అమరావతిలో కొత్త పెట్టుబడులు వద్దు – రాష్ట్ర సమగ్ర అభివృద్ధే ముద్దు

By రాణి  Published on  25 Dec 2019 8:34 AM GMT
అమరావతిలో కొత్త పెట్టుబడులు వద్దు – రాష్ట్ర సమగ్ర అభివృద్ధే ముద్దు

ముఖ్యాంశాలు

  • అమరావతిలో కొత్త పెట్టుబడులకు జి.ఎన్.రావ్ కమిటీ వ్యతిరేకత
  • పట్టణాలకంటే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచన
  • కోస్తాంధ్ర, రాయలసీమ అభివృద్ధికోసం కృషి చేయాలని సూచన
  • గత ప్రభుత్వం అటవీ భూములను డీ నోటిఫై చేయడంపై విమర్శ
  • అర్బన్ అగ్రికల్చర్, సోలార్ ఫార్మింగ్ లపై దృష్టి పెట్టాలని సూచన

విజయవాడ : రాజధాని ఏర్పాటుపై అధ్యయనం చేసి నివేదికను సమర్పించడానికి వై.ఎస్.ఆర్.సి.పి ప్రభుత్వం ఏర్పాటు చేసిన జి.ఎన్.రావ్ కమిటీ అమరావతిలో పెట్టుబడులు పెట్టడాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకించింది. కేవలం అవసరమైన మేరకు మాత్రమే అభివృద్ధి పనుల్ని ఇక్కడ ముందుకు తీసుకెళ్లాలంటూ కమిటీ స్పష్టమైన అభిప్రాయాన్ని తెలిపింది తన నివేదికలో. అమరావతి పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిన ప్రాంతం మధ్యలో ఉన్నందువల్ల ఈ నిర్ణయం సబబైనదంటూ కమిటీ తన నివేదికలో పేర్కొంది. ఇక్కడ కొత్తగా పెట్టుబడులు పెట్టడంకంటే ఆ నిధులను అభివృద్ధి చేయాల్సిన ప్రదేశాలకు మళ్లించడం ఉత్తమమని కమిటీ అభిప్రాయపడింది. నివేదికలోని పేరా(5)లో ఈ విషయాన్ని కమిటీ సభ్యులు స్పష్టంగా తెలియజేశారు.

అర్బన్ అగ్రికల్చర్, సోలార్ ఫార్మింగ్ లపై దృష్టి పెట్టాలని సూచన

చక్కగా పంటలు పండే భూములను రాజధాని నిర్మాణం కోసమంటూ పాడుపెట్టేకంటే తిరిగి ఆ భూముల్లో బంగారాన్ని పండించుకునే అవకాశం రైతులకు కల్పించడమే ఉత్తమమని కమిటీ నివేదిక చెబుతోంది. అలా కాదని మొత్తంగా అమరావతిని మాత్రమే అభివృద్ధి చేసుకుంటూ పోతే భవిష్యత్తులో హైదరాబాద్ లో ఎదురైన పరిస్థితినే మరోసారి ఎదుర్కోవాల్సి రావొచ్చని కమిటీ సూచించింది. మొత్తంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేసే సమగ్రమైన ప్రణాళికలను తమ నివేదికలో సూచించామని కమిటీ తెలిపింది. కమిటీ నివేదికను మూడు రోజులక్రితమే నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి సమర్పించిన విషయం తెలిసిందే. తర్వాత దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో అభ్యంతరాలను లేవనెత్తిన విషయమూ తెలిసిందే.

మూర్ఖంగా అమరావతినే అభివృద్ధి చేసుకుంటూ పోవాలన్ననిర్ణయం వల్ల ప్రాంతాలమధ్య అసమానతలు చోటుచేసుకుంటాయనీ, సంపద సమానంగా పంపణీ కాకపోవడం వల్ల ఉన్నచోటే ఆర్థికపరమైన అసమానతలు పెరిగిపోతాయనీ కమిటీ సూచించింది. ఈ కారణంగా అర్బన్ ప్రాంతాల్లో అభివృద్ధిమీద దృష్టి పెట్టడంకంటే గ్రామీణ ప్రాంతాలపై ఈ విషయంలో ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించడం అవసరమంటోందీ నివేదిక. అమరావతిలో ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన చోటల్లా ఆ పనులను తేలికగా పూర్తి చేసే ఆలోచన చేయాలనీ, భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు పెట్టే ఆలోచన ఏమాత్రం సమంజసం కాదని కమిటీ అంటోంది. అయితే ఇప్పటికే పెట్టిన పెట్టుబడులు మాత్రం వృథా కాకుండా చూసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించింది.

కోస్తాంధ్ర, రాయలసీమ అభివృద్ధికోసం కృషి చేయాలని సూచన

రాయలసీమపై కొంత, కోస్తాంధ్రపై కొంత దృష్టి పెడితే ఆ ప్రాంతాలుకూడా అభివృద్ధి చెందుతాయనీ, దానివల్ల రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోనూ సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందనీ రావ్ కమిటీ పేర్కొంది. ప్రత్యేకించి రిపోర్ట్ లో 42 నుంచి 48 వరకూ అమరావతికి సంబంధించిన స్పష్టమైన సిఫారసులను పి.ఎన్.రావ్ కమిటీ పొందుపరిచినట్టు సమాచారం. కరకట్ట ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి పనులను చేపట్టినా భవిష్యత్తులో వాటివల్ల తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని కమిటీ ఈ నివేదికలో స్పష్టంగా పేర్కొంది. అమరావతిలో ప్రభుత్వ అధీనంలో ఉన్న వ్యవసాయభూముల్లో సోలార్ ప్యానల్స్ ని ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్తును పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేసే అవకాశం కలుగుతుందని, దానిని ఉపయోగించుకుని కాల్వ వెంబడి ఉన్న పొలాలకు చక్కగా నీటి సరఫరా చేసుకోవచ్చనీ కమిటీ అభిప్రాయపడింది. ఈ భూముల్ని అర్బన్ అగ్రికల్చర్ కాన్సెప్ట్ కోసం ఉపయోగించవచ్చని తెలిపింది. అర్బన్ ఫార్మింగ్, సోలార్ పవర్ హార్వెస్టింగ్ విధానాలవల్ల శక్తి వనరుల భద్రత, ఆహార భద్రత, నీటి వనరుల భద్రత చేకూరతాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలకు సంబంధించి ప్రజాధనం వృథా కాకుండా చూసే బాధ్యతను ప్రభుత్వమే స్వీకరించాలని కమిటీ కోరింది. గత ప్రభుత్వం అటవీ భూముల్ని డీ నోటిఫై చేసిన తీరును కమిటీ నిర్ద్వంద్వంగా తప్పు పట్టింది. రహదారుల విస్తరణ, అభివృద్ధి పేరుతో అటవీ భూములను, పచ్చదనాన్ని నష్టం చేసుకోవడం ఏమాత్రం మంచిది కాదని కమిటీ అభిప్రాయపడింది. అమరావతిలో రాజధాని నిర్మాణంకోసం గత ప్రభుత్వం డీ నోటిఫై చేసిన 13వేల హెక్టార్ల అటవీ భూమిని తిరిగి సంరక్షించే బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకోవాలని పి.ఎన్. రావ్ కమిటీ కోరింది.

Next Story