రాజధాని రైతులకు వ్యతిరేకంగా వాదించేందుకు రూ.5 కోట్లు ఖర్చుపెట్టేవాడు రైతు పక్షపాతి ఎలా అవుతాడని ప్రశ్నించారు సీపీఐ రాష్ర్ట కార్యదర్శి రామకృష్ణ. రైతులను వ్యతిరేకించిన ముఖ్యమంత్రిగా సీఎం జగన్ మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని ఆయన విమర్శించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన 7 నెలల కాలంలో రాజధాని అమరావతి అభివృద్ధి కోసం రూ.5 కోట్లు కూడా ఖర్చుపెట్టని జగన్...రైతులకు వ్యతిరేకంగా వాదించే లాయరుకు ప్రజాధనమైన రూ.5 కోట్లను ఫీజుగా చెల్లించడం దుర్మార్గమన్నారు. వెంటనే లాయరుకు ఇచ్చిన రూ. 5కోట్ల జీతాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. లాయర్ ముకుల్ రోహిత్గికి ఏమాత్రం నైతిక విలువలున్నా ఆయన తీసుకున్న మొత్తాన్ని తిరిగి ఇవ్వాలన్నారు. సీబీఐ జగన్ పై పెట్టిన కేసులను వాదించే లాయరునే రైతులకు వ్యతిరేకంగా కోర్టులో వాదించడానికి నియమించడం వెనుక క్విడ్ ప్రోకో ఏమైనా ఉందా అని ప్రశ్నించారు.

ఏపీ ప్రభుత్వ నిర్ణయంతో రాజధాని ప్రాంతంలో ఇప్పటికే ఆందోళనలు తీవ్రమయ్యాయి. వికేంద్రీకరణ బిల్లును మండలిలో రద్దు చేసినప్పటి నుంచీ వైసీపీ శ్రేణులు రాజధానిని ఎలా తరలించాలన్న దానిపై చేయని ప్రయత్నం లేదు. ఆఖరికి సీఎం జగన్ మోహన్ రెడ్డి మండలి రద్దు చేసేందుకు కూడా వెనుకాడలేదు. కానీ మండలి రద్దు అంత సాధ్యం కాదు. ఈ లోపు మండలి ఏర్పాటు చేసిన సెలెక్ట్ కమిటీ సభ్యుల ఎంపిక, బిల్లులపై చర్చ కూడా మొదలవుతుంది. ఈ కమిటీ 13 జిల్లాలకు చెందిన ప్రజలు, రైతుల అభిప్రాయాలను సేకరించనున్నట్లు సమాచారం.

రాణి యార్లగడ్డ

Next Story