ముఖ్యాంశాలు

  • ప్రాణహిత నదిలో నాటు పడవ బోల్తా
  • ఇద్దరు ఫారెస్ట్‌ బీట్‌ అధికారుల మృతదేహాలు లభ్యం
  • చింతలమానెపల్లి మండలం గూడెం వద్ద ప్రమాదం

 

కుమురంభీం ఆసీపాబాద్‌ జిల్లా: ప్రాణహిత నదిలో నాటు పడవ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో నదిలో గల్లంతైన ఇద్దరు ఫారెస్ట్ ఆఫీసర్లు బాలకృష్ణ, సురేష్ ల మృతదేహాలు లభ్యమయ్యాయి. నదిలో చేపలు పట్టుకుంటున్న జాలర్ల వలకు ఫారెస్ట్ ఆఫీసర్ల మృతదేహాలు లభ్యమయ్యాయి. చింతల మానెపల్లి మండలం గూడెం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

అయితే ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. చింతలమానెపల్లి మండలంలో బీట్‌ అదికారులు బాదావత్‌ సురేష్‌నాయక్‌, ముంజం బాలకృష్ణ, శివపెల్లి బీట్‌ అధికారి సద్దాం విధులు నిర్వర్తిస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా ప్రాణహిత నది తీరంలో తనిఖీలు చేపడుతుంటారు. అయితే నది వద్దకు బైక్‌పై వచ్చిన అధికారులు అక్కడ్నుంచి ప్రాణహిత నదిపై నిర్మాణ దశలో ఉన్న వంతెనపైకి ఎక్కారు. అనంతరం నడుచుకుంటూ ఆవలిగట్టున ఉన్న మహారాష్ట్ర సరిహద్దుకు చేరుకున్నారు. అటవీ ఉద్యోగిని కలిసిన అనంతరం తిరుగు ప్రయాణంలో నది దాటేందుకు చిన్న నాటు పడవ ఎక్కారు.

అయితే మొత్తం ఆరుగురితో పడవ ఇవతలి గట్టుకు బయల్దేరింది. మార్గమధ్యలో నీటి ప్రవాహం అధికంగా ఉండటం, పడవకు చిన్న చిన్న రంధ్రాలు ఉండి నీరు అందులోకి చేరడంతో ఒక్కసారిగా బోల్తా పడింది. పడవ నడిపేవ్యక్తి, మరో ప్రయాణికుడు ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. బీట్‌ అదికారులు బాదావత్‌ సురేష్‌నాయక్‌, ముంజం బాలకృష్ణ నీట మునిగారు. అయితే ప్రమాదం నుంచి తప్పించుకున్న శివపెల్లి బీట్‌ అధికారి సద్దాం వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై సమచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు నదిలో గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. అయినా లభించలేదు. ఈ క్రమంలో నదిలో చేపలు పట్టుకునే జాలర్ల వలలకు గల్లంతైన ఆఫీసర్ల మృతదేహాలు లభ్యమయ్యాయి.

కాగా.. అధికారులు వివరాల ప్రకారం ఒకరు నాలుగు నెలల క్రితం.. మరొకరు 8 నెలల క్రితమే విధుల్లో చేరినట్లు తెలిపారు. బాదావత్‌ సురేష్‌నాయక్‌ది కెరమెరి మండలం తుమ్మెగూడ గ్రామం. ఇతనికి భార్య ఇదద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం భార్య 9 నెలల గర్భిణి. ముంజం బాలకృష్ణ స్వగ్రాం కాగజ్‌నగర్‌ మండలం చింతగూడ కోయవాగు. ఇతనికి భార్య, ఓ కూమారుడు ఉన్నారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.