క్రికెట్‌ సలహా కమిటీ.. ఆర్పీ సింగ్‌ కు చోటు

By Newsmeter.Network  Published on  31 Jan 2020 3:59 PM GMT
క్రికెట్‌ సలహా కమిటీ.. ఆర్పీ సింగ్‌ కు చోటు

ముగ్గురు సభ్యులతో కూడిన క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ)ని బీసీసీఐ ప్రకటించింది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ శుక్రవారం ప్రకటించిన క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ)లో అనూహ్యంగా ఆర్‌పీ సింగ్‌ కు చోటు దక్కింది. ఆర్‌పీ సింగ్‌ (రుద్రప్రతాప్‌ సింగ్‌) తో పాటు అందరూ అనుకున్నట్లుగానే మదన్‌లాల్‌, సులక్షణ నాయక్‌ ఈ కమిటీలో చోటు దక్కించుకున్నారు. ఈ కమిటీ కాలపరిమితి ఏడాది మాత్రమే.

ఈ కొత్త కమిటీ ముందున్న అత్యంత ముఖ్యమైన పని.. జాతీయ సెలెక్టర్ల పదవుల నుంచి తప్పుకొంటున్న ఎమ్మెస్కే ప్రసాద్‌, గగన్‌ ఖోడా స్థానాలను భర్తీ చేయడమే. పురుషులతో పాటు మహిళా జట్ల కోసం సెలక్టర్లను ఎంపిక చేయాల్సి ఉంటుంది. అలాగే, మహిళా జట్టు జాతీయ కోచ్‌ను కూడా ఎంపిక చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత కోచ్ డబ్ల్యూవీ రామన్ పదవీ కాలం ఈ ఏడాది డిసెంబరుతో ముగుస్తుంది. ఆయన స్థానంలో కొత్త కోచ్‌ను ఈ కమిటీ నియమించాల్సి ఉంటుంది.

ఇదిలా ఉండగా.. గత కమిటీలోని సభ్యులు కపిల్‌ దేవ్‌, శాంతా రంగస్వామి, అన్షుమాన్‌ గైక్వాడ్‌ విరుద్ధ ప్రయోజనాల ఆరోపణల నేపథ్యంలో తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆర్పీ‌సింగ్ టీమిండియా తరుపున 14 టెస్టులు, 58 వన్డేలు, 10 టీ20లు ఆడాడు. 2007లో జరిగిన ఐసీసీ వరల్డ్ టీ20లో విజయం సాధించిన భారత జట్టు‌లో ఆర్పీ సింగ్ సభ్యుడు. అంతేకాకుండా ఆ ఈవెంట్ అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. మదన్‌లాల్ టీమిండియా తరుపున 39 టెస్టులు, 67 వన్డేలు ఆడాడు. 1983లో వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టులో మదన్‌లాల్ సభ్యుడు. సులక్షణ అంతర్జాతీయ కెరియర్ 11 ఏళ్లు. కీపర్‌గా, బ్యాట్స్‌విమెన్‌గా సేవలందించిన నాయక్.. రెండు టెస్టులు, 46 వన్డేలు, 31 టీ20ల్లో భారత ఉమెన్స్‌ జట్టుకి ప్రాతినిధ్యం వహించారు.

Next Story