ఎస్వీబీసీలో కీలక మార్పులు.. ఎండీ పోస్టులో టీటీడీ అదనపు ఈవో

By Newsmeter.Network  Published on  24 Jan 2020 2:52 PM GMT
ఎస్వీబీసీలో కీలక మార్పులు.. ఎండీ పోస్టులో టీటీడీ అదనపు ఈవో

ఎస్వీబీసీ ఛానల్ లో కీలక మార్పులకు ప్రభుత్వం నాంది పలికింది. ఎస్వీబీసీలో కొత్తగా ఎండీ (మేనేజింగ్ డైరెక్టర్) పోస్టును సృష్టించింది. ఆ పదవిలో టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డిని నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్వీబీసీకి మరో ఇద్దరు డైరెక్టర్లను నియమించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఎస్వీబీసీ చైర్మన్ పదవి ప్రస్తుతం ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. దాన్ని అలాగే వదిలేయాలని వైసీపీ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఓ ఉద్యోగినితో సినీ నటుడు పృథ్వీరాజ్‌ జరిపిన సరస సంభాషణ ఆడియో బయటకు రావడంతో ఆయన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిన విషయం తెలిసిందే. పృథ్వీ రాజీనామా తర్వాత ఛైర్మన్ రేసులో జర్నలిస్టు స్వప్న, దర్శకుడు శ్రీనివాస్ రెడ్డిల పేర్లు ప్రధానంగా వినిపించాయి. ఛైర్మన్ పదవిలో మహిళను నియమించడం ఉత్తమం అని ప్రభుత్వం భావిస్తున్నట్టు ఊహాగానాలు వినిపించిన నేపథ్యంలో.. సీఎం కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్న స్వప్నకే పదవి దక్కవచ్చునని చాలామంది భావించారు. కానీ ప్రభుత్వం మాత్రం కొన్నాళ్ల వరకు ఛైర్మన్ పదవిని ఖాళీగానే ఉంచాలని భావిస్తోంది.

Next Story
Share it