రోజుకు ఒక్క ఈ-మెయిల్‌ను తగ్గించండి..!

By Newsmeter.Network  Published on  16 Jan 2020 11:01 AM GMT
రోజుకు ఒక్క ఈ-మెయిల్‌ను తగ్గించండి..!

మీరు వాతావరణం వేడెక్కడం విషయంలో ఆందోళన చెందుతున్నారా? వాతావరణ మార్పుల వల్ల హిమానీనదాలు కరిగిపోయి వరదలు వచ్చేస్తాయని భయపడుతున్నారా? నానాటికీ పెరిగిపోతున్న కర్బన ఉద్గారాల వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతాయని కంగారు పడుతున్నారా? వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నారా?

అయితే మీరు ఒక్క చిన్న పని ద్వారా ప్రపంచంలో కర్బన ఉద్గారాలను తగ్గించవచ్చు. సోషల్ మీడియాలో గుడ్ మార్నింగ్, గుడ్ అఫ్టర్ నూన్, గుడ్ నైట్ మెసేజీలు పంపడం మానేయగలిగితే చాలు. రోజులో అనేక సార్లు మనం థాంక్యూ అన్న మెసేజీలు పంపుతాం. ఇది మానేస్తే మనం వాతావరణానికి ఎంతో మేలు చేసిన వారవుతాం. ఇలాంటి పనికి మాలిన మెసేజ్ లు చాలా ప్రమాదకరమైనవని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.

ఒక ఈ మెయిల్ చేస్తే ఎంతో కొంత విద్యుత్తు ఖర్చవుతుంది. దీని వల్ల ఎంతో కొంత కార్బన్ వాతావరణంలోకి విడుదలవుతుంది. ఒక ఈ మెయిల్ ఒక గ్రాము కార్బన్ డయాక్సైడ్ ను వాతావణంలోకి పంపడం జరుగుతుంది. నిజానికి ఒక్క ఇంగ్లండ్ లోనే ప్రతి రోజూ 64 మిలియన్ల అనవసర ఈ మెయిల్స్ చేయడం జరుగుతుంది. అంటే అంత మేరకు కార్బన్ డయాక్సైడ్‌ విడుదలౌతుంది. రోజుకు ప్రతి బ్రిటిష్ పౌరుడు ఒక్క అనవసరపు మెయిల్ ను తగ్గిస్తే 16,333 టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు తగ్గుతాయి. రోజుకు ఒక్క మెయిల్ తగ్గిస్తే 88,270 ముంబాయి-ఢిల్లీ ఫ్లైట్లను రద్దు చేసిన దానితో సమానమౌతుందని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ నివేదికలో పేర్కొనడం జరిగింది.

మరి రోజుకు ఒక్క ఈ మెయిల్ ని తగ్గించి చూడండి. పర్యావరణ పరిరక్షణకు తోడ్పడండి.

Next Story