మహిళా కొరియోగ్రాఫర్ కు లైంగిక వేధింపులు.. ఆమె ఏం చేసిందంటే..
By Newsmeter.Network Published on 28 Jan 2020 4:35 PM IST
ఎన్ని చట్టాలు వచ్చినా.. మహిళలపై వేదింపులు ఆగడం లేదు. బహిరంగ ప్రదేశాల్లోనే కాదు పని చేసే ఆఫీసుల్లో మహిళలు వేదింపులను ఎదుర్కొంటున్నారు. తాజాగా ఓ 33 ఏళ్ల మహిళా కొరియోగ్రాఫర్.. మహారాష్ట్ర మహిళా కమిషన్, అంబోలి పోలీస్ స్టేషన్‌లలో ఫిర్యాదు చేసింది. కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య అశ్లీల చిత్రాలు చూడాలని ఒత్తిడి చేస్తూ తనను లైంగికంగా వేధిస్తున్నాడని అందులో పేర్కొంది.
ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ (ఐఎఫ్‌టీసీఏ) ప్రధాన కార్యదర్శి కూడా అయిన గణేష్ ఆచార్య తన ఆదాయంలో కమీషన్ అడిగేవాడనీ, అశ్లీల వీడియోలు చూడాలని ఒత్తిడి చేసేవాడని ఫిర్యాదులో తెలిపింది. ఐఎఫ్‌టీసీఏ ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత గణేష్ ఆగడాలు మితిమీయాయన్నారు. గణేష్ కోరికను తిరస్కరించడంతో.. తన ఐఎఫ్‌టీసీఏ సభ్యత్వాన్ని తొలగించారని ఆరోపించారు. తనకు ఎక్కడ కూడా పని లభించకుండా ఇతర కొరియోగ్రాఫర్లకు లేఖలు రాశాడని, తన పట్ల కక్ష సాధించడం కోసమే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. గతంలో సీనియర్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ సైతం గణేష్ ఆచార్య డ్యాన్సర్లను వేధిస్తున్నారని ఆరోపించడం గమనార్హం.