Fact Check: నిజమెంత: దీపికా పదుకోన్ మద్యం కొనడానికి బయటకు వచ్చిందా..?
By సుభాష్ Published on 9 May 2020 8:40 AM GMT
ఓ మెడికల్ షాపు నుండి రకుల్ ప్రీత్ సింగ్ మందులు తీసుకుని వచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముంబై లోని బాంద్రా పాలి హిల్ లో చోటుచేసుకుంది ఈ ఘటన. కానీ కొందరు రకుల్ ప్రీత్ సింగ్ ను దీపిక పదుకోన్ అని భావిస్తూ ఉన్నారు. దీపికా పదుకోన్ మద్యం కొనుక్కోడానికి సొంతంగా బయటకు వచ్చిందని నెటిజన్లు వీడియోను షేర్ చేస్తున్నారు.
మహారాష్ట్రలో లిక్కర్ స్టోర్స్ ను మే 4, 2020 నుండి తెరిచారు. కోవిద్-19 కేసులు పెరిగే అవకాశం ఉండడంతో మే 6 నుండి వాటిని ముంబైలో మూసివేయించారు.
ఈ వీడియోను వైరల్ భయాని టీమ్ కు చెందిన ఫోటోగ్రాఫర్ రికార్డు చేశాడు. మెడికల్ షాపు కి వెళ్లి మందులు తీసుకొని రోడ్డు దాటుతుండగా వీడియోను రికార్డు చేశారు. ఒక టీ షర్ట్.. బ్లాక్ కలర్ ప్యాంటు వేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్ మెడికల్ షాప్ నుండి బయటకు వచ్చింది. ముఖానికి మాస్క్ వేసుకుని ఉంది. హాయ్ మేడమ్.. హాయ్ మేడమ్.. అంటూ కొందరు ఆమెను పిలవగా.. చేతులు ఊపుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానీ అక్కడ ఉన్నది దీపిక పదుకోన్ అంటూ చెబుతున్నారు.
"Deepika Padukone buying liquor in Mumbai..... Best example in social distancing..... No servants.........No drivers."
దీపిక పదుకోన్ ముంబై లో మందు కొంటోంది.. సామాజిక దూరానికి మంచి ఉదాహరణ. పని వాళ్లు ఎవరూ లేరు.. డ్రైవర్లు ఎవరూ లేరు.. ఆమె పని ఆమె చేసుకుంటోంది అన్నది ఆ వీడియో సారాంశం.
వాట్సప్ లోనే కాదు, ఫేస్ బుక్ లో కూడా వీడియో వైరల్ చేశారు.
నిజమెంత:
వీడియోను చూడగానే అర్థమయ్యేది అక్కడ ఉన్నది దీపిక పదుకోన్ కాదని..! ఈ వీడియోను మే5న బాంద్రా వెస్ట్ లోని పాళీ మార్కెట్ లో తీసింది అని వైరల్ భయానీ టీమ్ స్పష్టం చేసింది. ఈ వీడియోను అక్కడి మెడికల్ స్టోర్ అండ్ ప్రొవిజన్ స్టోర్ దగ్గర తీశారు. ఈ వీడియోలో ఉన్నది బాలీవుడ్ భామ దీపిక పదుకోన్ కాదు.. రకుల్ ప్రీత్ సింగ్.
రకుల్ ప్రీత్ సింగ్ మద్యం తీసుకుని వెళుతోందని కూడా కొందరు ప్రచారం చేశారు. దీనిపై రకుల్ ప్రీత్ స్పందించింది.. ఆ వీడియోని షేర్ చేస్తూ.. ‘ఓ వావ్, మెడికల్ షాపుల్లో మద్యం అమ్ముతున్నారా… అదెప్పట్నుంచి మొదలైంది.. నాకు ఈ విషయమే తెలియదు అంటూ’ ట్వీట్ చేసింది.
కెఆర్కె బాక్స్ ఆఫీసు అనే అకౌంట్ దీపిక పదుకోన్ మద్యం తీసుకుని వెళుతోంది అంటూ ట్వీట్ చేసి ఆ తర్వాత డిలీట్ చేసింది. కొన్ని సైట్స్ కూడా కనీసం నిజం తెలుసుకోకుండా పోస్టు చేశాయి.
అక్కడ ఉన్నది తానేనని రకుల్ ప్రీత్ కూడా ఒప్పేసుకుంది. దీన్ని బట్టి చూస్తే అక్కడ ఉన్నది రకుల్ ప్రీత్ సింగ్.. దీపికా పదుకోన్ కాదు.