ఈ వైరస్ కు అహంకారం ఎక్కువ

By Newsmeter.Network  Published on  22 March 2020 9:34 AM GMT
ఈ వైరస్ కు అహంకారం ఎక్కువ

కరోనా వైరస్..ఈ వైరస్ కు అహంకారం ఎక్కువ. ఎంత అహంకారం అంటే ఇది మనకి మనంగా పిలిస్తే తప్ప మన దగ్గరికి రాదు. అందుకే ప్రధాని నరేంద్ర మోడీ 14 గంటల జనతా కర్ఫ్యూ పాటించాలని యావత్ భారతావనికి పిలుపునిచ్చారు. మోదీ పిలుపు మేరకు కోట్లాది మంది ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. తెలంగాణలో అయితే 24 గంటల కర్ఫ్యూ పాటించాల్సిందిగా సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. దీంతో భాగ్యనగరంలోని రోడ్లన్నీ బోసి పోయాయి. నిత్యం రద్దీగా కనిపించే కూకట్పల్లి, మైత్రివనం, జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, కోఠి, అబిడ్స్, చార్మినార్..ఇలా అన్ని ప్రధాన రోడ్లు ఖాళీగా దర్శనమమిచ్చాయి. నిత్యావసరాల కోసం మాత్రం అక్కడక్కడా డైరీ కేంద్రాలు, కూరగాయల షాపులు మాత్రం తెరుచుకున్నాయి. పిల్లలు కూడా ఆడుకునేందుకు ఆరుబయటకు కూడా రావడం లేదు. కానీ ఒక్కరోజు జనతా కర్ఫ్యూతో కరోనా వైరస్ ను కట్టడి చేయడం సాధ్యమేనా ? అన్న ప్రశ్న కూడా ప్రజల్లో వ్యక్తమవుతోంది.

ఒక్కరోజు కర్ఫ్యూతో వైరస్ ను కట్టడి చేయగలమో లేదో పక్కనపెడితే..బయట వైరస్ జీవితకాలం దాదాపు 12 గంటలు. 14 గంటల పాటు ఎవరూ బయటికి రాకపోతే బయటి పరిసరాల్లో ఉన్న ఆ వైరస్ చచ్చిపోతుందన్న ఉద్దేశ్యంతోనే ఈ కర్ఫ్యూ విధించారు. అంతా బాగానే ఉంది. కానీ..కర్ఫ్యూ పేరుతో ఇళ్లకే పరిమితమైన వారిలో ఎవరికీ కరోనా లక్షణాలు లేవంటారా ? ఒక వేళ ఉంటే కర్ఫ్యూ తర్వాత వారంతా కూడా బయట తిరుగుతారు కదా. మళ్లీ వారి ద్వారా కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకే ప్రమాదం లేకపోలేదని చెప్పలేం. మరి ఈ విధంగా వైరస్ సోకే ప్రమాదముందన్న ఆలోచన ప్రభుత్వాలకు రాలేదా ? ఒక్కరోజు కర్ఫ్యూతో వైరస్ ను కట్టడి చేయలేం. యథా రాజా తథా ప్రజా అన్నట్లు మళ్లీ అది విజృభించే అవకాశాలే ఎక్కువ. రోజులు గడిచే కొద్దీ వైరస్ సోకిన బాధితుల సంఖ్య పెరుగుతుందే తప్పా..ఇప్పటి వరకూ చైనా మినహా మరేఇతర దేశాల్లోనూ తగ్గిన దాఖలాలు లేవు .

శనివారం ఒక్కరోజే ఇటలీలో 700 మందికి పైగా బాధితులు మృత్యువాతపడ్డారు. దీంతో అక్కడ దాదాపు పరిస్థితి షట్ డౌన్ చేసే వరకూ వచ్చింది. ఇటలీ షట్ డౌన్ ప్రకటించాలా ? లేదా ? అన్న సందిగ్ధంలో ఉంది అక్కడి ప్రభుత్వం. భారత్ లో కూడా కరోనా మరణాలు 6కు చేరాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకూ కరోనా బాధితుల సంఖ్య 30 దాటగా..దేశవ్యాప్తంగా కరోనా కేసులు 324 కు చేరాయి.

కేవలం కర్ఫ్యూతోనే కరోనాను కట్టడి చేయలేం.మనం పాటించాల్సిన కనీస జాగ్రత్తలు కూడా ఉంటాయి. వీలైనన్నిసార్లు చేతులను హ్యాండ్ వాష్ లేదా సబ్బులతో కడుక్కోవడం, ఆల్కహాల్ తో ఉన్న శానిటైజర్ రాసుకోవడం, బయటికి వెళ్లినపుడు మనిషికీ, మనిషికీ మధ్య మీటరు దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. యువతకు కరోనా వైరస్ సోకదన్న గ్యారెంటీ ఏమీ లేదు కాబట్టి..పిల్లలు, పెద్దలతో పాటుగా యువత కూడా అనవసరంగా బయట తిరగకపోవడం మంచిది. అత్యవసరమైతేనే ఇల్లు దాటండి.

Next Story