'బోస్టన్ గ్రూప్' అవినీతి కేసుల్లో నిండా కూరుకుపోయిన సంస్థ : దేవినేని

By రాణి  Published on  28 Dec 2019 7:57 AM GMT
బోస్టన్ గ్రూప్ అవినీతి కేసుల్లో నిండా కూరుకుపోయిన సంస్థ : దేవినేని

ముఖ్యాంశాలు

  • రాజధాని ప్రాంత వైసీపీ నేతలు దద్దమ్మలు
  • టీడీపీ మహిళా నేతలను దూషించడమే వారి ధ్యేయం
  • వైసీపీ నేతలకు రైతుల ఉసురు తగులుతుంది - దేవినేని

రాజధాని విషయంలో వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తోన్న తీరుపై మాజీ మంత్రి దేవినేని ఉమ ధ్వజమెత్తారు. అమరావతి గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన విజయసాయిరెడ్డిపై కేసు పెట్టాలని ఉమా మహేశ్వరరావు అన్నారు. శనివారం ఉదయం ఆయన విజయవాడలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. సంక్రాంతి తర్వాత రాజధాని తరలించేలా దొంగల ముఠా నిర్ణయం తీసుకుందని విమర్శించారు. 11 అవినీతి కేసుల్లో ఏ2 ముద్దాయిగా ఉన్న వ్యక్తి రాజధాని తరలింపు పై ప్రకటన ఎలా చేస్తారని దేవినేని ప్రశ్నించారు. భీమిలి, భోగాపురంలో 6 వేలు, విశాఖపట్నంలో 36 వేల ఎకరాలు చేతులు మారాయని ఆయన ఆరోపించారు. నిజానికి విశాఖలో ఇన్ సైడ్ ట్రేడింగ్ చేసింది వైసీపీ నేతలేనని దేవినేని దుయ్యబట్టారు.

భూములిచ్చిన రైతులు కన్నీరు పెడుతుంటే పట్టించుకోని ఈ ప్రభుత్వ నేతలు..టీడీపీ మహిళా నేతలపై విమర్శలు చేయడంలో ముందుంటారని విమర్శించారు. పండుగ కోసం రాజధాని గ్రామాలకు వచ్చేవారిని అడ్డుకుని వెనక్కి పంపడం అత్యంత దారుణమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంత ప్రజలకు కనీసం పాలు కూడా దొరకకుండా షాపులు మూసివేయించడంపై దేవినేని అసహనం చెందారు. రైతుల కంట నీరు తెప్పించి, తిండి దొరకకుండా చేసిన వైసీపీ నేతలకు వారి ఉసురు తగులుతుందని దేవినేని శపించారు.

5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తును అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపుకి అప్పగిస్తారా ? అని ఆయన నిలదీశారు. రాజధాని రైతులకు భయపడిన జగన్‌.. డమ్మీ కాన్వాయ్‌తో సచివాలయానికి వెళ్లారని ఎద్దేవా చేశారు. 6093 గురించి పంచుమర్తి అనురాధ మాట్లాడితే .. మల్లాది విష్ణు హెచ్చరిస్తాడా? అతనిపై దిశ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కనీసం 100 మీటర్లు కూడా నడవలేని జీఎన్ రావు..10 వేల కిలోమీటర్లు నడిచి రిపోర్ట్ ఇచ్చారా ? అని ప్రశ్నించారు.

Next Story
Share it