గాడిదతో ఆడవారి సంభోగం.. తెలంగాణలో బయటపడ్డ బొడ్రాయి..!

By Newsmeter.Network  Published on  14 Jan 2020 7:07 AM GMT
గాడిదతో ఆడవారి సంభోగం.. తెలంగాణలో బయటపడ్డ బొడ్రాయి..!

ముఖ్యాంశాలు

  • మేడ్చల్ జిల్లాలో బైటపడ్డ గాడిద బొడ్రాయి
  • 10 నుంచి 13 శతాబ్దంమధ్యకాలంనాటి బొడ్రాయి
  • పెత్తందారీ క్రౌర్యానికి ప్రతీక ఈ గాడిద బొడ్రాయి
  • గాడిద బొడ్రాయికి వందల సంవత్సరాల చరిత్ర
  • అగ్రహారాలను దానం చేసిన జమీందార్లు
  • తేడా వచ్చినప్పుడు శిక్షలు విధించిన జమీందార్లు
  • ఈనాముదారు ఇంట్లోని మహిళలకు గాడిదతో సంభోగం శిక్ష
  • అత్యంత దారుణమైన శిక్షగా గుర్తింపు

హైదరాబాద్ : జమీందారీ వ్యవస్థలు నశించిపోయాయి. జమీందార్లు నశించి పోయారు. కానీ గతకాలపు వారి పాలన తాలుకూ జ్ఞాపకాలు, చిహ్నాలు, అలనాటి పెత్తందారీ వ్యవస్థకు సంబంధించిన క్రూరమైన మనస్తత్వాలు, శిక్షల ఆనవాళ్లు మాత్రం చరిత్రలో శాశ్వతంగా నిలచిపోయాయి. అలాంటి అరుదైన జమీందారీ వ్యవస్థకు సంబంధించిన ఒక చిహ్నం తెలంగాణలోని మేడ్చల్ జిల్లాలో బయటపడింది. వందల సంవత్సరాలనాటి ఈ అరుదైన చారిత్రక జ్ఞాపకాన్ని ఓ చరిత్ర పరిశోధకుడు వెలుగులోకి తీసుకొచ్చారు.

అమరావతిలో అసిస్టెంట్ ఆర్కియాలజిస్ట్ గా పనిచేస్తున్న సాయికృష్ణ పుణేలోని దక్కన్ కాలేజీ స్కాలర్. మేడ్చల్ జిల్లాలోని గుండ్ల పోచంపల్లి ఆయన స్వగ్రామం. కొందరు స్థానికులు విచిత్రంగా కనిపించిన ఓ రాయి గురించి సాయికృష్ణకు చెప్పారు. సాయికృష్ణ దాన్ని పరిశీలించి, పరిశోధించి చూస్తే అది వందల ఏళ్లనాటి జమీందారీ పెత్తందారు వ్యవస్థలోని పాలనాపరమైన కఠిన శిక్షకు సంబంధించిన చిహ్నం అన్న విషయం బయటపడింది.

దాన్ని గాడిద బొడ్డురాయి అని పిలిచేవాళ్లు ఆ రోజుల్లో. అప్పట్లో కొత్త భూమి అదనంగా వచ్చి జమీందారీ వ్యవస్థలో చేరినప్పుడు, అంటే ఖాళీగా ఉన్న భూముల్ని తమ పరగణాలో కలుపుకున్నప్పుడు జమీందార్లు ఆ భూముల్ని కొందరికి ఈనాముగా ఇచ్చేవాళ్లు. ఆ భూముల్ని కౌలుకు ఇచ్చుకుని కౌలు వసూలు చేసుకునే అధికారం పూర్తిగా ఈనాముదారులకు ఉండేది. అయితే వాటిపై కచ్చితంగా పన్నులు మాత్ర కట్టాల్సి ఉంటుంది.

కాలక్రమంలో జమీందారుకు, ఈనాముదారులకు ఈ పన్నుల చెల్లింపు విషయంలో ఏదైనా తేడా వచ్చినప్పుడు సదరు భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకోవడమే కాక, ఆ భూముల్లో గాడిదబొడ్రాయిని వేసి మరీ ఈనాముదారులకు శిక్ష విధించేవాళ్లని చరిత్రకారులు చెబుతున్నారు.

