వ‌రుస గ్యాస్ సిలిండ‌ర్ల పేలుళ్లు.. భ‌యాందోళ‌న‌లో హైదరాబాద్ ప్ర‌జానీకం

By Newsmeter.Network  Published on  1 March 2020 7:07 AM GMT
వ‌రుస గ్యాస్ సిలిండ‌ర్ల పేలుళ్లు.. భ‌యాందోళ‌న‌లో హైదరాబాద్ ప్ర‌జానీకం

హైదరాబాద్‌ నగరంలో ఒకే రోజు రెండు సిలిండర్‌ పేలుడు ఘటనలు చోటు చేసుకున్నాయి. దిల్‌సుఖ్‌నగర్‌ పీఅండ్‌టీ కాలనీలో గ్యాస్‌ పేలి ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. గ్యాస్‌ లీకైన వాసన రావడంతో గమనించిన ఇంటి యజమాని.. భార్యాపిల్లల్ని బయటకు పంపించాడు. ఆ తరువాత తన సోదరుడితో కలిసి ఏం జరిగిందో చూద్దామని లైట్లు వేశాడు. దీంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇంటి యజమానితో పాటు రమేష్‌, లక్షణ్‌ అనే ఇద్దరు అన్నదమ్ములు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మలక్‌పేటలో..

మలక్‌పేటలోని వెంకటాద్రి నగర్‌లో అర్థరాత్రి ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించింది. ఆ శబ్దంతో చుట్టు పక్కల ఇళ్లవారంతా ఒక్కసారిగా భయపడ్డారు. ఇళ్ల నుంచి పరుగులు తీశారు. కాసేపు అయ్యాక.. శబ్దం వచ్చిన ఇంటి దగ్గరికి వెళ్లి ఏమైందని చూశారు.. తీరా అక్కడ పేలింది గ్యాస్‌ సిలిండర్. గ్యాస్‌ సిలిండర్‌ పేలుడు ధాటికి ఇళ్లు గేటుతో పాటు, అద్దాలు, పైకప్పు సైతం ముక్కలైంది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సిలిండర్‌ పేలడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గ్యాస్‌ సిలిండర్ పేలడానికి ప్రధాన కారణం ఫ్రిజ్‌ అని పోలీసులు భావిస్తున్నారు. ఒక్కసారిగా సిలిండర్‌ పేలడంతో ఇంటికి దగ్గరగా నిలిపి ఉన్న పలు వాహనాలు కూడా దగ్ధమయ్యాయి.

ఫ్రిజ్‌ వల్ల గ్యాస్‌ సిలిండర్‌ ఎందుకు పేలుతుంది.?

ఇంట్లో ఫ్రిజ్‌ పక్కనే ఎప్పుడూ కూడా సిలిండర్‌ పెట్టుకోవద్దు. ఒక వేళ ఫ్రిజ్‌ పక్కనే సిలిండర్‌ పెట్టినట్లైతే.. ఫ్రీజ్‌ తరచుగా దానంతటట అదే ఆన్‌, ఆఫ్‌ అవుతుంది. ఇలా ఒక్కసారిగా ఫ్రిజ్‌ ఆన్‌ అయిన తర్వాత ఆక్సిజన్‌ విడుదల అవుతుంది. ఈ క్రమంలో సిలిండర్‌ నుంచి గ్యాస్‌ లీకైతే.. అంతే సంగతులు. రెండు కలవడంతో ఒక్కసారిగా గ్యాస్‌ సిలిండర్‌ పేలుతుంది. ఇప్పటికైనా జాగ్రత్త వహించి ఫ్రిజ్‌ను సిలిండర్‌ దూరం పెట్టడం మేలు. కనీసం 10 అడుగుల దూరంలో ఫ్రిజ్‌ని పెట్టడం మేలు. వీలైతే వేరే గదిలో కూడా పెట్టుకోండి.

Next Story