ఫ్లైట్ లో సీటు వాల్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఇది చదవండి!!

By సుభాష్  Published on  22 Feb 2020 11:07 AM GMT
ఫ్లైట్ లో సీటు వాల్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఇది చదవండి!!

మన ఆన్ లైన్ ప్రజలకు కొట్టుకోవడానికి మరో టాపిక్ దొరికేసిందోచ్. గతంలో ఫలానా డ్రస్సు నీలంగా ఉందా నల్లగా ఉందా అని తెగ వాదించుకున్నారు. ఇంకో వస్తువు తెలుపా, బంగారు రంగా అన్న విషయంపై పదాలతో పోరాడుకున్నారు. ఇప్పుడు విమానాల్లో ప్రయాణించేవారు తమ సీటును వెనక్కి వాల్చి పడుకోవడం సరైనదేనా కాదా అన్న విషయంలో వితర్కించుకుంటున్నారు. ప్రతివారూ తమ తమ అభిప్రాయాలను ట్విట్లర్ పై విసిరి, వెదజల్లి వివాదం చేస్తున్నారు.

అసలు సంగతేమిటంటే వెండీ అనే విమాన ప్రయాణీకురాలు ఇటీవలే విమానంలో ప్రయాణిస్తూ, కాస్త సేద తీరేందుకు సీటును వెనక్కి వాల్చి, కాస్త ఒరిగింది. దీంతో వెనక సీటులో ఉన్న వ్యక్తి ఆమె సీటును తొమ్మిది సార్లు ముందుకు తోయడమో, మోకాలుతో నెట్టడమో చేశారు. అతని ప్రవర్తన బాగా లేదంటూ ఆమె ట్విట్టర్ లో రచ్చ చేసింది. అతను తంతున్న విడియోను కూడా పోస్టు చేసింది. దీనిపై సోషల్ మీడియా లో పెద్ద వివాదమే చెలరేగింది. అది నిట్టనిలువునా చీలిపోయింది. కొందరు వెండీకి వెన్నుదన్నుగా నిలిస్తే , ఇంకొందరు వెనక సీటులో కూర్చున్న వ్యక్తిని వెనకేసుకొచ్చారు.

తనకు మెడ నొప్పి ఉందని, పలు సర్జరీలు జరిగాయని, అందుకే తప్పనిసరై సీటును వెనక్కి వాల్చి కాస్త సేదానని వెండీ చెబుతోంది. కానీ వెనక సీట్లో కూర్చున్న వారి ఇబ్బందులను కూడా పట్టించుకోవాలని పలువురు అంటున్నారు. క్లింటన్ సెక్స్ స్కాండల్ ఫేమ్ మోనికా లూయిన్ స్కీ అయితే మహిళలపై వేధింపుల దాకా వెళ్లిపోయింది. ఇదే మగవాడు సీటును వెనక్కి వాలిస్తే ఇంత వివాదం అయ్యేదా అని ప్రశ్నించింది.కొందరు వెనక కూర్చున్న వారికి ఇబ్బంది కలిగించేలా హడావిడి చేసిన సదరు మహిళను సైకో అని అభివర్ణించేశారు. సల్మాన్ రష్దీ మాజీ భార్య పద్మా లక్ష్మి అసలు వెనక సీటులో కూర్చున్న పెద్ద మనిషిని విమానంలో నుంచి ఎందుకు దింపివేయలేదని ప్రశ్నించారు. డెల్టా ఎయిర్ లైన్స్ సీఈఓ ఎడ్ బాస్టియన్ సీటును వెనక్కి వాల్చుకుంటే తప్పేమీ లేదని, అయితే వెనక కూర్చున్నవారిని ఒక సారి అడిగితే బాగుండేదని అన్నారు. ఇలా కొందరు ముందు సీటు మహిళ ఇబ్బందుల గురించి, మరి కొందరు వెనకసీటు పురుషుడి కష్టాల గురించి మాట్లాడేశారు.

ఆగస్టు 2014 లో సీటును వాల్చడం విషయమై మియామీ నుంచి పారిస్ కి వెళ్లే ఒక విమానంలో పెద్ద గొడవే జరిగింది. గొడవకు దిగిన ఒక వ్యక్తికి బేడీలు వేసి, విమానాన్ని అత్యవసరంగా బోస్టన్ కు దారి మళ్లించాల్సి వచ్చింది. అదే ఏడాది సె్టెంబర్ లో న్యూయార్క్ నుంచి పామ్ బీచ్ కి వెళ్లే విమానంలో వెనక సీటులో మహిళ ముందు సీటుకి ఉన్న ట్రే పే తల వాల్చి పడుకుంది. ముందు సీటు లో ఉన్న వ్యక్తి హఠాత్తుగా తన సీటును వాల్చేయడంలో ఆమె తలకు గాయమైంఇ. ఇది పెద్ద గొడవకు కూడా దారితీసింది.

చివరికి సీట్లు వాల్చడం పై ఒక సంస్థ సర్వే కూడా నిర్వహించింది. దీనిలో 41 శాతం మంది వెనక సీట్లో వారికి ఇబ్బంది కలిగించేలా సీటును వెనక్కి వాల్చడాన్ని వ్యతిరేకించారు. వెనక కూర్చున్న వారు అభ్యంతరాలు వ్యక్తం చేస్తే సీటును వెనక్కి వాల్చకూడదని 64 శాతం మంది భావించారు. ఒక 20 శాతం మంది తామెన్నడూ తమ సీటును వెనక్కి వాల్చమని తెలియచేశారు.

మామూలుగా విమాన మర్యాదలు ఇలా ఉంటాయి.

  • మామూలుగా వెనక కూర్చున్నవారు భోజనం చేస్తూంటే సీటును వెనక్కి వాల్చకూడదు
  • తక్కువ ప్రయాణ సమయం ఉన్నప్పుడు కూడా ఈ పనిని చేయకూడదు.
  • వెనక కూర్చున్న వ్యక్తి అభ్యంతర పెడితే కూడా సీటును వాల్చడం మంచిది కాదు.
  • వెనక్కి వాల్చడం కూడా నిదానంగా, వెనక ఉన్నవారికి ఇబ్బంది కలగకుండా చేయాలి.
  • నిజంగా అవసరం ఉన్నప్పుడు మాత్రమే సీటును వెనక్కి వాల్చాలి.

అయితే అసలు సమస్య ఇంకొకటుంది. అదేమిటంటే ఎయిర్ లైన్స్ సంస్థలు సీట్ల మధ్య ఎడం (దీన్ని లెగ్ రూమ్ అంటారు) క్రమేపీ తగ్గిస్తూ వస్తున్నాయి. 2000 నాడు లెగ్ రూమ్ 34-35 అంగుళాలు ఉండేది. ఇప్పుడు అది 30-31 కి తగ్గింది. ఉదాహరణకి ఎయిరిండియాలో లెగ్ రూమ్ 31-33 అంగుళాలు ఉంటుంది. స్పైస్ జెట్ లో లెగ్ రూమ్ మరీ 29 అంగుళాలే ఉంటుంది. ఇండిగోలో 30 అంగుళాలు, విస్తరా లో 30-32 అంగుళాల లెగ్ స్పేస్ ఉంటుంది.

Next Story