రిఫైన్డ్ నూనె వద్దు.. గానుగ నూనే ముద్దు

By Newsmeter.Network  Published on  18 Feb 2020 11:42 AM GMT
రిఫైన్డ్ నూనె వద్దు.. గానుగ నూనే ముద్దు

“ఛీ.. ఉప్పుతో పళ్లు తోముకుంటున్నావా? ఏబ్రాసిలాగా... వెర్రి పప్పలాగా... మారవా? ఇకనైనా టూత్ పేస్టుకి మారవా?” కొన్నేళ్ల క్రితం వరకూ ఇవే మాటు వినిపించేవి. ఇప్పుడు “మీ టూత్ పేస్టులో ఉప్పుందా?” అని దూసుకొచ్చి, దూరొచ్చి మరీ అడిగేస్తున్నారు. మొన్నటి దాకా “ఏమిటీ కొబ్బరినూనె, మందార తైలం పెడతారా... యూ ఓల్డ్ ఫ్యాషన్డ్ పీపుల్” అని ఈసడించుకున్న వారు ఇప్పుడు ప్రాచీన తైలాలను తెచ్చుకుని తైల స్నానాలు చేస్తున్నారు. పాలిష్డ్ బియ్యం కోసం తహతహలాడిన వారు ఇప్పుడు కొర్రలు, సజ్జలు, జొన్నలు అంటూ దండకాలు వల్లిస్తున్నారు. ఇప్పుడు ఈ జాబితాకి మరొకటి చేరింది.

రిఫైన్డ్ ఆయిల్... పెద్ద పెద్ద బ్రాండ్ల భుజకీర్తులను మోసే వంట నూనెలు ఇంటింటా నాట్యమాడేవి. గానుగలో తీసిన నూనె పేరు వింటే చాలు మూతి ముడిచి, ముక్కు వంకరగా తిప్పేవాళ్లు. ఇప్పుడు మళ్లీ మనం మరిచిపోయిన గానుగ నూనె పై మనసులు మళ్లాయి. ఆరోగ్యానికి గానుగ నూనె ఎంతో మంచిదని ఇప్పుడు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దాంతో వంటింట్లోకి ఆరోగ్యానికి అమ్మమ్మ లాంటి గానుగ నూనె నెమ్మదిగా వచ్చేస్తోంది.

కంపెనీ నూనెల కన్నా కలిమి, బలిమి!

కంపెనీలు తీసే నూనెలో విత్తనాలను వేడిచేయాల్సి ఉంటుంది. అదే గానుగలో విత్తనాలను ఎండబెట్టాలి. తద్వారా తేమను తొలగించాలి. ఆ తరువాత గానుగ ఆడించితే నూనె వస్తుంది. ఆడించడం వల్ల 30 నుంచి 40 డిగ్రీల వరకూ వేడి పుట్టినా యంత్రాల వల్ల పుట్టే వేడి కన్నా ఇది చాలా తక్కువ.. ఇలా చేయడం వల్ల నూనెలోని పోషకాలు నాశనమైపోవు. ఇలా గానుగ ఆడగా మిగిలిపోయన తెలగపిండిని వంటల్లో వాడుకోవచ్చు. జంతువులకు ఆహారంగా వేయవచ్చు. ఇంగ్లీషులో ఈ పద్ధతిని కోల్డ్ ప్రెస్సింగ్ అంటారు. ఈ కోల్డ్ ప్రెస్సింగ్ భారతీయ వాతావరణానికి మంచిదని ఇప్పుడు నిపుణులు చెబుతున్నారు. ఇది చాలా ఆరోగ్య కరమైనదని కూడా వారంటున్నారు. రిఫైన్డ్ ఆయిల్ లో కాన్సర్ కారకాలున్నాయని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

మనవంటింటికి గానుగ నూనే మేలు

స్థానికంగా దొరికే నూనె గింజలనుంచి నూనె తీసే స్థానిక పద్ధతులే మేలు అంటున్నారు ఆహార నిపుణులు. భారతీయుల వంటల తయారీకి గానుగలో ఆడించిన నూనెలే శ్రేయస్కరమని వారంటున్నారు. బాదం, నువ్వులు, ఆవాలు, పల్లీలు, కొబ్బరి నుంచి తీసిన నూనె వాడకానికి మంచిదని వారంటున్నారు. రిఫైన్ కానటువంటి గానుగ నూనె లో పోషకాలు పుష్కలంగా ఉంటాయని వారంటున్నారు. రాను రాను పరాఠాల నుంచి మనం పిజ్జాలకు మారిపోయాం. పాశ్చాత్య వంటకాలు మన వంటింట్లోకి దూరి వచ్చేశాయి. స్టీమింగ్, స్టూయింగ్, బేకింగ్, రోస్టింగ్ వంటి వంట విధానాలు మనకు అలవాటైపోయాయి. వీటన్నిటికీ రిఫైన్డ్ ఆయిల్ వాడటం ఫరవాలేదు. కానీ భారతీయ వంటకాలకు భారతీయ పద్ధతిలో తీసిన నూనే మంచిదని ఇప్పుడు పరిశోధనలు తేలుస్తున్నాయి.

పర్యావరణానికి మేలు

ఇక పర్యావరణ వాదులు కూడా గానుగ నూనెకు పచ్చజెండా ఊపుతున్నారు. దీని వల్ల మినిమమ్ కార్బన్ ఫుట్ ప్రింట్ ఉంటుంది. ఆరోగ్యానికి మంచిదని, ఇందులో ఉన్న సాచ్యురేటెడ్ ఫ్యాట్స్, మోనో సాచురేటెడ్ ఫ్యాట్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ కాలుష్య కారకాలు కావు. ఇందులో పిప్పిని పారేయడం కూడా ఉండదు.దానిని తెలగపిండిగా వాడుకోవడం జరుగుతుంది. కాబట్టి రీసైక్లింగ్ కూడా ఉంది. మొత్తం మీద ఇది పర్యావరణానికి ఎలాంటి కీడు చేయవు.

సో... ఇన్నాళ్లూ పనికిరావని, మూలన పారేసిన గానుగల్ని మళ్లీ శుభ్రం చేయండి. మళ్లీ వాటిని ఆడించండి.

Next Story