గత పదేళ్లలో కరోనా వంటి ప్రళయాంతక వ్యాధులెన్నొచ్చాయో తెలుసా?

By రాణి  Published on  7 Feb 2020 12:13 PM GMT
గత పదేళ్లలో కరోనా వంటి ప్రళయాంతక వ్యాధులెన్నొచ్చాయో తెలుసా?

ఇప్పుడు పుడమిని కరోనా వైరస్ గడగడలాడిస్తోంది. ముఖానికి మాస్కులు, విమానం దిగగానే పరీక్షలు, ఎక్కడికక్కడ కరోనా పరీక్షా కేంద్రాలు, వ్యాధి లక్షణాలున్న వారికి పద్నాలుగు రోజుల క్వారంటైన్, ప్రపంచ మంతటా భయాందోళనలు...ఇలా ప్రపంచమంతా కరోనా గురించే అనుక్షణం అనునిత్యం ఆలోచిస్తోంది. కరోనా వ్యాధిని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే ఆరోగ్య అత్యవసర పరిస్థితి (పీ హెచ్ ఈ ఐసీ) ప్రకటించింది. అంటే ఇప్పుడు కరోనా వ్యతిరేక పోరాటంలో ప్రపంచమంతా చేతులు కలపాలి...(గ్లవ్స్ వేసుకునే, సానిటైజ్లను రాసుకునో.. మాత్రమే చేతులు కలపాలి ఎందుకంటే కరోనా స్పర్శతో కూడా వ్యాపిస్తుంది)

గత పదేళ్లలో కరోనా వంటి అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే ఆరోగ్య అత్యవసర పరిస్థితి అయిదు సార్లు వచ్చింది. కరోనా ఆరో ఆరోగ్య ఎమర్జెన్సీ. 2009 లో హెచ్ 1 ఎన్ 1 వైరస్ ప్రపంచాన్ని గడగడలాడించింది. 2014 లో పోలియో తిరగబెట్టి అందరినీ ఆందోళనలో పారేసింది. 2014, 2019 లలో ఎబోలా వైరస్ ఆఫ్రికా నుంచి ప్రపంచమంతటా విస్తరించింది. ఎన్నో ప్రాణాలను బలిగొన్నది. 2016 లో జికా వైరస్ కూడా ఇలాకే ప్రళయాన్ని మోసుకొచ్చింది. అంతకు ముందు 2003 లో చైనా నుంచే సార్స్ అంటువ్యాధి వ్యాపించింది. 2012 లో మెర్స్, 2019 లో ఎన కరోనా వీ వైరస్ లు కూడా జంతువుల నుంచి వ్యాపించాయి. 2018 లో కేరళలో నిపాహ్ వైరస్ గబ్బిలాలు తిని పారేసిన పండ్లనుంచి వ్యాపించింది.

ప్రపంచారోగ్య సంస్థ ఆదేశాల ప్రకారం విమానాశ్రయాల్లో తనిఖీలు, వ్యాధికి సంబంధించిన పూర్తి వివరాలను అన్ని దేశాలతో పంచుకోవడం, అన్ని దేశాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం వంటివి చేయాలి. ఇలాంటి చర్యల వల్లే సార్స్, మెర్స్, నిపాహ్ వంటివి వ్యాపించకుండా అడ్డుకోవడం జరిగింది. 2019 లో వచ్చిన ఎన్ కరోనా వీ వైరస్ చనిపోయిన జంతువుల నుంచి వండిన పదార్థాల నుంచి వ్యాపించింది. అలాంటి ఆహారాలపై నిషేధం విధించడం వంటి చర్యల ద్వారా వ్యాధిని అరికట్టడం జరిగింది.

అయితే ఇలాంటి వ్యాధులను అరికట్టే విషయంలో అన్ని దేశాల వద్ద తగిన పరికరాలు, వైద్య చికిత్సా విధానాలు ఉండవు. ముఖ్యంగా ఆఫ్రికన్ దేశాలు, పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, బర్మా వంటి దేశాలతో తగిన వైద్య ఆరోగ్య వ్యవర్థ లేదు. దీని వల్ల చైనాలో అరికట్టినా, ఈ వ్యాధి ఇతర చోట్లనుంచి మళ్లీ వ్యాపించే ప్రమాదం ఉంది. ఇలాంటి భయంకరమైన అంటువ్యాధుల వల్ల దేశాల ఆర్ధిక వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదం కూడా ఉంది. ఉదాహరణకు కరోనా వల్ల దాదాపు 500 బిలియన్ల డాలర్లు ఆర్థిక నష్టం జరుగుతుందని అంచనాలు వేస్తున్నారు. 2003 లో వచ్చిన సార్స్ వల్ల దాదాపు 40 బిలియన్ల మేరకు నష్టం వాటిల్లింది. ఇప్పుడు కరోనా వల్ల చైనా అభివృద్ధి రేటు 6.3 శాతం నుంచి 4.9 శాతానికి పడిపోయే ప్రమాదం ఉందని ఆర్ధిక వ్యవహారాల అధ్యయన సంస్థ జేపీ మోర్గన్ తెలిపింది.

Next Story