రాజధాని మార్పు ఖాయమే.. కానీ

By రాణి  Published on  27 Dec 2019 9:37 AM GMT
రాజధాని మార్పు ఖాయమే.. కానీ

ఎన్నివేల కోట్లు ఖర్చు చేసినా అమరావతిని అభివృద్ధి చేయలేమని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజధానిపై మంత్రులతో జరిగిన చర్చలో అన్నారు. అమరావతిని అభివృద్ధి చేసేందుకు ఖర్చు పెట్టో లక్షకోట్లలో 10 శాతం విశాఖపై పెడితే మరో హైదరాబాద్ గా మారుతుందన్నారు. రాజధాని మార్పుపై ప్రజలకు వివరిద్దామని సీఎం జగన్ మంత్రులతో చెప్పగా..ఈ విషయంపై కొంతమంది మంత్రులు జనవరి 4వ తేదీన ప్రకటన చేద్దామని అంటే..మరికొందరు మంత్రులు హైపవర్ కమిటీ నివేదిక తర్వాత ప్రకటించాలని అన్నట్లు సమాచారం. మంత్రుల అభిప్రాయాలు విన్న జగన్ రాజధాని తరలింపుపై తొందరేమీ లేదని, హైపవర్ కమిటీ నివేదిక తర్వాతే రాజధానిపై ఒక స్పష్టమైన నిర్ణయాన్ని వెల్లడిద్దామని తెలిపారు.

మొత్తానికి రాజధాని మార్పు ఖాయమే కానీ..అది ఎప్పుడు జరుగుతుందనే దానిపైనే స్పష్టత రావాల్సి ఉంది. రాజధానిని తరలిస్తే అక్కడికి కొత్త సరంజామా కావాలి. అందుకు సంబంధించిన వాటిని ముందుగా సిద్ధం చేసుకునేందుకు రాజధాని ప్రకటనపై కమిటీల అధ్యయనం అంటూ జాప్యం చేస్తున్నారన్న విషయం తేటతెల్లమవుతోంది. ప్రస్తుతం అమరావతి ప్రాంతంలో జరుగుతున్న నిరసనలు ఎంతోకాలం కొనసాగలేవని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. అన్ని కోణాల్లో ఆలోచించాకే తాము నిర్ణయం తీసుకున్నామని చెప్పడంతో పాటు, న్యాయపరంగా చిక్కులు ఎదురుకాకుండా జాగ్రత్త పడేందుకు మరికొంత సమయం తీసుకోవాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి జగన్ సంక్రాంతి పండుగ తర్వాత రెండ్రోజులు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఏపీ రాజధానిపై ఒక స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

అయితే అసెంబ్లీ సమావేశాల్లో ఆఖరి రోజున జగన్ మూడు రాజధానులు ఉండొచ్చు అన్నారే గాని మూడు రాజధానులు ఉంటాయని ప్రకటించలేదన్నారు మంత్రి పేర్ని నాని. ఏపీ కేబినెట్ భేటీ అనంతరం పేర్ని మీడియాతో మాట్లాడారు. కేబినెట్ భేటీలో చర్చించిన అంశాలపై ఆయన మీడియాకు వివరించారు. గత ప్రభుత్వ హయాంలో కొనుగోలు చేసిన భూములు, ఇతర ఆస్తులపై త్వరలోనే సీబీఐ లేదా లోకాయుక్త ద్వారా విచారణ ఉంటుందన్నారు.

Next Story