అమెరికా, జర్మనీల్లో తొలి కరోనా కేసులు నమోదు

By రాణి  Published on  28 Feb 2020 7:42 AM GMT
అమెరికా, జర్మనీల్లో తొలి కరోనా కేసులు నమోదు

చైనా నుంచి బయలుదేరిన కరోనా వైరస్ ఇప్పుడు యూరప్ ను గడగడలాడిస్తోంది. ఇప్పుడు అమెరికా, జర్మనీలలో తొలి కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే ఈ దేశాల్లోకి కరోనా ఎలా విస్తరించిందన్న విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. చైనాతో సంబంధం లేకుండా వైరస్ రావడంతో ఆ దేశాల్లో కలవరం మొదలైంది. ఎలాంటి మానవ స్పర్శ లేకుండానే, ప్రయాణికుల నుంచి వ్యాపించకుండానే వైరస్ రావడంతో ఆయా దేశాల్లో ప్రమాద ఘంటికలు మోగాయి.

అమెరికాలోని కరోనా వ్యాధిగ్రస్తుడు ఉత్తర కాలిఫోర్నియాలోని సొలానో కౌంటీకి చెందినవాడని తెలుస్తోంది. ఇప్పటి వరకూ చైనా నుంచి వచ్చిన వారిపై మాత్రమే అధికారులు దృష్టి సారించారు. ఇప్పడు వేరే మార్గాల ద్వారా కూడా కరోనా వ్యాపిస్తోందని వారి దృష్టికి వచ్చింది. అంటూ కరోనా సోకిన ఇతరులు కూడా ఉన్నారని, వారిని ఇప్పటి వరకూ గుర్తించడం జరగలేదని అర్థమౌతోంది. ఇప్పటి వరకూ అమెరికాలో నమోదైన 59 కేసులు చైనా లేదా దానికి సమీపంలో ఉన్న దేశాల నుంచి వచ్చిన వారికే చెందినవి.

ఇప్పుడు జర్మనీలోనూ ఇదే విధంగా, చైనాతో సంబంధం లేకుండా కరోనా కేసులు నమోదయ్యాయి. కేసులు నమోదైన ప్రాంతంలో స్కూళ్లకు సెలవులిచ్చివేశారు. ఒక వ్యాధిగ్రస్త వ్యక్తి ఇటీవలే ఒక కార్నివాల్ లో పాల్గొన్నాడు. అతనితోపాటు ఆ సంబరాల్లో పాల్గొన్న వారందరినీ గుర్తించి, స్క్రీనింగ్ చేయడం జరుగుతోంది. ఇప్పటి వరకూ ఇరాన్ లో 26, దక్షిణ కొరియాలో 13, ఇటలీలో 12, జపాన్ లో 8 కేసులు నమోదయ్యాయి. జపాన్ లో దేశవ్యాప్తంగా స్కూళ్లను మూసేశారు. ఇంకో వైపు నార్వే, రొమేనియా, డెన్మార్క్, ఈస్టోనియాలలో తొలి కరోనా కేసులు నమోదయ్యాయి.

Next Story