కరోనా పై గెలుపు: దక్షిణ కొరియా దారిలోనే వెళ్దామా?

By సుభాష్  Published on  13 March 2020 9:38 AM GMT
కరోనా పై గెలుపు: దక్షిణ కొరియా దారిలోనే వెళ్దామా?

చైనా అత్యంత కఠినమైన నియమాలను పాటించి కరోనాను అదుపు చేసింది. దేశాన్ని జైలుగా మార్చింది. మాస్కులు వేసుకోని వారిని జైల్లో పెట్టింది. ఆఫీసులను మూసేసింది. ఫేషియల్ రికగ్నిషన్ వంటి అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించింది. ఇలా చేయడం వల్లే కనీసం రెండు నెలలు అష్టకష్టాలు పడి కరోనాను అదుపు చేయగలిగింది. కానీ చైనా పొరుగునే ఉన్న దక్షిణ కొరియా కరోనా వ్యాప్తిని ఇంకా సమర్థవంతంగా అదుపు చేసింది.

దక్షిణ కొరియాకు చైనాలో లాగా నియంతృత్వ వ్యవస్థ లేదు. ఎవరు పడితే వారిని జైల్లో పెట్టే ఏర్పాటు లేదు. అవసరమనుకుంటే సైన్యాన్ని మొహరించే పరిస్థితి అంతకన్నా లేదు. ఇవన్నీ చాలవన్నట్టు ప్రజలందరినీ చెరపట్టడం , నగరాలకు నగరాలను ఐసొలేట్ చేయడం వంటి పనులను దక్షిణ కొరియా చేయలేదు. ఆఖరికి కరోనా గుప్పెట్లో పూర్తిగా చిక్కుకున్న డేగు నగరాన్ని కూడా పూర్తిగా జైలుగా మార్చలేదు. అయితే చైనాలో కరోనా వైరస్ ప్రబలిన మరుక్షణం దక్షిణ కొరియా అప్రమత్తమైంది. తక్షణమే కరోనా వ్యాధి వస్తే ఏం చేయాలన్న కసరత్తు ప్రారంభించి, రెండు మూడు రోజుల్లోనే రిహార్సల్ నిర్వహించింది. దీంతో నెల రోజుల తరువాత తొలి కరోనా కేసు నమోదయ్యే సమయానికి దక్షిణ కొరియా సర్వ సన్నద్ధంగా ఉంది. టెలిఫోన్ల ద్వారా సలహాలు, కారులో నేరుగా వచ్చి చికిత్స పొందే ఏర్పాట్లు, థర్మల్ కెమెరాల ఏర్పాటు చేసింది.

అన్నిటి కన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే కరోనా అనుమానిత కేసులు వస్తే వాటిని తక్షణం నిర్ధారణ చేసేందుకు పరీక్షలను వేగంగా చేసేందుకు ఏర్పాట్లు జరిగాయి. ఇరవై నాలుగు గంటల్లో ఇరవై వేల సాంపిల్స్ ను పరీక్షించి, రిపోర్టులను ఇచ్చేందుకు దేశవ్యాప్తంగా ఏర్పాట్లు జరిగాయి. పాజిటివ్ కేసులు నమోదైన వారికి టెస్ట్ కిట్స్ ను ఉచితంగా సరఫరా చేసేందుకు కూడా ఏర్పాట్లు జరిగాయి. అంతే కాక, చర్చిలు, సినిమా హాళ్లలో పెద్ద ఎత్తున ప్రజలు జమ కూడకుండా చర్యలు చేపట్టడం జరిగింది.

ఇలాంటి చర్యల వల్ల కొరియా చైనా కన్నా త్వరగా వ్యాధిపై అదుపును సాధించింది. ఇప్పటి వరకూ 7513 కేసులు నమోదయ్యాయి. 54 మరణాలు ఇప్పటి వరకూ నమోదయ్యాయి. ఇదే తరహాలో మన దేశంలో కరోనా వ్యాపించి ఉంటే మనం ఇలాంటి సన్నద్ధతతో వ్యాధిని ఎదుర్కొ గలిగేవారమా? ప్రజలలో ఇంత చైతన్యాన్ని తీసుకొచ్చి, అవగాహన కల్పించగలిగి ఉండేవాళ్లమా?

Next Story