భారత్‌లో ముగ్గురికి మాత్రమే కొవిడ్‌-19 లక్షణాలు

By Newsmeter.Network  Published on  13 Feb 2020 4:21 PM GMT
భారత్‌లో ముగ్గురికి మాత్రమే కొవిడ్‌-19 లక్షణాలు

చైనాలో విజృంభిస్తున్న కొవిడ్‌-19(కరోనా వైరస్‌) ప్రపంచ దేశాలను కలవరానికి గురిచేస్తున్న నేపథ్యంలో భారత్‌లో నెలకొన్న పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. భారత్‌లో ముగ్గురు వ్యక్తులకు మాత్రమే కొవిడ్‌-19 లక్షణాలు ఉన్నట్లు కేంద్ర ఉన్నతస్థాయి కమిటీ అధికారికంగా వెల్లడించింది. కరోనాపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల ఉన్నతస్థాయి కమిటీ ఇవాళ సమీక్షా సమావేశం నిర్వహించింది. అనంతరం కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్‌ మీడియాతో మాట్లాడారు.

దేశంలో ఇప్పటివరకు 15,991 మంది అనుమానితులను పరిశీలించినట్లు చెప్పారు. వారిలో 1671 మంది కొవిడ్‌-19 అనుమానితుల రక్త నమూనాలను పరీక్షించిన వైద్యులు.. ముగ్గురికి మాత్రమే ఆ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ మూడు కేసులు కేరళలోనే నమోదైనట్లు వెల్గడించారు.

చైనాలోని వుహాన్‌ నగరం నుంచి వచ్చిన 645 మందిని వైద్య శిబిరాల్లో పరిశీలనలో ఉంచినట్లు చెప్పారు. దేశంలోని 21 విమానాశ్రయాల్లో 2,51,447 మంది ప్రయాణికులకు స్ర్కీనింగ్‌ పరీక్షలు నిర్వహించినట్లు మంత్రి వివరించారు. విమానాశ్రయాలతో పాటు అంతర్జాతీయ పోర్టులు, నేపాల్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కూడా స్ర్కీనింగ్‌ టెస్టులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

ఇప్పటి వరకు మొత్తం 28 దేశాల్లో కోవిడ్‌-19 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేశామని, కోవిడ్‌-19 నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కొవిడ్‌-19పై పరిశోధనల బాధ్యత పూణెలోని జాతీయ వైరాలజీ సంస్థకు చెప్పారు.

Next Story