టర్కీ-సిరియా మధ్య పోరు.. సిరియాకు మద్దతుగా నిలుస్తున్న రష్యా.. ఎప్పుడేమవుతుందో..?

By సుభాష్  Published on  2 March 2020 2:22 PM GMT
టర్కీ-సిరియా మధ్య పోరు.. సిరియాకు మద్దతుగా నిలుస్తున్న రష్యా.. ఎప్పుడేమవుతుందో..?

టర్కీ, సిరియా దేశాల మధ్య గత కొద్దిరోజులుగా తీవ్ర పోరు నడుస్తోంది. తిరుగుబాటు దారులకు టర్కీ మద్దతు ఇస్తుందని భావించిన సిరియా.. టర్కీ సైనికులపై దాడులకు తెగబడింది. దీంతో టర్కీ కూడా సిరియా సైనికులకు దాడులకు పాల్పడింది. ఇరు దేశాలకు చెందిన సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది గాయాలపాలయ్యారు. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ టర్కీపై దాడులు చేయాలని సూచించడం.. టర్కీ సైనికులపై సిరియా దాడికి పాల్పడడం చకచకా జరిగిపోయాయి. టర్కీ కూడా ప్రతీకార దాడులు చేసింది.

తాజాగా సిరియాకు చెందిన రెండు యుద్ధ విమానాలను టర్కీ కూల్చివేసింది. టర్కీ డిఫెన్స్ మినిస్ట్రీ ఈ విషయాన్ని ధృవీకరించింది. తమ డ్రోన్ సహాయంతో రెండు SU-24 విమానాలను కూల్చి వేశామని తెలిపింది. వాయువ్య ఇడ్లిబ్ ప్రాంతంలో విమానాలను కూల్చివేయడం జరిగింది. సిరియాకు చెందిన 'SANA' న్యూస్ ఏజెన్సీ ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని విషయాలను బహిర్గతం చేసింది. ఇడ్లిబ్ ప్రోవిన్స్ వాయువ్య ప్రాంతంలో ఈ దాడులు జరిగాయి. ఏ ఒక్కరి ప్రాణాలు కూడా పోలేదని తెలిపింది. దాడి జరిగిన సమయంలో పైలట్లు ప్యారాషూట్ల సాయంతో సేఫ్ గా కిందకు దిగేసారు. టర్కీ ఇటీవలే పూర్తి స్థాయి మిలిటరీ ఆపరేషన్లకు దిగుతామని చెప్పింది.. చెప్పినట్లుగానే చేసి చూపించింది. సిరియా దళాలు ఇడ్లిబ్ లోని టర్కీ ప్రజలపైన, టర్కీ ఆర్మీ పైనా దాడి చేయాలని ఎయిర్ బేస్ ను వాడుకోవాలని చూసింది.. దీంతో టర్కీ ప్రతి దాడులు నిర్వహించింది. సిరియాలోని అల్-నేరబ్ మిలిటరీ ఎయిర్పోర్ట్ ను కూడా టర్కీ ధ్వంసం చేసిందని స్థానిక వార్తా సంస్థలు తెలిపాయి. సిరియన్ ప్రభుత్వం ప్రస్తుతానికి ఇడ్లిబ్ గగనతలంపై విమానాల రాకపోకలను ఆపివేసింది. ఇడ్లిబ్ గగనతలంపై ఎటువంటి విమానం ప్రయాణించినా దాన్ని తక్షణమే కూల్చివేస్తామని సిరియా ప్రభుత్వం స్పష్టం చేసింది. డిసెంబర్ నుండి అక్కడి పరిస్థులు వేగంగా మారిపోతూ ఉన్నాయి. సిరియన్ దళాలు అలెప్పో ప్రావిన్స్ పై ఆధిపత్యం చెలాయించాలని భావిస్తోంది. దీన్ని టర్కీ తప్పుబడుతోంది. సిరియా ప్రభుత్వం ఫిబ్రవరీ 27న టర్కీ దళాలపై దాడి చేసి 34 మందిని పొట్టనపెట్టుకుంది. 2016 తర్వాత అంత ఎత్తున టర్కీ సైన్యం చనిపోవడం ఎప్పుడూ జరగలేదు. దీంతో టర్కీ కూడా సిరియా దళాలపైన దాడులకు పూనుకుంది.

టర్కీ డిఫెన్స్ మినిస్టర్ హులుసి అకర్ మాట్లాడుతూ ఎనిమిది సిరియా హెలీకాఫ్టర్లను, 103 ట్యాంకర్లు, 72 రాకెట్ లాంఛర్లను ధ్వంసం చేశామని చెప్పుకొచ్చారు. ఆపరేషన్ స్ప్రింగ్ షీల్డ్ కూడా ఇంకా కొనసాగుతోందని ఆయన అన్నారు. టర్కీకి మద్దతుగా అమెరికాతో పాటూ నాటో కూటమి దేశాలు నిలవగా.. సిరియాకు రష్యా మద్దతుగా ఉంది. తాము రష్యాతో ఎటువంటి వైరం కోరుకోవడం లేదని.. సిరియా ప్రభుత్వం చేస్తున్న మారణహోమాలను ఆపడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు. రాడికలైజేషన్, మైగ్రేషన్ ను అడ్డుకోవాలని అనుకుంటున్నామన్నారు.

గత 24 గంటల్లో గ్రీస్ దేశం లోకి చొరబడ్డాలని ప్రయత్నిస్తున్న 10000 మందిని అడ్డుకున్నారు అధికారులు. టర్కీ ఎక్కడ దాడులు చేస్తుందో అన్న భయంతో వలసదారులు గ్రీసులో చొరబడాలని ప్రయత్నించారు. శనివారం ఉదయం నుండి ఆదివారం ఉదయం వరకూ 9972 మంది అక్రమ వలసదారులు ఎవరోస్ ప్రాంతానికి చేరుకున్నారని వారిని అడ్డుకున్నామని గ్రీస్ అధికారులు తెలిపారు. కజకిస్థాన్ లోని అటవీ ప్రాంతం గుండా గ్రీసు లోకి చొరబడ్డాలని ప్రయత్నించారు. 73 మందిని గ్రీక్ అధికారులు అరెస్టు చేశారు. వారంతా ఇడ్లిబ్ ప్రాంతానికి చెందిన వారుగా భావించారు.. కానీ పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, సోమాలియా ప్రాంతాలకు చెందిన వారీగా గుర్తించారు. గ్రీకు దళాలు ఎవరోస్ నదీ తీరం వెంబడి పహారా నిర్వహిస్తున్నారు. అనుమతి లేకుండా గ్రీస్ లోకి ప్రవేశించరాదంటూ లౌడ్ స్పీకర్లలో అక్రమ వలసదారులను హెచ్చరిస్తూ ఉన్నారు.

Next Story