ప్యారిస్ కు వెళ్లకూడదని నిర్ణయించుకున్న దీపిక..కారణం ఏమిటంటే..?

By రాణి  Published on  4 March 2020 4:40 AM GMT
ప్యారిస్ కు వెళ్లకూడదని నిర్ణయించుకున్న దీపిక..కారణం ఏమిటంటే..?

కరోనా వైరస్ వ్యాపార, వాణిజ్య రంగాలే కాదు.. చిత్ర పరిశ్రమలు కూడా ఎంతగానో భయపడుతున్నాయి. ఇప్పటికే కరోనా వైరస్ చాలా దేశాల్లో విస్తరించింది. ప్రముఖ టూరిస్ట్ ప్రాంతాల్లో కూడా ఈ మహమ్మారి కోరలు చాస్తోంది. ఇటలీ, ఫ్రాన్స్, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో కూడా పలువురికి ఈ వైరస్ పాజిటివ్ గా తేలింది. అందుకే ఆయా దేశాలకు షూటింగ్ వెళ్లాలని అనుకుంటున్నా బాలీవుడ్, టాలీవుడ్ చిత్ర యూనిట్ లు వాటిని రద్దు చేసుకుంటూ ఉన్నాయి.

తాజాగా బాలీవుడ్ క్వీన్ దీపిక పదుకోన్ ప్యారిస్ కు వెళ్లకూడదని ఫిక్స్ అయింది. ప్యారిస్ ఫ్యాషన్ వీక్ అంటే పలువురు ప్రముఖులు హాజరవుతూ ఉంటారు. హాలీవుడ్ కు చెందిన వాళ్ళే కాకుండా బాలీవుడ్, ఇతర దేశాలకు చెందిన చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖులు కూడా హాజరవుతూ ఉంటారు. విభిన్న తరహా బ్రాండ్ లకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటారు. దీపికను కూడా 'లూయిస్ విట్టన్' బ్రాండ్ తరపున ప్యారిస్ ఫ్యాషన్ వీక్ కు ఆహ్వానించారు. మొదట దీపిక కూడా హాజరవ్వాలని భావించింది కానీ ప్యారిస్ లో కరోనా వైరస్ విపరీతంగా ప్రబలడంతో ఆమె తన టూర్ ను క్యాన్సిల్ చేసుకుంది.

దీపిక పదుకోన్ షెడ్యూల్ ప్రకారం ప్యారిస్ ఫ్యాషన్ వీక్ లో భాగంగా Louis Vuitton's FW2020 కు హాజరవ్వాల్సి ఉండగా.. ఆమె ఫ్రాన్స్ పర్యటన రద్దయిందని..అక్కడ కరోనా వైరస్ విపరీతంగా వ్యాప్తి చెందుతూ ఉండడంతో ఆమె తన ట్రిప్ ను క్యాన్సిల్ చేసుకుందని ఆమె అధికార ప్రతినిధి వెల్లడించారు. ఫ్రాన్స్ లో ఇప్పటి వరకూ కోవిద్-19 కేసులు 130కి చేరుకున్నాయి. ఇద్దరు మరణించారు కూడానూ..! ఇటీవలి కాలంలో ఫ్రాన్స్ లో ఈ వ్యాధి విపరీతంగా ప్రబలుతోంది.

పెళ్లయ్యాక మొదటి సినిమా

దీపిక నటించిన లేటెస్ట్ సినిమా 'చపాక్' విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ.. కలెక్షన్లు మాత్రం ఘోరంగా తగ్గాయి. యాసిడ్ అటాక్ బాధితురాలి పాత్రలో దీపిక కనిపించింది. ఆమె '83' సినిమాలో కూడా నటిస్తోంది. దీపిక భర్త రణవీర్ సింగ్ 'కపిల్ దేవ్' పాత్రలో నటిస్తూ ఉండగా.. కపిల్ దేవ్ భార్య పాత్ర 'రోమి దేవి' గా దీపిక తళుక్కుమనబోతోంది. దీపిక-రణవీర్ పెళ్లయ్యాక వారిరువురు కనిపిస్తున్న మొదటి సినిమా ఇదే..! 1983లో భారత్ మొదటిసారి వరల్డ్ కప్ అందుకోవడం.. అప్పటి ఉద్విఘ్న క్షణాలు ఈ సినిమాలో చూపించబోతున్నారు. క్రికెట్ ప్రేమికులు ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. '83' సినిమా కాకుండా హాలీవుడ్ చిత్రం 'ది ఇంటర్న్' రీమేక్ లో దీపిక నటిస్తోంది. ఒరిజినల్ సినిమాలో రాబర్ట్ డి నీరో, అన్నే హాత్ వే చేసిన పాత్రల్లో రిషి కపూర్, దీపిక పదుకోన్ లు నటిస్తున్నారు. వార్నర్ బ్రదర్స్ ఇండియా తో కలిసి ఈ సినిమాకు దీపిక నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది. 2021లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. హాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ చిత్రానికి ఇండియన్ అడాప్టేషన్ ఎలా కుదురుతుందా అన్నది వెండితెరపై చూడాలి. ఆడవారు ఉద్యోగాలు చేసే సమయంలో ఎదురయ్యే అవాంతరాలు, బంధాలు, సవాళ్లు అన్నిటినీ ఈ చిత్రంలో చూపించబోతున్నారు. ముఖ్యంగా కామెడీ-డ్రామా కావడంతో భారత్ లోని ప్రేక్షకులకు కూడా బాగా నచ్చుతుంది అని చిత్ర బృందం భావిస్తోంది.

Next Story