ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఢిల్లీకి బయల్దేరనున్నారు. బుధవారం సాయంత్రం ఆయన ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయి మూడు రాజధానులు, మండలి రద్దు అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. అలాగే పార్లమెంట్ సమావేశాల్లోనే మండలి రద్దు తీర్మానాన్ని ప్రవేశపెట్టి..దాని ఆమోదం కోసం చొరవ తీసుకోవాలని జగన్ మోదీకి విజ్ఞప్తి చేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ర్టంలో అపరిష్కృతంగా ఉన్న విభజన అంశాలు, పోలవరం నిధుల విషయాలు కూడా సీఎం జగన్ ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు. ప్రధానితో భేటీ ముగిసిన అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర కేంద్రమంత్రులతో కూడా జగన్ సమావేశమవుతారని తెలుస్తోంది. కాగా..బుధవారం ఏపీ కేబినెట్ సమావేశం ముగిసిన వెంటనే జగన్ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరనున్నారు.

మండలి రద్దు తీర్మానాన్ని పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదం తెలిపితే..ఏపీ రాజధాని అమరావతి నుంచి తరలిపోయే ప్రమాదముంది. దీంతో అక్కడి రైతులంతా రోడ్డున పడక తప్పదు. కేవలం అసెంబ్లీ సమావేశాలప్పుడు తప్ప...మిగతా సమయాల్లో ఏ ఒక్కరు కూడా ఆ దిక్కు చూడరు. ఇప్పటికే అభివృద్ధి చెందిన విశాఖపట్నాన్ని ఇంకేం అభివృద్ధి చేస్తారంటూ అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 53 రోజులుగా రైతులు నిరసనలు, ఆందోళనలు చేస్తూనే ఉన్నా..ప్రభుత్వం వారిపై కనీసం కనికరం చూపడం లేదని వాపోతున్నారు.

రాణి యార్లగడ్డ

Next Story