మెగాస్టార్ చిరంజీవి.. రాజాకీయాల్లో తన ప్రయాణం ముగించి మరో సారి మేకప్ వేసుకోవడం మొదలుపెట్టారు. వరుసగా సినిమాలు తీయడం మొదలు పెట్టారు. ఇప్పటివరకూ చేయని దర్శకులు.. ఈ జెనరేషన్ దర్శకులు, నటులు ఆయనతో నటించడానికి క్యూ కడుతున్నారు. చిరంజీవి గారితో చేయాలని ఏ నటుడికి ఉండదు చెప్పండి. ఎప్పుడు ఆ ఛాన్స్ వస్తుందా అని ఎదురుచూసే వాళ్ళు ఎంతమందో..? ఆ లిస్టులో ఉన్న వ్యక్తి సోనూ సూద్..!

సోనూ సూద్ దాదాపు రెండు దశాబ్దాలుగా టాలీవుడ్ లో తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సోనూ సూద్ ఇప్పటికే తానేంటో నిరూపించుకున్నాడు. పెద్ద పెద్ద ప్రాజెక్టులలోనూ సోనూ సూద్ కనిపించాడు. కానీ సోనూ సూద్ మాత్రం తన కెరీర్ లో బిగ్గెస్ట్ ఛాన్స్ మాత్రం తనకు ఇప్పుడే వచ్చింది అంటున్నాడు. దక్షిణాది భాషల్లోనే కాకుండా హిందీ సినిమాల్లో కూడా నటించే సోనూ సూద్ అంతగా ఎదురుచూసిన సినిమా ఏదనేగా మీ డౌట్..! అది మెగా స్టార్ తో నటించే అవకాశం రావడమే. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్నారు. చిరు 152 వ చిత్రంలో సోనూ సూద్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

అందుకే అతడు పట్టలేని సంతోషంలో ఉన్నాడు. తాను బిగ్గెస్ట్ స్టార్స్ అయిన అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, జాకీ ఛాన్ లతో నటించానని.. కానీ తాను మొదటి సారి చిరంజీవి గారితో నటించబోతున్నానని సోనూ సూద్ తెలిపాడు. చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగిన తనకు.. ఆయనతో కలిసి పని చేస్తుండడం అసలు నమ్మలేకపోతున్నానని అన్నాడు సోనూ. శుక్రవారం నాడు సోనూ సూద్ చిరంజీవిని కలిశాడు. చిరంజీవిని కలిసొచ్చాక తన అనుభవాలను పంచుకున్నాడు. చిరంజీవి ఏ మాత్రం మారలేదని.. ఆయన ఎనర్జీ లెవెల్స్ అసలు తగ్గలేదని అన్నాడు. చాలా గొప్ప వ్యక్తి ఆయన.. అందుకే అంత గొప్ప స్టార్ అయ్యారంటూ చెప్పుకొచ్చాడు. మార్చి నెలలో తన షూటింగ్ మొదలు కాబోతోందని.. ఆయనతో నటించడానికి ఎంతగానో ఎదురు చూస్తున్నానని అన్నాడు.

ఏ సినిమా మీద భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్  మహేష్ బాబు కూడా ఈ చిత్రంలో నటించబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం గురించి మాత్రం చెప్పలేదు సోనూ..! ఒక్క విషయం మాత్రం చెప్పగలనని.. ఈ ఏడాది టాలీవుడ్ లో విడుదలయ్యే బిగ్గెస్ట్ సినిమా మాత్రం ఇదేనంటూ అంచనాలను మరింత పెంచేశాడు. ఈ సినిమాను హయ్యస్ట్ బడ్జెట్ తోనూ, చాలా గ్రాండ్ గా రూపొందించబోతున్నారని.. ఆడియన్స్ కు సినిమా మాత్రం అద్భుతంగా నచ్చుతుందని మాత్రం తాను చెప్పగలనని అన్నాడు సోనూ..!

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.