రజనీ ‘దర్బార్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ డేట్ ఫిక్స్

By రాణి  Published on  28 Dec 2019 6:28 AM GMT
రజనీ ‘దర్బార్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ డేట్ ఫిక్స్

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, స్టార్‌ దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న తొలి సినిమా ‘దర్బార్‌’. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై భారీ నిర్మాణ వ్యయంతో, అత్యున్నత సాంకేతిక విలువలతో ఎ. సుభాస్కరన్‌ నిర్మిస్తున్నారు. తెలుగులో ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్‌ విడుదల చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 9న సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. జనవరి 3న హైదరాబాద్‌లో దర్బార్‌ ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించనున్నట్టు నిర్మాతలు తెలిపారు. రజనీకాంత్ సహా చిత్రబృందం అంతా దర్బార్‌ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు హాజరు కానున్నారు.

ఆల్రెడీ రిలీజైన ఈ సినిమా ట్రైలర్ రికార్డులు సృష్టిస్తోంది. ముఖ్యంగా పోలీస్‌ ఆఫీసర్‌గా రజనీకాంత్‌ స్టైల్, గ్రేస్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఆయనను దర్శకుడు మురుగదాస్ చాలా స్టయిలిష్ గా చూపించారని అభిమానులు సంబరపడుతున్నారు. ట్రైలర్‌లో ‘సార్‌! వాళ్ళకు చెప్పండి… పోలీసుల దగ్గరకు లెఫ్ట్‌లో రావొచ్చు. రైట్‌లో రావొచ్చు. స్ట్రైయిట్‌గా రావొద్దని’, ‘ఆ చూపేంటి? ఒరిజినల్‌గానే విలన్‌ అమ్మా! ఇది ఎలా ఉంది?’, ‘అయామ్‌ ఎ బ్యాడ్‌ కాప్‌’ అని రజనీకాంత్‌ చెప్పిన డైలాగులకు సూపర్ రెస్పాన్స్ లభిస్తోంది. ట్రైలర్‌లో రజనీకాంత్ మేనరిజమ్స్, యాక్టింగ్, స్టైల్, మురుగదాస్ టేకింగ్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.

రజనీకాంత్ సరసన కథానాయికగా నయనతార, రజనీకాంత్ కుమార్తెగా నివేదా థామస్, ఇతర కీలక పాత్రల్లో తంబీ రామయ్య, యోగి బాబు, ప్రతీక్ బబ్బర్, నవాబ్ షా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ ర‌వి చంద్ర‌న్ సంగీతం అందిస్తున్నారు. త‌మిళ్ తో పాటు తెలుగులో కూడా ఈ మూవీ పై క్రేజ్ ఏర్ప‌డింది. మ‌రి... సంక్రాంతికి వ‌స్తున్న ద‌ర్బార్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.

Next Story