మొదటిసారిగా ఎన్ కౌంటర్ పై నిజ నిర్థారణ

By రాణి  Published on  14 Dec 2019 9:21 AM GMT
మొదటిసారిగా ఎన్ కౌంటర్ పై నిజ నిర్థారణ

ముఖ్యాంశాలు

  • దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై నిజ నిర్ధారణ కమిటీ
  • కమిటీకి పోలీస్ మాజీ టాప్ బాస్ కార్తికేయన్ నేతృత్వం
  • నిజాలను నిగ్గు తేల్చడంలో కార్తికేయన్ ది అందెవేసిన చేయి
  • రాజీవ్ గాంధీ హత్య కేసులో నిజాలను నిగ్గుతేల్చిన కార్తికేయన్
  • ఆ కేసులో 26 మంది నిందితుల పాత్రను నిర్ధారించిన కార్తికేయన్

హైదరాబాద్ : భారతదేశం గర్వించదగ్గ అత్యున్నత స్థాయి నిజాయతీపరులైన అధికారుల్లో ఆయన ఒకరు. విధుల నిర్వహణకు జీవితాన్ని అంకితం చేసిన అంకిత భావం కలిగిన అధికారి. 1964 బ్యాచ్ కి చెందిన ఈ ఐపిఎస్ అధికారి పేరు చెబితే చాలు అరాచకశక్తులకు వెన్నులోంచి వణుకు పుడుతుంది. రాజీవ్ గాంధీ హత్యకేసులో ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ కు ప్రాతినిధ్యం వహించిన ఆ అధికారి రోజుకు 18 గంటలపాటు పనిచేసి అహరహం శ్రమించి ఆ కేసులో నిజాలను నిగ్గు తేల్చారు. రాజీవ్ గాంధీ హత్యకేసులో మొత్తం 26మంది నిందితుల పాత్రను సాక్ష్యాధారాలతో సహా నిరూపించిన అత్యంత సమర్థత కలిగిన అధికారి ఆయన. దేవరాయపురం రామస్వామి కార్తికేయన్ - పదవీ విరమణ చేసిన ఐపీఎస్ అధికారి. ఇన్వెస్టిగేషన్ లో ప్రపంచ స్థాయి ప్రతిభను కనబరిచే అత్యంత ప్రతిభావంతులైన గొప్ప అధికారుల్లో ఒకరిగా జాతీయ స్థాయిలో పేరు గడించిన మేధావి. తెలంగాణలో దిశ ఆత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితుల ఎన్ కౌంటర్ కు సంబంధించి నిజాలను నిగ్గుతేల్చే పనిని కేంద్రప్రభుత్వం ఇప్పుడు కార్తికేయన్ కి అప్పగించింది. ఆయనతోపాటుగా జస్టిస్ వి.ఎస్.సిర్పూర్కర్ , ముంబై హైకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ రేఖా సుందర్ బల్డోతా నిజ నిర్ధారణ సంఘం సభ్యులుగా ఉన్నారు. ఈ బృందం త్వరలోనే హైదరాబాద్ కు వచ్చి దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై విచారణ చేపట్టబోతోంది.

ఆ నిర్ణయం తీసుకునే ముందు అడిగితే చెప్పేవాడిని : కార్తికేయన్

నిజ నిర్థారణ కమిటీలో కార్తికేయన్ ఉన్నారని తెలియగానే తెలంగాణ పోలీసుల గుండెల్లో గుబులు పుడుతోంది. విచారణ చేయమని ఆదేశాలు జారీచేస్తూ ఇంతవరకూ ఉత్తర్వులు తనకు అందలేదనీ, ఉత్తర్వులు అందుకున్న తర్వాత కమిటీలోని మిగతా సభ్యులతో కలసి హైదరాబాద్ కు వచ్చి విచారణ చేపడతాననీ కార్తికేయన్ అంటున్నారు. ప్రస్తుతం ఫోరమ్ ఫర్ పీస్, హార్మోనీ అండ్ గుడ్ గవర్నెన్స్ లకు అధ్యక్షుడిగా ఉన్న కార్తికేయన్ దిశ హత్యకేసు నిందితుల ఎన్ కౌంటర్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయడానికి ఇష్టపడలేదు. హైదరాబాద్ కు వెళ్లి విచారణ జరిపిన తర్వాత కానీ దాని గురించి మాట్లాడేందుకు అర్హత లభించదంటూ ఆయన సున్నితంగా తోసిపుచ్చడం విశేషం. గతంలో తాను పనిచేసిన కమిషన్లతో పోలిస్తే ఇది కొంత వైరుధ్యంతో కూడుకున్న పని అనీ, మొదటిసారిగా తను ఎన్ కౌంటర్ పై నిజనిర్ధారణ చేసేందుకు ప్రయత్నించాల్సిన సందర్భం వచ్చిందని కార్తికేయన్ వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది. సుప్రీంకోర్టు నిజ నిర్థారణ కమిటీని ఏర్పాటు చేయడానికి ముందు తన అభిప్రాయాన్ని అడిగి ఉంటే తప్పకుండా చెప్పి ఉండేవాడిననీ, ప్రస్తుతం బాధ్యతలను స్వీకరించబోతున్న తరుణంలో తాను ఎలాంటి వ్యాఖ్యలూ చేయడం సబబు కాదని కార్తి కేయన్ అన్నట్టుగా తెలుస్తోంది.

కార్తికేయన్ ఇదివరలో సీఆర్పీఎఫ్ సౌత్ ఐజీగా పనిచేశారు. ఇప్పటి వరకూ కమిటీలో సభ్యులైన ముగ్గురూకూడా ఒకరితో ఒకరం మాట్లాడుకోలేదని, హైదరాబాద్ వచ్చిన తర్వాత ముగ్గురు సభ్యులూ కలసి నిజ నిర్ధారణ చేసే ప్రయత్నం చేస్తామని కార్తి కేయన్ అంటున్నారు. విచారణ చాలా దీర్ఘకాలికమైన ప్రక్రియ అనీ, దానికి సంబంధించి ఆరు నెలలకాలం ఒక్కోసారి తక్కువ కావొచ్చు లేదా ఎక్కువ కావొచ్చని, దాని గురించి ప్రస్తుతానికి ఆలోచించాల్సిన పని లేదని, ముందుగా అసలు చేయాల్సిన పని గురించి పూర్తి స్థాయి శ్రద్ధ కనబరచాల్సిన అవసరం ఉందని కార్తికేయన్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఆయన కేసుకు సంబంధించిన విచారణలో లోతుగా వెళ్లే అవకాశం ఉందన్న ముందస్తు సూచనలకు హేతువులని కొందరు సీనియర్ ఐపీఎస్ అధికారులు భావిస్తున్నారు. నిజానిజాలు తెలుసుకోకుండా ఇతరులపై నిందలు మోపే రీతిలో మాట్లాడడం యుద్ధంలో నేరుగా బుల్లెట్ల వర్షం కురిపించడంకంటే అత్యంత ప్రమాదకరమైన విషయమని గతంలో ఎన్నోమార్లు కార్తి కేయన్ వ్యాఖ్యానించడం గమనార్హం. పూర్వాపరాలను లోతుగా పరిశీలించి నిజాలను నిగ్గు తేల్చడంలో ఆయనది అందె వేసిన చేయి. ఆ కారణంగానే అనవసరపు వ్యాఖ్యలకు, వ్యాఖ్యానాలకు ఏమాత్రం ఆయన తావు ఇవ్వరన్న విషయం దేశంలో చాలామంది ఉన్నతాధికారులకు తెలిసిన సత్యమే.

Next Story