ఒకరికొకరు షేక్ హ్యాండ్ చేసుకోవడం, బుగ్గమీద ముద్దు పెట్టుకోవడం, పెక్ లు ఇచ్చుకోవడం బాగా అలవాటైన పాశ్చాత్య దేశాల్లో ఇప్పుడు చచ్చే చావు వచ్చింది. కరోనా పుణ్యమా అని ఆ పనులు చేయలేం. దేశాల ప్రభుత్వాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థలు ఈ విషయంలో కఠినమైన హెచ్చరికలు జారీ చేశాయి. మరో వైపు ఇజ్రాయిల్ ప్రదాని బెంజమిన్ నెటన్యాహు వంటి వారు భారతీయుల నమస్తేను అలవాటు చేసుకొమ్మని ప్రజలకు చెబుతున్నారు.

కానీ చాలా మంది ప్రజలకు ఈ నిషేధాలు నచ్చడం లేదు. మరో వైపు కరోనా భయం వేధిస్తోంది. దీంతో వారు ఒకరి మోచేతులు ఒకరికి తగిలించుకుని తృప్తి పడుతున్నారు. దీనికి వారు ఎల్బో బంపింగ్ అనే ముద్దు పేరు కూడా పెట్టారు. అయితే ఈ ఎల్బో బంపింగ్ కూడా అంత మంచిది కాదని, దీనిని ఉపయోగించడం మానుకోవాలని ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. కరోనా అంటు వ్యాధి వ్యాపించడానికి ప్రధానంగా చేతులు కారణమని, చేతులు మోచేతులకు కేవలం ఒకటిన్నర నుంచి మూడడుగుల దూరంలోనే ఉంటాయి కాబట్టి వైరస్ వ్యాపించే అవకాశాలు చాలా ఎక్కువని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. అందుకే దూరం నుంచే దణ్నాలు పెట్టుకోవడం మంచిదని, ఎంత దగ్గరకొస్తే అంత ప్రమాదమని ఆ సంస్థ హెచ్చరిస్తోంది.

ఇదిలా ఉండగా అమెరికాలోని 32 రాష్ట్రాల్లో 450 కిపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. చైనాలో కరోనా వ్యాధిగ్రస్తులను క్వారంటైన్ చేయడానికి ఉపయోగిస్తున్న హోటల్ భవనం ఒకటి క్వాన్ ఝౌ నగరంలో కుప్పకూలిపోయింది. ఈ సంఘటనలో 10 చనిపోయారు. 23 మంది గల్లంతయ్యారు. బల్గేరియా, మాల్డోవా, పరాగ్వే వంటి దేశాల్లో తొలిసారిగా కరోనా కేసును నమోదయ్యాయి.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.