నిజమెంత: వాట్సప్ మెసేజ్ కి రెడ్ టిక్ పడితే ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుందా..?

By సుభాష్  Published on  10 April 2020 11:31 AM GMT
నిజమెంత: వాట్సప్ మెసేజ్ కి రెడ్ టిక్ పడితే ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుందా..?

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలుచేస్తున్న సమయంలో వాట్సప్ ద్వారానే ఎక్కువ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేస్తూ ఉన్నారు. ఏ విషయమైనా వాట్సప్ లో పంపాల్సిందే..! అలాంటి వాట్సప్ లో ఇప్పుడు తప్పుడు వార్తలే ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. నిజానిజాలు తెలుసుకోకుండా ఏది పడితే ఆ సమాచారాన్ని షేర్ చేస్తూ వెళుతున్నారు.

ఈ మధ్య వాట్సప్ లో పడే టిక్స్ గురించి కూడా ఓ మెసేజీ వైరల్ అవుతోంది. అదేమిటంటే

ఒక టిక్ పడితే.. మెసేజ్ వెళ్ళింది అని

రెండు టిక్స్ పడితే.. మెసేజీ డెలివరీ అయిందని

రెండు బ్లూ టిక్స్ పడితే.. మెసేజీని చదివారని

మూడు టిక్స్ పడితే.. ఆ మెసేజీని ప్రభుత్వం చూసింది అని

రెండు బ్లూ టిక్స్, ఒక రెడ్ టిక్ పడితే.. ప్రభుత్వం చర్యలు తీసుకోబోతోంది అని

ఇదే మెసేజీలో ఒక బ్లూ టిక్ రెండు రెడ్ టిక్స్ పడితే ప్రభుత్వం డేటాను స్క్రీనింగ్ చేస్తోంది అని.. మూడు రెడ్ టిక్స్ పడితే ప్రభుత్వం ఆ మెసేజీని పంపిన వ్యక్తిని అరెస్టు చేసే అవకాశం ఉందని.. కోర్టు నుండి సమన్లు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం ఈ మెసేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పలువురు తమ తమ అకౌంట్స్ లో షేర్ చేశారు.



నిజమెంత:

వైరల్ అవుతున్న పై మెసేజీ "పచ్చి అబద్ధం"

ఒక టిక్ పడితే.. మెసేజ్ వెళ్ళింది అని.. రెండు టిక్స్ పడితే.. మెసేజీ డెలివరీ అయిందని.. రెండు బ్లూ టిక్స్ పడితే.. మెసేజీని చదివారని.. ఇక్కడి వరకే వాట్సప్ లో ఉన్న ఫీచర్.. వాట్సప్ లో రెండు టిక్స్ దాటి మూడో టిక్ పడే ఫీచర్ అన్నదే లేదు. తప్పుడు వార్తలను షేర్ చేసిన వ్యక్తులపై ఫిర్యాదు చేస్తే అరెస్టులు జరుగుతాయి. చాలా మంది అలా అరెస్టు కూడా అయ్యారు.. అరెస్టులు చేస్తూనే ఉన్నారు. కానీ డైరెక్ట్ గా వచ్చి సమన్లు జారీ చేయడం అన్నది జరగని పని.



వాట్సప్ యాప్ అన్నది ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్టెడ్ డేటాతో రూపొందించిన యాప్. ప్రభుత్వం కానీ.. వాట్సప్ కంపెనీ కానీ మెసేజీలను చూసే ఫీచర్ లేదా.. చదవడం అన్నది జరగని పని. అలా రెండు టిక్ లకు మించి ఉన్న ఫీచర్ వాట్సప్ లో వచ్చిందని.. ఆ కంపెనీనే ఇప్పటిదాకా వెల్లడించలేదు.. అలాంటి ఫీచర్ రాలేదు కూడానూ..! PIB ఫ్యాక్ట్ చెక్ సంస్థ కూడా ప్రభుత్వం వాట్సప్ మెసేజీలపై నిఘా పెట్టడం లేదని.. అలాంటి హక్కులు కూడా లేవని తేల్చింది.

కాబట్టి ఆ మెసేజ్ మొత్తం 'అబద్దమే'

Next Story