కాకి రెట్టలతో దాడి.. లేజర్ గన్లతో ప్రతిదాడి..

By Newsmeter.Network  Published on  1 Jan 2020 7:05 AM GMT
కాకి రెట్టలతో దాడి.. లేజర్ గన్లతో ప్రతిదాడి..

ప్రతి రోజు సాయంకాలం చీకటి పడగానే గస్తీ కాసేందుకు సిబ్బంది బయలుదేరతారు. చేతిలో లేజర్ గన్, ఇతరులను హెచ్చరించే విజిల్స్, బ్లాంక్ పిస్టల్ వంటివి తీసుకుని బయలుదేరతారు. రాత్రంతా కాపలా కాస్తారు.

ఎవరో దొంగలో, దోపిడిదారులో వస్తారనుకుంటున్నారా? నిశాచరులెవరో వచ్చి ఏదో పాడు పని చేస్తారనుకుంటాన్నారా? కాదండీ కాదు. రాత్రి కాగానే ఆ చుట్టుపక్కలకు వేలాది కాకులు వస్తాయి. చెట్లపై, కొమ్మలపై, భవనాలపై, పక్కనున్న స్మశానంపై వాలతాయి. వాలితే మనకేం, కాకులు వస్తాయి వెళ్తాయి... ఇందులో విశేషం ఏమిటి? లేదండీ లేదు. అవి రాత్రంతా కావు కావుమని అరుస్తాయి. నానా కాకిగోల చేస్తాయి. అయితేనేం... ? తలుపులు మూసుకుని పడుకుంటే సమస్య తీరిపోతుంది. అంతే కదా అనుకోకండి. కాకులు రాత్రంతా రెట్టలు వేస్తాయి. దాంతో స్మశానం, పక్కనున్న వాకింగ్ ట్రాక్, దాని పక్కనున్న మెడికల్ కాలేజీ, హాస్పటల్ ఇవన్నీ ఖరాబు అవుతాయి. కాకి రెట్టలు ఎంత ఎక్కువగా వేస్తాయంటే అడుగు తీయలేం. అడుగు వెయ్యలేం. అందుకే ఈ కాకిగోల భరించలేకపోతున్నాం అంటున్నారు స్థానికులు.

నిజం ఆ సిబ్బంది రాత్రంతా చేసే పని ఏమిటంటే కాకుల్ని పారద్రోలడం. కాకులను తరిమి కొట్టడం కోసమే వాళ్లు రాత్రంతా నిద్రపోకుండా ఉంటారు. ఆశ్చర్యంగా ఉందా? ఇది పచ్చి నిజం. అమెరికాలోని మిన్నెసోటా లోని రాచెస్టర్, ఓక్ వుడ్ సిమెట్రీ, మేయో క్లినిక్ ప్రాంతంలో వేలాది కాకులు వచ్చి వాలతాయి. వీటి రెట్టల వల్ల స్థానిక ప్రజలకు ఎంతో ఇబ్బంది అవుతోంది. దీనితో రాత్రిపూట తప్పనిసరిగా గస్తీ కాయాల్సి వస్తోంది. చప్పుళ్లతో, పేలుళ్లతో కాకుల్ని పారద్రోలే పనిని చేస్తూంటారు. ఈ కాకులను పారద్రోలేందుకు మిన్నెసోటా అధికారులు దాదాపు నలభైవేల డాలర్లను ఖర్చు చేస్తున్నారు.

ఇంకో సంగతి తెలుసా? రాచెస్టర్ కాకుల మీద టైలర్ ఆగ్ అనే ఒక ఫిలింమేకర్ ఒక డాక్యుమెంటరీనే తయారు చేశాడు.

Next Story