కరేబియన్ దీవుల్లో నరమాంస భక్షకులు, నరరూప రాక్షసులు ఉండేవాళ్లా?

By Newsmeter.Network  Published on  14 Jan 2020 12:30 PM GMT
కరేబియన్ దీవుల్లో నరమాంస భక్షకులు, నరరూప రాక్షసులు ఉండేవాళ్లా?

  • కరేబియన్ దీవులను సందర్శించిన కొలంబస్
  • బహామా దీవుల్లోనూ కొలంబస్ ప్రయాణం
  • వివిధ తెగలమధ్య విచిత్రమైన బంధాలను చూసిన కొలంబస్
  • తను రాసిన పుస్తకంలో సహేతుకమైన వివరణ
  • ఫ్లోరిడా మ్యూజియంలో ఉన్న పుర్రెల ఆధారణంగా పరిశోధన
  • ఫేస్ రికగ్నైజేషన్ టెక్నిక్ ఆధారంగా పరిశోధనలు
  • కొలంబస్ చెప్పినవన్నీ నిజమే అంటున్న పరిశోధకులు

క్రిస్టోఫర్‌ కొలంబస్‌ (1451-1506) స్పెయిన్‌ దేశాల నుండి దాదాపు ఏడు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న కరేబియన్‌ సముద్రంలోని దగ్గర దగ్గరగా ఉన్న కొన్ని దీవులకు ప్రయాణం చేశాడు. ఉత్తర అట్లాంటిక్‌ సముద్రం మధ్య జరిగిన అతని నాలుగు ప్రయాణాలు ప్రపంచ వాణిజ్యం-యుద్ధ, దౌత్య రంగాలలో ఊహించని మార్పులు చోటు చేసుకోవడానికి ఉపకరించాయి. ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాలకి మధ్యలో ఉన్న అనేక వందల దీవుల సముదాయంలో కరేబియన్‌ దీవులు, బహామా దీవులు ఉన్నాయి.

కొలంబస్ కరేబియన్ దీవుల్ని సందర్శించినప్పుడు అక్కడి పరిస్థితుల్నీ, సాంస్కృతిక వ్యవహారాలనూ, ప్రజల జీవన విధనాలను, తీరుతెన్నులను, ఇతరత్రా అన్ని విషయాలనూ కూలంకషంగా పరిశీలించాడు. తర్వాతి కాలంలో ఆయన తాను చూసిన విషయాలను విశేషాలను పూసగుచ్చినట్టుగా అక్షరబద్ధం చేశాడు. అప్పట్లో కొలంబస్ కాస్త ఎక్కువగానే అక్కడి పరిస్థితులను ఊహించుకుని ఉంటాడన్న ఆలోచనతో పరిశోధనలు చేసిన చరిత్రకారులకు, వైజ్ఞానికి శాస్త్రవేత్తలకు విస్మయం గొలిపే విషయాలు తెలిశాయి.

అంతటి విస్మయం గొలిపే విషయాలు ఏంటి అన్న ప్రశ్న ఉదయించినప్పుడు కొత్తగా నిరూపితమైన ఆ విషయాల గురించి చదువుతున్నవాళ్లకు కూడా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆనాడు అక్కడ ఉన్న పరిస్థితులను తలచుకుంటేనే కొంత భయంకూడా వేస్తుంది.

ఈ దీవుల్లో నరమాంస భక్షకులు ఉండేవారనీ, ఇక్కడి వివిధ జాతులు తెగలమధ్య తీవ్రాతి తీవ్రమైన స్థాయిలో శారీరక సంబంధాలు, అనుబంధాలు ఉండేవనీ, ఒక తెగకు సంబంధించిన మహిళలపై మరొక తెగవారు లైంగిక దాడులకు పాల్పడేవారనీ, కొందరు మాత్రం స్వచ్ఛందంగానే సంబంధాలను కలుపుకుని తెగలను విస్తరించుకోవడానికి, అభివృద్ధికోసం కృషి చేశారనీ కొంలబస్ తను చూసిన విషయాలను రాసినట్టుగా చరిత్రకారులు చెబుతారు.

కొలంబస్ చెప్పినవాటిలో ఎక్కువశాతం అభూత కల్పనలు ఉన్నాయని నిరూపించేందుకు నడుం బిగించిన శాస్త్రవేత్తలు, పరిశోధకులకు ఆశ్చర్యంగొలిపే రీతిలో ఆయన చెప్పినవి వాస్తవాలేనని తెలిశాయి. ఫ్లోరిడా మ్యూజియంలో ఉన్న పుర్రెలను ఫేస్ రికగ్నైజేషన్ టెక్నిక్ ని ఉపయోగించి పరిశోధనలు చేసినప్పుడు కొలంబస్ చెప్పిన విషయాలన్నీ వాస్తవాలేనన్న విషయాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

ఈ పరిశోధనల ఫలితాలన్నీ సైంటిఫిక్ రీసెర్చ్ జర్నల్స్ లోకూడా ప్రచురితమయ్యాయి. “కొన్నేళ్లపాటు కొలంబస్ చెప్పినవి తప్పు అని నిరూపిచడానికి పరిశోధనలు చేశాను, కానీ ఆశ్చర్యం గొలిపే రీతిలో ఆయన చెప్పినవన్నీ నిజమే అన్న సత్యాలు నాకు తెలిశాయి” అని విలియం కీగన్ అనే శాస్త్రవేత్త తన అభిప్రాయాన్ని కుండబద్దలుకొట్టినట్టుగా వివరించాడు.

బహామా దీవుల్లోని ప్రజలపై ఆ రోజుల్లో కరేబియన్ దీవుల్లోని కొన్ని తెగలు ఎంత దారుణంగా బలప్రయోగం చేసి అనేక విధాలుగా ఎలా ఇబ్బంది పెట్టేవో తలచుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుందని మరో పరిశోధకుడు తన అభిప్రాయాన్ని వెల్లడించడం విశేషం. చాలా దూరంలో ఉన్న బహామా దీవుల్లో కరేబియన్లు కనిపించారంటూ కొలంబస్ చెప్పిన విషయాలను ముందు ఎవరూ నమ్మలేకపోయారు. కొన్నేళ్ల తర్వాత కొలంబస్ తర్వాతి తరం వాళ్లు ఆయన చెప్పిన విషయాలపై నిజాలను నిగ్గుతేల్చే ప్రయత్నాలుకూడా చేశారు.

అప్పట్లో కరేబియన్ దీవుల్లో, బహామా దీవుల్లో నరమాంసభక్షకులుకూడా ఉండేవాళ్లని కొలంబస్ చెప్పిన విషయాలు మొదట్లో ప్రపంచానికి అంత నమ్మశక్యంగా అనిపించలేదు. కానీ తాజా పరిశోధనలు ఆ విషయాలు కూడా నిజమేనన్న సత్యాన్ని నిరూపించాయని పరిశోధకులు చెబుతున్నారు.

Next Story