జగన్ చేసిన ప్రకటన తల, మొండేన్ని వేరుచేసినట్లుంది
By రాణి
ముఖ్యాంశాలు
- మూడు రాజధానులు జగన్ కు, మంత్రులకు విహారయాత్రలు
- రెండ్రోజుల్లో రాజధాని మార్పుపై ప్రభుత్వం కీలక ప్రకటన ?
రాష్ర్టంలో మూడు రాజధానులుంటే సీఎం, మంత్రులు తిరగడానికి ఒక విహార యాత్రలా ఉంటుందే తప్ప అభివృద్ధి ఏం జరగదని తెలిపారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. జగన్ మూడు రాజధానుల ప్రకటనపై స్పందించిన నారాయణ సోమవారం తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించేందుకే సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేశారని ఆరోపించారు. శాసనసభ ఒకచోట, సచివాలయం మరోచోట ఏర్పాటు చేయడం ఒక మనిషి తల, మొండెం వేరు చేసినట్లే ఉంటుందని ఆయన అభిప్రాయాన్ని తెలిపారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పాటించిన విధానాలను వ్యతిరేకించడమే లక్ష్యంగా జగన్ రాష్ర్టంలో దుష్పరిపాలన సాగిస్తున్నారని విమర్శించారు. సీమ ప్రాంతంలో హై కోర్టు ఏర్పాటు చేసినంత మాత్రాన ఆ ప్రాంతం అభివృద్ధి చెందదన్నారు. అక్కడ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పరిశ్రమల ఏర్పాటుతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని నారాయణ పేర్కొన్నారు.
దేశంలోని పలు రాష్ర్టాల్లో సచివాలయాలు, హైకోర్టులు వేర్వేలు ప్రాంతాల్లో ఉన్నాయే తప్ప అసెంబ్లీ, సచివాలయం వేర్వేరు ప్రాంతంలో ఉన్న దాఖలాలు లేవన్నారు. ఇక్కడ సచివాలయం ఓ చోట, అసెంబ్లీ మరో చోట ఉంటే మంత్రులకు కాలానికొ విహారయాత్రలా ఉంటుందే తప్ప అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నట్లు ఉండదని నారాయణ హితవు పలికారు. అలాగే రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్ అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు. రాజధానుల ఏర్పాటుపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సీపీఐ నారాయణ డిమాండ్ చేశారు.
రెండు మూడు రోజుల్లో కీలక ప్రకటన
ఇప్పటికే రాజధాని ప్రాంతమంతా జగన్ చేసిన ప్రకటనతో అట్టడుకుతోంది. జగన్ ప్రకటనను ప్రతిపక్షాలు, రాజధాని రైతులు వ్యతిరేకిస్తూ రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. ఆందోళనలు ఉధృతమయ్యే అవకాశాలున్న నేపథ్యంలో అమరావతిలో ఒకరోజు 144 సెక్షన్ కూడా విధించారు. మూడు రాజధానులపై వ్యతిరేకత వస్తుండటంతో రెండు మూడు రోజుల్లో జగన్ రాజధాని మార్పుపై కీలక ప్రకటన చేస్తారన్న వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. జగన్ రాజధాని అంశంపై ప్రకటన చేసిన తర్వాత పెద్ద ఎత్తున అల్లర్లు, ఆందోళనలు జరిగే అవకాశాలుండటంతో జిల్లా కేంద్రాల నుంచి బెటాలియన్ అమరావతికి తరలివస్తోంది. సుమారు 300 మందికి పైగా పోలీసులకు అమరావతిలోని అంబటినగర్(యర్రబాలెం) లోని ఓ కళ్యాణ మండపంలో వసతి ఏర్పాట్లు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా...ప్రభుత్వం నుంచి రాజధాని మార్పుపై ఎలాంటి ప్రకటన వెలువడుతుంది ? ఆ ప్రకటన అమరావతి ప్రజలకు అనుకూలంగా ఉంటుందా లేదా ? అనే దానిపై రాష్ర్ట వ్యాప్తంగా సందిగ్ధత నెలకొంది.