ఇంగ్లాండ్‌ క్రికెటర్లకు కరోనా భయం.. ఇక నుంచి అవి బంద్‌..

By Newsmeter.Network  Published on  3 March 2020 9:54 AM GMT
ఇంగ్లాండ్‌ క్రికెటర్లకు కరోనా భయం.. ఇక నుంచి అవి బంద్‌..

కరోనా వైరస్‌.. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి దాదాపు 3000 మందికి పైగా మృత్యువాత పడ్డారు. వేల సంఖ్యలో బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా.. కరోనా వైరస్‌ను అంతం చేసే మందును ఇప్పటివరకు కనిపెట్టలేదు. ఇదిలా ఉంటే.. ఈ వైరస్ రోజు రోజుకు విస్తరిస్తుంది. ఇప్పటికే 50కు పైగా దేశాల్లో కరోనా విజృంభిస్తోంది. దీంతో ప్రపంచదేశాలు అప్రమత్తం అయ్యాయి. అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయవద్దంటూ ఆయా దేశాల ప్రజలను హెచ్చరిస్తున్నాయి. కరోనా వల్ల క్రీడారంగానికి కూడా తిప్పలు తప్పలేదు. షూటింగ్‌ ప్రపంచకప్‌ సహా ఎన్నో టోర్నీలు వాయిదా పడ్డాయి.

కరోనా వైరస్‌ ముప్పును తప్పించుకునేందుకు ఇంగ్లాండ్‌ క్రికెటర్లు కొత్త ఎత్తుగడకు దిగారు. ఈ నెలలో శ్రీలంకలో ఇంగ్లాండ్‌ టీమ్‌ పర్యటించనుంది. వైరస్‌ ఇప్పుడు మనిషి నుంచి మనిషికి సోకే స్థాయిలో ఉండడంతో ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లతో కరచాలనం చేయకూడదని ఇంగ్లండ్‌ క్రికెట్ జట్టు నిర్ణయించుకుంది. క్రికెట్‌లో తరచూ షేక్‌హ్యాండ్ ఇచ్చుకుంటారు. టాస్‌ మొదలు.. ఇన్నింగ్స్ పూర్తయినప్పుడు, మ్యాచ్‌ ముగిసిన తర్వాత ఆటగాళ్లు కరచాలనం చేస్తుంటారు. అయితే.. రెండు టెస్టుల సిరీస్‌ కోసం త్వరలో శ్రీలంక టూర్‌‌కు వెళ్లనున్న ఇంగ్లండ్.. ఆ జట్టు ఆటగాళ్లకు షేక్‌హ్యాండ్ ఇవ్వబోదట. దీనికి బదులుగా ఫస్ట్ బంప్‌తో ప్రత్యర్థి ఆటగాళ్లను విష్ చేస్తామని ఇంగ్లీష్ టీమ్‌ కెప్టెన్‌ జో రూట్ తెలిపాడు. పిడికిలి బిగించి ఒకరి చేతిని మరొకరు తాకడాన్ని ఫస్ట్ బంప్ అంటారు.

మ‌రోవైపు ఇటీవ‌ల జ‌రిగిన ద‌క్షిణాఫ్రికా టూర్‌లో తాము గ్యాస్ట్రోఎంట‌రైటిస్‌, ఫ్లూ తదిత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు గుర‌య్యామ‌ని, ఇక నుంచి మైదానంలో మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉంటామ‌ని తెలిపాడు. ఇమ్యూన్ కిట్‌లో భాగంగా సానిటైజ‌ర్లు స‌హా వివిధ ఆరోగ్య సంబంధ‌మైన ఉత్ప‌త్తుల‌ను త‌మ‌కు బోర్డు అంద‌జేసింద‌ని రూట్ తెలిపాడు. లంక ప‌ర్య‌ట‌న‌లో ఇంగ్లాండ్ రెండు టెస్టుల సిరీస్ ఆడుతుంది. మొదటి టెస్టు ఈనెల 19 నుంచి ప్రారంభం కానుంది.

Next Story