కళాత్మక దృశ్య కావ్యానికి 40 ఏళ్లు
By సుభాష్ Published on 2 Feb 2020 8:22 AM GMTముఖ్యాంశాలు
► స్వర్ణ కమలం అవార్డ్ అందుకున్న తొలిచిత్రం
► సంగీతానికి ప్రాణం పోసిన కెవి. మహదేవన్
► మరుపురాని అనుభూతిని తీసుకువచ్చిన కె. విశ్వనాథ్
తెలుగు సినిమా కీర్తిని ప్రంపచానికి చాటి చెప్పి మరుపురాని అనుభూతిని కలిగించిన కళాత్మక దృశ్య కావ్యం 'శంకరాభరణం' ఈ సినిమా 1980, ఫిబ్రవరి 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అప్పట్లో ఈ తెలుగు సినిమా ఎంతో సత్తాచాటింది. ఈ సినిమా విడుదలైన తర్వాత ఎవరి నోటా విన్నా 'శంకరాభరణం' గురించే. ఈ సినిమా విడుదలై నేటికి 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. కె. విశ్వనాథ్ దర్శకత్వంలో పూర్ణోదయ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు, ఆకాశం శ్రీరాములు తెరకెక్కించారు. ఈ మూవీ తెలుగు ప్రజలనే కాకుండా పక్క రాష్ట్రాల ప్రజలను కూడా మెప్పించింది. ఈ సినిమా ప్రభావితంతో శాస్త్రీయ సంగీతానికి ఆదరణ కరువైన రోజుల్లో ఎంతో మంది శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం ప్రారంభించారు. ఈ చిత్రానంతరం చిత్రదర్శకుడు కె.విశ్వనాధ్ కళా తపస్విగా పేరొందారు.
స్వర్ణ కమలం అవార్డ్ అందుకున్న తొలి చిత్రం
ఈ చిత్రం విడుదలై ఇన్ని సంవత్సరాలు అయినా మర్చిపోలేనిది. తెలుగువాళ్లు గర్వంగా చెప్పుకునే సినిమా ఇది. స్వర్ణ కమలం అవార్డ్ అందుకున్నతొలి చిత్రం ఇదే. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు బెస్ట్ సింగర్‌గా తొలి సారిగా జాతీయ అవార్డును అందుకున్నారు కూడా. అంతే కాకుండా శ్రీమతి వాణి జయరాంకు ఉత్తమ గాయకురాలిగా, కెవి. మహదేవన్‌కు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు వరించింది.
కథ విషయానికొస్తే..
ఇక కథ విషయానికొస్తే.. ఈ సినిమా కథానాయకుడు శంకరశాస్త్రి ఓ వేశ్య (తులసి)కు ఆశ్రయం ఇస్తాడు. దీనికి తోడు సంగీతానికి ఆదరణ కరువై ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటుంటాడు. మరోవైపు తనపై జరిగిన అత్యాచారం కారణంగా తులసి ఓ బిడ్డకు జన్మిస్తుంది. దీంతో చివరకు వేశ్య కొడుకే శంకరశాస్త్రి సంగీత వారసుడు అవుతాడు. ఇలా సినిమాలో ప్రతి సన్నివేశం కూడా అందరిని ఆకట్టుకునేలా ఉంది.
సంగీతమే ప్రాణం..
ఈ సినిమాకు కెవి. మహదేవన్ అందించిన సంగీతం ప్రాణంగా నిలిచిందనే చెప్పాలి. జంధ్యాల మాటలు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వాణిజయరాం పాటలు, సోమయాజులు, అల్లు రామలింగయ్య, తులసి, మంజు భార్గవి, బేబీల నటనలు అద్భుతంగా నిలిచాయి. ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల నుంచి నీరాజనాలందుకుంది. అంతేకాదు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచకులు చాగంటి కోటేశ్వరరావు ఈ చిత్రంపైనే మూడు రోజుల పాటు ప్రవచనాలు చేశారంటే ఈ సినిమా విశిష్టత ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాల్లో నటించిన ప్రతి ఒక్కరికి గౌరవం దక్కింది. కాలం మారుతున్నా.. ఈ సినిమా మాత్రం కలకాలం నిలిచి ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహంలేదు.
నటీనటుల ఎంపిక
విజ్ఞానం, గాంభీర్యం, చిరు కోపం లాంటి లక్షణాలు కలిగిన శంకరశాస్త్రి పాత్రకు ముందుగా అక్కినేని నాగేశ్వరరావు, శివాజీ గణేశష్‌లను అనుకున్నారు. కానీ వారిని సంప్రదించలేదు. ఆ తరువాత కృష్ణంరాజుకు కథను వినిపించారు. ఆ పాత్ర తనకు కొత్తని, దాన్ని ప్రేక్షకులు అంగీకరించకపోతే దాని ప్రయోజనం దెబ్బతింటుందని కృష్ణంరాజు తిరస్కరించాడు. చివరకు ఆ పాత్రకు ఓ కొత్త నటుడిని ఎంపిక చేయాలన్న దర్శకుడు విశ్వనాథ్ ఆలోచనను సమర్థించాడు నిర్మాత నాగేశ్వరరావు. ఆ క్రమంలో తనతో కలిసి ఒకప్పుడు నాటకాలు వేసిన జె.వి.సోమయాజులు గురించి విశ్వనాధ్ తో చెప్పాడు నాగేశ్వరరావు. అందుకు గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కూడా సమర్థించాడు.