భారతీయ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఓ ఆసక్తికర వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేశారు. తానొక వెయిటర్ గురించి వెతుకుతున్నాడట. సచిన్ టెండూల్కర్ కు ఒక వెయిటర్ తో పని ఏంటో తెలుసా ?  గతంలో సచిన్ ఓ టెస్ట్ మ్యాచ్ కోసం చెన్నై వెళ్లినప్పుడు అక్కడి తాజ్ కోరమాండల్ హోటల్ రూమ్ లో ఉండగా, ఓ వెయిటర్ కాఫీ తీసుకువచ్చాడట. అందరిలాగే అతను కూడా సచిన్ మీతో క్ మాట్లాడొచ్చా? అని అడిగాడట. అయితే అతను మాట్లాడిన మాటలు విని సచిన్ షాక్ అయ్యాడట. ఇంతకీ అతను చెప్పిన విషయం ఏంటంటే” సచిన్ మీరు మోచేతికి ఆర్మ్ ప్యాడ్ కట్టుకున్న ప్రతిసారి బ్యాట్ ఊపే విధానంలో స్వల్పంగా మార్పు వస్తోంది. అది మీ బ్యాటింగ్ పై ప్రభావం చూపిస్తోంది” అన్నాడట. ఇప్పటి వరకు సచిన్ తో ఇలాంటి విషయం గురించి మాట్లాడిన వారే లేరట.

దీంతో ఆ వెయిటర్ ఎంతో నిశితంగా గమనించి ఆ సూచన చేశాడని అర్థం చేసుకున్న సచిన్ వెంటనే ఆ ఆర్మ్ ప్యాడ్ ను మోచేతి సైజుకు అనుగుణంగా రీడిజైన్ చేయించాడట. ఎంతమేర ప్యాడింగ్ ఉండాలి? ఎక్కడ స్ట్రాప్స్ ఉండాలి? ఇలాంటి జాగ్రత్తలన్నీ చెప్పి కొత్త ఆర్మ్ ప్యాడ్ ను తయారు చేయించుకున్నాడట. ఆ సరికొత్త ఆర్మ్ ప్యాడ్ ధరించిన తర్వాత తన బ్యాటింగ్ లో మెరుగైన మార్పు వచ్చిందన్న సచిన్ ఇప్పుడా వెయిటర్ ఎక్కడున్నాడో తెలుసుకోవాలనిపిస్తోందంటూ ట్వీట్ చేసాడు. ఇప్పుడు ఈ ట్వీట్కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఎలా అయినా సచిన్ ఆ వెయిటర్ను కలుసుకోవాలని మనమూ కోరుకుందాం.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.