సీఎస్ గా సోమేశ్ నియామకం అక్రమం : దాసోజు శ్రవణ్

By రాణి  Published on  3 Jan 2020 11:19 AM GMT
సీఎస్ గా సోమేశ్ నియామకం అక్రమం : దాసోజు శ్రవణ్

సీఎం కేసీఆర్ తెలంగాణ కేడర్ ఐఏఎస్ లకు ప్రాధాన్యత కలిగిన పోస్టింగులను ఇవ్వడం లేదని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ధ్వజమెత్తారు. తెలంగాణ సీఎస్ గా సోమేశ్ కుమార్ నియామకం అక్రమమని ఆరోపించారు. నియామక నిబంధనలకు విరుద్ధంగా సోమేశ్ కుమార్ నియామకం జరిగిందని, 15 మంది సీనియర్స్ ను కాదని, సోమేష్ కుమార్ కు సీఎస్ పదవి కట్టబెట్టడం పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమేష్ కుమార్ నియామకం ఒక క్విడ్ ప్రోకో అని దుయ్యబట్టారు.

జిహెచ్ఎంసి ఎన్నికల్లో సోమేష్ కుమార్ టీఆర్ఎస్ కు అనుకూలంగా పనిచేసి టీఆర్ఎస్ కు రాజకీయ లబ్ధి చేకూర్చారు కాబట్టే సోమేష్ కుమార్ సీఎస్ పదవిని కట్టబెట్టారని ఆరోపించారు. అతను ఆంధ్రా కేడర్ కు చెందిన వ్యక్తి అయితే...తెలంగాణ కేడర్ అధికారులను కాదని, అతడికి సీఎస్ పదవి ఎలా కట్టబెడతారని ప్రశ్నించారు. సీఎం కార్యాలయం అంతా రిటైర్డ్ ఉద్యోగుల అడ్డాగా మారిందని, డజనుకు పైగా రిటైర్డ్ ఐఏఎస్ లు అక్కడ విధులు నిర్వహిస్తున్నారని దాసోజు విమర్శలు గుప్పించారు.

రెండ్రోజుల క్రితమే సోమేష్ కుమార్ తెలంగాణ సీఎస్ గా బాధ్యతలు స్వీకరించారు. సీఎస్ శైలేంద్ర కుమార్ జోషి పదవీ కాలం డిసెంబర్ 31, 2019తో పూర్తికావడంతో సోమేష్ కుమార్ ను కొత్త సీఎస్ గా నియమిస్తూ ఉత్తర్వులిచ్చింది తెలంగాణ ప్రభుత్వం.

Next Story