కరోనా వైరస్‌ను చైనా ల్యాబ్‌లో తయారు చేశారా?

By Newsmeter.Network  Published on  18 Feb 2020 8:35 AM GMT
కరోనా వైరస్‌ను చైనా ల్యాబ్‌లో తయారు చేశారా?

కరోనా వైరస్ వ్యాధి ప్రబలిన వెనువెంటనే వదంతులు కూడా మొదలయ్యాయి. చైనా వైరస్ మొట్టమొదట సోకిన వుహాన్ లోనే ఒక జైవిక ఆయుధాల (బయో వెపన్ల) లాబ్ ను నిర్వహిస్తుందని, తన శత్రు దేశాలపై దాడి చేసేందుకు ఈ బయోవెపన్స్ ని ఉపయోగించాలనుకుంటున్నదని కూడా వదంతులు మొదలయ్యాయి. తన లాబ్ లో డెవలప్ చేసిన వైరస్ తమ దేశంలోనే లీక్ అయి, తమ ప్రజలనే తినేస్తోందని పుకార్లు పుట్టాయి.

వ్యాధిని ఇవాళ్లో రేపో అరికట్టవచ్చు కానీ పుకారులను ఎలా అరికట్టాలి? ఇప్పుడిది పాకిపాకి అమెరికాలోకి చేరింది. అమెరికాలో ఇప్పటికే భారీ సంఖ్యలో చైనా వ్యతిరేకులు ఉన్నారు. రాజకీయవాదుల్లోనూ వీరి సంఖ్య ఎక్కువే. అందునా చైనా- అమెరికాల మద్య ఆర్ధిక యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో ఈ వదంతికి బలం చేకూరింది. ఏకంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాజీ సలహాదారుడు రిపబ్లికన్ నేత టామ్ కాటన్ సైతం కరోనా వైరస్ ను ఒక బయో వెపన్ గా అభివర్ణించాడు. మా వద్ద పూర్తి సాక్ష్యాధారాలు లేకపోయినా, ఇది చైనా తన శత్రువుల మీద ప్రయోగించేందుకు రూపొందించిదన్న అనుమానాలున్నాయని ఆయన అన్నాడు. ఎందుకంటే చైనా మొదటి నుంచీ రెండు నాల్కల ధోరణిని అవలంబిస్తోందని, నిజాయితీగా వ్యవహరించడం లేదని ఆయన అన్నాడు.

నిజానికి ఇప్పటి వరకూఇది చైనా తయారుచేసిన బయో వెపన్ అనడానికి ఎలాంటి ఆధారాలూ లేవు. గతంలో సోవియట్ రష్యా మీద కూడా ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. రష్యా కూడా అమెరికా ఎయిడ్స్ వైరస్ ను ప్రయోగశాలలో తయారుచేసిందని అసత్య కథనాలను 1980 వ దశకంలో ప్రచారం చేసింది. ఈ ప్రచారం ఏ స్థాయికి చేరిందంటే ఆఖరికి అమెరిక ప్రజలు కూడా దీనిని నమ్మసాగారు. చివరికి దశాబ్దాల తరువాత కానీ నిజం తెలియరాలేదు. ఇప్పుడు చైనా పై అమెరికా సెనేటర్లు సైతం ఇలాంటి ఆరోపణలే చేయడం గమనార్హం.

Next Story