కొడుకు మీద అమితమైన ప్రేమ..మరో బిడ్డకు తల్లి దూరం..!

By రాణి  Published on  16 Dec 2019 11:00 AM GMT
కొడుకు మీద అమితమైన ప్రేమ..మరో బిడ్డకు తల్లి దూరం..!

ముంబై : కొడుకుమీదున్న అమితమైన ప్రేమతో మరో బిడ్డకు తల్లిని దూరం చేసిందో అత్త. ఈ ఘటన మహారాష్ర్టలోని వసాయి ప్రాంతంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. కోడలిని చంపడమే కాకుండా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆమె చెప్పిన కారణం విన్న పోలీసులు అవాక్కయ్యారు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ర్టలోని వసాయికి చెందిన ఆనంది మానె (48), రియా (33) అత్తాకోడళ్లు. ఆనంది కుమారుడు రోహన్ (33), రియా ఐదేళ్ల కిందట ప్రేమ పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన కొన్నాళ్లకు రియాకు అమెరికాలోని టెక్సాస్ లో నర్స్ గా ఉద్యోగం రావడంతో భర్తతో కలిసి అమెరికాకు వెళ్లిపోయింది. కొన్నాళ్లకు వీరికొక పాప పుట్టింది.

అయితే... కొడుకు తనకు దూరం కావడానికి కోడలే కారణమనుకున్న ఆనంది ఆమెపై పగ పెంచుకుంది. అంతేకాక రియా పేరు, ఆమె చేసే వృత్తి ఆనందికి నచ్చేవి కావట. చాలాసార్లు పేరు, వృత్తి మార్చుకోవాలని చెప్పినా కోడలు పట్టించుకునేది కాదట. తన మనుమరాలిని ఆడించేందుకు కూడా కోడలు రానివ్వకపోవడంతో ఆనంది కోపం రెట్టింపయింది. అమెరికాలోనే స్థిరపడిన రోహన్, రియా ఈనెల 1వ తేదీన ఓ ఫంక్షన్ లో పాల్గొనేందుకు సొంత ఊరికి వచ్చారు. ఇదే అదనుగా భావించిన ఆనంది కోడలిని హతమార్చే అవకాశం కోసం ఎదురుచూసింది. డిసెంబర్ 15 ఆదివారం ఉదయం ఆనంది భర్త, కొడుకు రోహన్ మార్నింగ్ వాక్ కు వెళ్లగానే కోడలి గదిలోకి వెళ్లి పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్ తో ఆమె తలపై మోదింది. ఇలా జరిగిన ఘటన గురించి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన ఆనంది పోలీసులకు వివరించింది. ఇదంతా విన్న పోలీసులు ఆనంది ఇంటికి వెళ్లి చూడగా రియా అప్పటికే తీవ్ర రక్తస్రావంతో అచేతన స్థితిలో ఉంది. ఆమె చనిపోయిందని గుర్తించి, ఆనందిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. రియా మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తన కొడుకును దూరం చేసిందని కోడలిపై పగను పెంచుకున్న అత్త...ఆమెను చంపే ముందు మరో బిడ్డకు తల్లి దూరమవుతుందని కాస్త ఆలోచిస్తే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదేమో కదా..!

Next Story
Share it