చైనా నుంచి ప్రపంచ దేశాలకు శరవేగంగా వ్యాపించిన కరోనా వైరస్ (కోవిడ్ 19) ఇప్పుడు అమెరికాలోని ఫేస్ బుక్ సంస్థలో పనిచేస్తున్న ఒక ఉద్యోగికి సోకినట్లు నిర్థారణయింది. కరోనా లక్షణాలతో ఉన్న అతడికి వైద్య పరీక్షలు చేయగా..పాజిటివ్ వచ్చింది. దీంతో సియాటెల్ ఫేస్ బుక్ ఆఫీస్ ను ఈ నెల 9వ తేదీ వరకూ మూసివేయనున్నట్లు ఫేస్ బుక్ ప్రకటించింది. అలాగే ఈ నెలాఖరు వరకూ ఉద్యోగస్తులు ఇంటి వద్ద నుంచే పనిచేయాల్సిందిగా విజ్ఞప్తి చేసింది.

కాగా..సియాటెల్ లోని ఫేస్ బుక్ ”స్టేడియం ఈస్ట్” కార్యాలయంలో కరోనా బాధితుడు ఫిబ్రవరి 21వ తేదీ వరకూ విధులు నిర్వహించాడు. తమ సంస్థకు సంబంధించినంతవరకూ ఇదే తొలి కరోనా కేసు అని ప్రకటించింది ఫేస్ బుక్. ప్రతి ఉద్యోగి ఆరోగ్యం, భద్రతకు తామెంతో ప్రాధాన్యతనిస్తామని, ఆ క్రమంలోనే..ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినట్లు తెలిపింది. డాక్టర్ల సలహాలు, సూచనలు పాటిస్తూ..అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

ఆన్ లైన్ దిగ్గజ సంస్థలైన గూగుల్, అమెజాన్ లలో కూడా ఒక్కో ఉద్యోగికి కరోనా సోకింది. గూగుల్ జ్యురిచ్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగికి, సియాటెల్ లోనే ఉన్న అమెజాన్ ఉద్యోగికి కూడా కరోనా వైరస్ సోకడంతో..అమెజాన్, గూగుల్, కాయిన్ బేస్, ట్విట్టర్, మైక్రోసాఫ్ట్ సంస్థలతో పాటు ఇతర టెక్నాలజీ కంపెనీలన్నీ తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే యోచనలో ఉన్నాయి.

హైదరాబాద్ లోని మైండ్ స్పేస్ లో పనిచేసే ఒక ఉద్యోగినికి కరోనా రావడంతో..ఆఫీస్ మొత్తానికి సెలవిచ్చేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. అలాగే..ఆ బిల్డింగ్ లో ఉన్న ఇతర ఉద్యోగ సంస్థలు కూడా అప్రమత్తమయ్యాయి. ఇండియాలో కరోనా వైరస్ సాఫ్ట్ వేర్లకే ఎక్కువగా వస్తుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.