డివిలియర్స్‌కు ఆఖరి ఛాన్స్‌.. వస్తే ఓకే.. లేకుంటే మాత్రం..

By Newsmeter.Network  Published on  4 March 2020 10:06 AM GMT
డివిలియర్స్‌కు ఆఖరి ఛాన్స్‌.. వస్తే ఓకే.. లేకుంటే మాత్రం..

శరీరాన్ని విల్లులా వంచి బంతిని చాలా సునాయాసనంగా బౌండరీలు దాటించడంతో సిద్దహస్తుడతను. క్రికెట్‌ బుక్‌లోని లేని ఎన్నో షాట్లను అవలీలగా బాదుతూ.. మిస్టర్‌ 360డిగ్రీస్‌గా పేరు తెచ్చుకున్నాడు ఏబీ డివిలియర్స్‌. ఇంకా ఎంతో క్రికెట్‌ ఆడే సామర్థ్యం ఉన్న కూడా డివిలియర్స్‌ 2018 ఐపీఎల్ అనంతరం దక్షిణాఫ్రికా క్రికెట్‌ టీమ్‌కు గుడ్ బై చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇక కొనసాగనని రిటైర్‌మెంట్ ప్రకటించేశాడు. తరువాత ఐపీఎల్‌ లాంటి లీగ్‌లలో ఆడుతున్నాడు.

2019 ప్రపంచకప్‌ ముంగిట తాను మళ్లీ దక్షిణాఫ్రికా తరఫున ఆడాలనుకుంటున్నట్లు డివిలియర్స్ తన మనసులో మాట బయటపెట్టాడు. అయితే అప్పటికే జట్టు సెలక్షన్‌ అయిపోవడంతో డివిలియర్స్‌కు జట్టులో చోటు దక్కలేదు. ప్రపంచ కప్‌లో కనీసం సెమీస్‌కి కూడా అర్హత సాధించలేకపోయిన దక్షిణాఫ్రికా పేలవరీతిలో నిష్క్రమించింది. దీంతో.. టీమ్‌కి డివిలియర్స్ లాంటి సీనియర్ బ్యాట్స్‌మెన్ అవసరం ఉందని అప్పటి కెప్టెన్ డుప్లెసిస్ సైతం వ్యాఖ్యానించాడు. దీంతో డివిలియర్స్‌ను జట్టులోకి తీసుకోవాలనే వారి సంఖ్య పెరిగింది.

ప్రపంచకప్‌ అనంతరం దక్షిణాఫ్రికా క్రికెట్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ జట్టు కోచ్‌గా మార్క్‌ బౌచర్‌ని నియమించారు. అంతేకాకుండా కెప్టెన్సీ నుంచి డుప్లెసిస్‌ను తప్పించి ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌కు బాధ్యతలు అప్పగించారు. మార్క్‌ బౌచర్‌ కూడా డివిలియర్స్‌తో కలిసి ఆడిన ఆటగాడే కావడంతో డివిలియర్స్‌ మళ్లీ దక్షిణాఫ్రికా జెర్సీ వేసుకుంటాడని అంతా భావించారు. అందుకనుగుణంగానే అప్పట్లోనే బౌచర్‌ కూడా.. ఏబీడీ లాంటి ప్లేయర్‌ అవసరం ఉందని.. అతను ఆడాలనుకుంటే ఎప్పుడైనా జట్టులోకి స్వాగతిస్తామన్నాడు.

ఈ ఏడాది అక్టోబర్‌లో టీ20 వరల్డ్‌కప్‌ జరగనుంది. ఇప్పటికే సన్నాహాకాలు మొదలు పెట్టాయి అన్ని జట్లు. టీమ్‌లో ఆడాలనుకునే క్రికెటర్లు.. ఐపీఎల్ 2020 సీజన్ తర్వాత జూన్‌లో టీమ్ సెలక్షన్‌కి అందుబాటులో ఉండాలని దక్షిణాఫ్రికా టీమ్ హెడ్ కోచ్ మార్క్ బౌచర్ తాజాగా ప్రకటించాడు. ఈ నేపథ్యంలో.. ఐపీఎల్ 2020 తర్వాత శ్రీలంకతో దక్షిణాఫ్రికా సిరీస్‌ని ఆడనుంది. ఈ సిరీస్‌లో ఆడే క్రికెటర్లే దాదాపు టీ20 ప్రపంచకప్‌లో ఆడతారని పరోక్షంగా వెల్లడించిన బౌచర్. టీమ్‌లోకి ఎంపికవకపోయినా సెలక్షన్‌కి అందుబాటులోకి వచ్చిన క్రికెటర్లని పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేశాడు. శ్రీలంకతో సిరీస్‌కి జట్టుని ప్రకటించే సమయానికి రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని.. సెలక్షన్‌కి అందుబాటులో ఉండాలని డివిలియర్స్‌కి కోచ్ స్పష్టంగా చెప్పాడని సమాచారం.

ఇక ఐపీఎల్‌ మార్చి 29 నుంచి ఐపీఎల్-13 సీజన్ మ్యాచ్‌లు ప్రారంభంకానుండగా.. మే 24న ఫైనల్‌ జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున డివిలియర్స్ బరిలో దిగనున్నాడు.

Next Story