ఆర్ధిక మాంద్యం ఎఫెక్ట్... కడుపు కట్టుకొమ్మంటున్న కేసీఆర్ సర్కార్

By Newsmeter.Network  Published on  13 Dec 2019 9:55 AM GMT
ఆర్ధిక మాంద్యం ఎఫెక్ట్... కడుపు కట్టుకొమ్మంటున్న కేసీఆర్ సర్కార్

దేశమంతటా ఆర్ధిక మాంద్యం లక్షణాలు పొడసూపుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రం కూడా ఆర్ధిక పొదుపు చర్యలు మొదలుపెట్టింది. ఇకపై అన్ని విభాగాలు అనవసర ఖర్చును తగ్గించాలని, పొదుపు చర్యలను చేపట్టాలనని రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాల మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో కొత్త ప్రతిపాదనలేవీ తీసుకు వచ్చి బడ్జెట్ కేటాయింపులను మించి ఖర్చు చేయవద్దని సూచనలు జారీ అయ్యాయి.

అనవసర ఖర్చును తగ్గించుకోవాలని ముఖ్యమంత్రి కేసీ ఆర్ సూచించిన తరువాత నుంచే ఆర్ధిక శాఖ వివిధ ప్రభుత్వ విభాగాల్లో చేపట్టాల్సిన ఆర్ధిక క్రమశిక్షణ, పొదుపు చర్యల విషయంలో మార్గదర్శకాలను రూపొందించే పనిని చేపట్టింది. అన్ని శాఖలు చేపడుతున్న పనులను ప్రాథమ్యాల ఆధారంగా జాబితా రూపంలో తయారు చేయాలని, తదనుగుణంగా అతి ముఖ్యమైన ప్రాజెక్టులకు మాత్రమే నిధులను విడుదల చేయడం జరుగుతుందని ఆర్ధిక శాఖ ఆదేశించింది.

ముఖ్యమంత్రి కే సీ ఆర్ రైతు బంధు, ఋణమాఫీ, రెండుగదుల ఇళ్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, పెన్షన్ల వంటి సంక్షేమ పథకాలను, నీటిపారుదల , విద్యుత్ రంగ పనులను కొనసాగించాలని దృఢనిశ్చయంతో న్నారని ఒక అధికారి తెలియచేశారు. అధికారులు ఇప్పటికే వివిధ పెండింగ్ స్కీముల పై ఒక నివేదికను ప్రభుత్వానికి అందచేశారు. రాష్ట్రానికి అక్టోబర్ నెలాఖరుకు రావలసిన పన్ను ఆదాయంలో దాదాపు 838 కోట్లు తగ్గాయి. ఇక జీఎస్టీ వాటాలో భాగంగా కేంద్రం నుంచి రూ. 4531 కోట్లు రావాల్సి ఉంది. ఇదే కాక జీ ఎస్ టీ వసూల్లలోనూ రూ. 2332 కోట్ల మేరకు తగ్గుదల ఉంది.

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 2019-20 బడ్జెట్ లో మొత్తం రూ. 19712 కోట్లు కేటాయించింది. ఇది గతేడాది కేటాయించిన రూ. 18560 కోట్ల కన్నా 6.2 శాతం ఎక్కువే అయినా, ఇప్పటి వరకూ పన్నుల్లో వాటా రూపంలో అక్టోబర్ నెలాఖరు వరకూ కేవలం 18560 కోట్లు మాత్రమే విడుదల చేయడం జరిగింది. ఫలితంగా గతేడాది వచ్చిన మొత్తం కన్నా 2.12 శాతం ఆదాయం తగ్గింది. కేంద్రం నుంచి ఇంకా 29891 కోట్లు రావలసి ఉంది. ఇందులో జీ ఎస్ టీ బకాయీలు రూ. 4531 కూడా ఉన్నాయి. వెనుకబడిన ప్రాంతాల నిధుల నుంచి జారీ చేయాల్సిన 450 కోట్ల లో కేవలం 313 కోట్లు మాత్రమే జారీ అయ్యాయి. ఈ లోటును భర్తీ చేసుకునే యత్నంలో భాగంగా ప్రభుత్వ స్థలాలను అమ్మి అదనపు ఆదాయాన్ని సాధించే మార్గాలను అన్వేషించాలని కూడా ఆర్ధిక శాఖ సూచించింది. రాష్ట్రానికి నెలకు రూ. 2000 కోట్ల లోటు వస్తోందని ఒక అధికారి తెలియచేశారు.

Next Story
Share it