ఈనాము ఇచ్చిన భూమిలో ఈ గాడిద బొడ్రాయిని నాటడమంటే ఈనాముదారుకు దారుణాతి దారుమైన శిక్షను విధించడం అని అర్థం. అంటే ఈనాము దారు ఇంటిలోని మహిళలు జమీందారు విధించిన శిక్ష ప్రకారం గాడిదతో సంభోగం జరపాల్సి వచ్చేది. సరిగ్గా అలాంటి దృశ్యాన్ని గాడిద బొడ్రాయి మీద చెక్కించేవాళ్లుకూడా.

మేడ్చల్‌ జిల్లాలో గాడిద బొడ్రాయి

మేడ్చల్ జిల్లాలోని గుండ్లపోచంపల్లిలో బైటపడ్డ ఈ గాడిద బొడ్రాయిపై అలాంటి చిహ్నం, పై భాగంలో త్రికోణాకారం, అలాగే సూర్యచంద్రుల కలశాలు ఉన్నట్టుగా సాయికృష్ణ చెబుతున్నారు. భూమిని ఇచ్చిన సందర్భంలో శుభ సూచకంగా అప్పట్లో సూర్యచంద్రుల కలశాల బొమ్మలను బొడ్రాయిపై చెక్కించేవారని, తర్వాత అదే భూమిని స్వాధీనం చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ విధంగా గాడిదతో సంభోగం జరిపినట్టుగా ఉన్న బొమ్మను కూడా చెక్కించేవాళ్లట.

ఇలాంటివే మరికొన్ని గాడిద బొడ్డురాళ్లు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లోకూడా కనిపించాయని పరిశోధకులు చెబుతున్నారు. ఒకవేళ ఎలాంటి పరిస్థితుల్లోనైనా జమీందారీ వ్యవస్థకు, పాలనకు, పన్నుల చెల్లింపునకు లోబడి ఉండకపోతే, సకాలంలో పన్నులు చెల్లించకోపోతే ఈనాముదారు ఇంటిలోని మహిళలు ఇలాంటి శిక్షను అనుభవించాల్సి వస్తుందన్న హెచ్చరికను అనుక్షణం గుర్తు చేయడంకోసం ఇలా గాడిదబొడ్డురాయిని పాతించేవాళ్లని చరిత్రకారులు చెబుతున్నారు.

గుండ్లపోచంపల్లిలో బయటపడిన ఈ గాడిద బొడ్రాయి శిలహార డైనెస్టీకి చెందిన రాయని చరిత్రకారులు అంటున్నారు. శిలహారాలు థానే నుంచి పరిపాలించారు కనుక దాదాపుగా ఇలాంటి రాళ్లు, ఆ కాలానికి సంబంధించిన శాసనాలు ముంబై, రాయ్ ఘడ్ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయంటున్నారు. ఆ రోజుల్లో గాడిదను అశుభానికి సూచనగా భావించేవారని తెలుస్తోంది.

యాదవుల పాలనా కాలంలో చెక్కించిన శాసనాలు, ఇలాంటి బొడ్డురాళ్లను పరిశీలిస్తే అసలు ఆ రోజుల్లో మహిళలు ఎంతటి దారుణమైన, భద్రత లేని పరిస్థితుల్లో ఉండేవారో స్పష్టమవుతుందని చెబుతున్నారు. తెలంగాణ ప్రాంతంలో ఇలా గాడిద బొడ్డురాయి కనిపించడం ఇదే మొదటిసారని కృష్ణ అంటున్నారు.

ఇలాంటి ఎన్నో విలువైన చారిత్రక ఆధారాలు, చిహ్నాలపై పరిశోధనలు విస్తృత స్థాయిలో జరగాలని, గతకాలపు చిహ్నాలను వారసత్వ సంపదగా మనం గుర్తించి వాటిని కాపాడుకునేందుకు కృషి చేయాలని రాష్ట్ర పురావస్తు శాఖ అధికారులకు సాయి కృష్ణ విజ్ఞప్తి చేశారు.

Next Story