ లో పబ్లిష్ అయ్యాయి. అంతర్జాతీయ స్థాయిలో చాలా లోతుగా బోలెడంత డేటాను సేకరించి విశ్లేషించిన తర్వాతే ఆధ్యయనంలో వెల్లడైన ఫలితాల్ని ఈ జర్నర్ లో ప్రచురించారు. కనీసం ఆహారంలో రోజుకో గుడ్డును, అదీ ఉడకబెట్టిన గుడ్డును తీసుకోవడంవల్ల గుండె జబ్బులకు సంబంధించిన సమస్యలున్న వారిలో రిస్క్ శాతం చాలా చాలా తక్కువగా ఉంటుందనీ, గుండెజబ్బులవల్ల ఎదురయ్యే మరణాన్ని కేవలం ఒక ఉడకబెట్టిన గుడ్డును రోజూ తీసుకోవడం ద్వారా చాలా ఏళ్లు వెనక్కి నెట్టేయొచ్చనీ ఆధ్యయనం స్పష్టం చేసింది.

అలాగే గుడ్డూకూ కొలస్ట్రాల్ కీ ఏమాత్రం సంబంధంలేదనీ, గుడ్డు తినడంవల్ల కొలస్ట్రాల్ పెరగడం అనే సమస్య ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్పన్నం కాదనీ తాజా అధ్యయనాల్లో తేలింది. ముందటి అధ్యయనాల్లో హృద్రోగులు వారానికి మూడు గుడ్లకంటే ఎక్కువ తీసుకోవడం మంచిదికాదని చాలామంది చెప్పారు. కానీ అవన్నీ పూర్తిగా అవాస్తవాలని చక్కగా, హాయిగా రోజుకో గుడ్డు తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులూ ఉండవని తాజా అధ్యయనాలు స్పష్టం చేశాయి. పాపులేషన్ హెల్త్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ చేసిన మూడు అధ్యయనాలను వర్సిటీ అధ్యయనం పూర్తిగా పరిగణనలోకి తీసుకుని విశ్లేషించింది. 21 దేశాల్లో 1.46.011 మందిని పూర్తిగా విశ్లేషణాత్మకంగా పరిశీలించిన తర్వాతే తాజా ఆధ్యయనం తన ఫలితాలను వెల్లడించింది. ఇందులో 31.544 మంది గుండె జబ్బులతో బాధపడేవాళ్లుకూడా ఉన్నారు.

50 దేశాలకు సంబంధించి గుడ్డును రోజూ ఆహారంగా తీసుకునేవాళ్లను పరిశీలించడం జరిగింది. దీంట్లో ఆరు దేశాలకు సంబంధించిన వారిలో వివిధ ఆర్థిక స్ధాయిలకు సంబంధించినవాళ్లు ఉన్నారు. అందువల్ల తాజా పరిశోధనల ఫలితాలు చాలా పక్కాగా పకడ్బందీగా ఉన్నాయని తేలింది. సో ఎగ్ లవర్స్ బీ హ్యాపీ. చక్కగా రోజుకో గుడ్డును తీసుకుని ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. అందులోనూ ఉడకబెట్టిన గుడ్డైతే మరీ మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Next Story