మాస్క్‌ లు ధరించేటప్పుడు ఎక్కువ మంది చేస్తున్న పొరపాట్లు ఇవే..

By సుభాష్  Published on  12 July 2020 11:03 AM GMT
మాస్క్‌ లు ధరించేటప్పుడు ఎక్కువ మంది చేస్తున్న పొరపాట్లు ఇవే..

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. అయితే కరోనా వైరస్‌ వల్ల మాస్క్‌ లు ధరించడం తప్పనిసరి. కొందరు ధరించినా.. మరి కొందరు నిర్లక్ష్యం చేస్తున్నారు. మాస్క్‌ లు ధరించడంపై సరైన అవగాహన లేకపోవడం, మాస్క్‌ ను నిమిషానికోసారి తడుముకోవడం లాంటివి చేస్తున్నారు. అంతేకాదు పెట్టుకున్న మాస్క్ ను ముక్కు కిందికి లాగడం, పైకి లాగడం చేస్తుంటారు. మరి కొందరు వాటిని జనసమూహాల్లో ఎక్కడ పడితే అక్కడ ముఖాన్ని చేతులతో తుడుచుకుంటూ మాస్క్‌ ను తిరిగి పెట్టుకుంటున్నారు. కొన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల కరోనా వ్యాపించే అవకాశం ఉంది. వారికి తెలియకుండానే కరోనా బారిన పడుతున్నారు. మాస్క్‌ లు ధరించే సమయంలో ఎలాంటి పొరపాట్లు చేస్తున్నారో కోవిడ్-19 అధికారులు పలు సూచనలు జారీ చేశారు

మాస్క్‌ ధరించే సమయంలో ఎక్కువ మంది చేసే పొరపాట్లు ఇవే..

► ప్రతి రోజు కార్యాలయాల్లో తోటి సిబ్బందితో కలిపి పని చేస్తున్నారు. అందరు కలిసి ఉన్నాం కదా అని మాస్క్‌ లు ధరించకపోవడం తప్పు. తోటి ఉద్యోగులతో మాట్లాడే సమయంలో కూడా మాస్క్‌ ధరించడం తప్పనిసరి.

► మన ప్రాణ స్నేహితులతో చాలా క్లోజ్‌గా మాట్లాడుతూ ఉంటాం. వాళ్లు కూడా మిత్రులే కదా.. మాస్క్‌ ఎందుకని అనుకోవద్దు. ఇప్పుడున్న పరిస్థితులలో ఎవరితో మాట్లాడినా మాస్క్‌ పెట్టుకోవడం తప్పనిసరి.

► కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడే సమయంలో మాస్క్‌ తప్పనిసరి. ఇంట్లో ఎవరైన పెద్దవాళ్లు ఉన్నా.. వారితో మాట్లాడే సమయంలో మాస్క్‌ ధరించాలి.

► కొంత మంది ధరించే మాస్క్‌ నోరు, ముక్కును కప్పి ఉంచాలన్న విషయం తెలియదు. చాలా మంది మాస్క్‌లను చేతితో పట్టుకుని, చెవికి వేలాడదీస్తూ ఇతరులతో మాట్లాడుతుంటారు. అలా చేయకూడదు.

► జనంలోకి వెళ్లినప్పుడు వైరస్‌ బాధితులు ఎవరైనా తుమ్మినా, దగ్గినా వారి నోటి నుంచి వెలువడే తుంపర్లు ముఖంపై పడకుండా మాస్క్‌ రక్షణ కల్పిస్తుంది.

► మాస్క్‌ ధరించిన తర్వాత తరచూ చేతితో మాస్క్ ను ముట్టుకోవడం, కళ్లు, ముక్కు, నోటి దగ్గర చేతిని పెట్టుకోవడం, రుద్దడం చేయరాదు. కరోనా వైరస్‌ అనేది 99 శాతం మన చేతుల ద్వారానే ముక్కు, నోరు, కంటి ద్వారా శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఇప్పటికీ చాలా మంది ప్రతి నిమిషానికి ఒకసారి మాస్కును చేతులతో రుద్దడం, ముఖాన్ని తాకడం లాంటివి చేస్తుంటారు.

► చేతులు కలపడం, షేక్‌ హ్యాండ్స్‌ ఇవ్వడం చేయకూడదని ఎన్నిసార్లు సూచిస్తున్నా.. కొందరు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇప్పటికి చాలా మంది యువత జన సమూహాల్లోనూ షేక్‌ హ్యాండ్‌ ఇవ్వడం, ఒకరి ముఖం దగ్గర ఒకరు పెట్టుకుని మాట్లాడుకోవడం చేస్తున్నారు. అలాంటివి చేయకూడదు.

► మొబైల్‌ ఫోన్‌ మాట్లాడేటప్పుడు చాలా మంది మస్క్‌ లు తొలగించి మాట్లాడుతుంటారు. ఒక్కరే ఉన్న సమయంలో అలా చేయడం ఏమికాదు. కానీ జనసమూహాల్లో ఉన్న సమయంలో ముఖానికి మాస్క్‌ ధరించే మాట్లాడాలి.

► చాలా మంది మాస్క్‌ ధరించిన తర్వాత మధ్య లో తొలగించి చెమట తొలగించుకోవడం లాంటివి చేస్తుంటారు. చొక్కాతో మేడలో ఉండే కండువాతో తుడుచుకుంటారు. కరోనా బాధితులు ఎవరైన తుమ్మినా, దగ్గినా.. మన చొక్కా, కండువాలపై పడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

► కొందరు ఇంట్లో నుంచి బయటకు వెళ్లే ముందు మాస్క్‌ ధరించి తెలిసిన వారు ఎవరైనా కనిపించగానే మాస్క్‌ తీసేస్తూ మాట్లాడుతున్నారు. ఇటువంటి సమయంలో కూడా ప్రమాదమేనని భావించాలి.

► కొన్ని కొన్ని మాస్క్‌ లు ధరించిన తర్వాత వాటినే పొరపాటున మాస్క్‌ ను తిప్పి ధరిస్తుంటారు. అలా చేయడం వల్ల కరోనాను శరీరంలోకి ఆహ్వానించినట్లే.

► ఇలా కొన్ని కొన్ని పొరపాట్లు చేయడం వల్ల కరోనాను మనకు మనమే వెంట తెచ్చుకోగలుగుతున్నామని నిపుణులు సూచిస్తున్నారు. మాస్క్‌ లు ధరించడంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి నిర్లక్ష్యం చేయకూడదని సూచిస్తున్నారు.

Next Story