ఏనుగు చేతుల్లో ఓడిన విమానం

By రాణి  Published on  25 Jan 2020 10:15 AM GMT
ఏనుగు చేతుల్లో ఓడిన విమానం

పర్యావ‘‘రణం’’లో ఏరోప్లేన్లను ఏనుగులు ఓడించాయి. అవును. ఏనుగుల కోసం ఏకంగా విమానాశ్రయం నిర్మాణమే ఆగిపోయింది. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ జార్కండ్ లోని ధాల్ భుమ్ గఢ్ లో విమానాశ్రయం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను తిరస్కరించింది. ధాల్ భుమ్ గఢ్ లో రెండో ప్రపంచ యుద్ధ కాలపు ఎయిర్ స్ట్రిప్ అంటే అత్యవసరంగా విమానాలను దింపేందుకు ఏర్పాటైన తాత్కాలిక విమానాశ్రయం ఉంది. దీన్ని పూర్తి స్థాయి విమానాశ్రయంగా అభివృద్ధి చేయాలని కేంద్ర పౌరవిమానయాన శాఖ ప్రతిపాదించింది. అయితే దానికి పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతిని ఇవ్వలేదు.

దాదాపు రెండు వందల ఏనుగులు ఈ విమానాశ్రయం ఏర్పాటు చేయాలనుకుంటున్న ప్రాంతం నుంచి రాకపోకలు సాగిస్తాయి. ఇక్కడ విమానాశ్రయం ఏర్పాటైతే ఏనుగులు వేరే దారిని వెతుక్కోవాల్సి వస్తుంది. అంటే జనావాసాల మీదుగా, పంట పొలాల మీదుగా వెళ్లాల్సి వస్తుంది. దీని వల్ల కలిగే నష్టం ఇంకా ఎక్కువ. నిజానికి జార్ఖండ్ లో 2002 లో 772 ఏనుగులు ఉండేవి. 2012 నాటికి వాటి సంఖ్య 688 కి పడిపోయింది. రెండేళ్ల క్రింద వాటి సంఖ్య 679 కి తగ్గింది. భవనాల నిర్మాణం, అడవులు తరిగిపోవడం, హై వోల్టేజ్ విద్యుత్ సరఫరా లైన్లు, రైలు మార్గాల వంటివి ఏనుగుల జనాభాను ఇప్పటికే తగ్గించింది. 2017 లో జార్ఖండ్ లో 32 ఏనుగులు విద్యుద్ఘాతం వల్ల, రైలు గుద్దుకోవడం వల్ల చనిపోయాయి. రైళ్లు ఢీకొన్న ప్రమాదాలు 22 సార్లు జరిగాయి.

1992 నుంచి ప్రాజెక్ట్ ఎలిఫెంట్ లో భాగంగా ఏనుగుల జనాభాను పరిరక్షించేందుకు ప్రభుత్వాలు చాలా చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా అక్టోబర్ 22, 2010 నాడు ఏనుగును జాతీయ వారసత్వ జంతువుగా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏనుగులను కాపాడేందుకు, వారి నివాస ప్రాంతాలను కాపాడేందుకు పర్యావరణ మంత్రిత్వ శాఖ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదనను తిరస్కరించింది. ఏనుగుల ఆవాస ప్రాంతాన్ని దెబ్బతీస్తే అవి మానవ ఆవాసాల వైపు వస్తాయి. 2014 నుంచి నేటి వరకు 2398 మంది ఏనుగుల బారిన పడి చనిపోయారు. స్మగ్లర్ల వల్ల దాదాపు 50 ఏనుగులు చనిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించాల్సిందే.

Next Story