కొలెస్ట్రాల్ ని తగ్గించే సరికొత్త ఇంజెక్షన్

By Newsmeter.Network  Published on  14 Jan 2020 1:56 PM GMT
కొలెస్ట్రాల్ ని తగ్గించే సరికొత్త ఇంజెక్షన్

  • ఇంక్లిజరాన్ పేరుతో తయారవుతున్న ఇంజెక్షన్
  • పూర్తైన క్లినికల్ ట్రయల్స్, అద్భుతమైన ఫలితాలు
  • నోవార్టిస్ కంపెనీతో యూకే ప్రభుత్వం ఒప్పందం
  • 2021 జనవరికల్లా యూకే మార్కెట్లో ఇంక్లిజరాన్
  • సంవత్సరానికి రెండుసార్లు ఇంజెక్షన్ తీసుకుంటే చాలు
  • రోజూ మాత్రలు మింగాల్సిన అవసరం ఏమాత్రం లేదు

రక్తంలో కొలెస్ట్రాల్ పెరగడంవల్ల అనారోగ్యం బారిన పడుతున్నవారికి ఓ శుభవార్త. ఇకపై మీరు కొలస్ట్రాల్ ని తగ్గించుకోవడానికి రోజూ మాత్రలు మింగాల్సిన పనిలేదు. సంవత్సరానికో రెండుసార్లు ఇంజెక్షన్ చేయించుకుంటే చాలు. రోజూ మందులు మింగాల్సిన కష్టం బారినుంచి పూర్తిగా మీరు తప్పించుకున్నట్టే.

ఇంక్లిజరాన్ పేరుతో తయారవుతున్న ఈ ఇంజెక్షన్ ఈ సంవత్సరం దాదాపుగా 40 వేలమందికి క్లినికల్ ట్రయల్స్ కోసం అందుబాటులోకి రాబోతోంది. వచ్చే ఏడాదికల్లా క్లినికల్ ట్రయల్స్ ని పూర్తి చేసుకుని మార్కెట్లో ఈ ఇంజెక్షన్ ని విడుదల చేసేందుకు, ఎన్.హెచ్.ఎస్ బాధితులకు దీన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తయారీదారులు దరఖాస్తు చేసుకున్నారుకూడా.

అంటే అనుకున్నవి అనుకున్నట్టుగా అన్నీ సవ్యంగా జరిగితే ఈ కొత్త ఇంజెక్షన్ వచ్చే ఏడాదినాటికి అంటే 2021 జనవరికల్లా ఇంగ్లండ్ లో మార్కెట్లోకి వచ్చేస్తుందన్నమాట. ఇంక్లిజిరాన్ మార్కెట్లో పూర్తి స్థాయి గేమ్ ఛేంజర్ గా మారబోతోందని అధికారులు ముందుగానే అంచనా వేస్తున్నారు.

ఈ సరికొత్త ఇంజెక్షన్ వల్ల కేవలం ఒక దశాబ్దంలో 55 వేలమందికి హార్ట్ అటాక్ లను తప్పించొచ్చని, హీనపక్షం 30 వేల ప్రాణాలను కచ్చితంగా కాపాడొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే సత్ఫలితాలు పొందడానికి ఈ సరికొత్త ఇంజెక్షన్ ని సంవత్సరానికి రెండుసార్లు సరిగ్గా నిర్థారిత సమయంలోనే వాక్సీన్ మాదిరిగా రెండు సార్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఇండెక్షన్ తీసుకున్న రెండు వారాల్లోగా శరీరంలోని కొలస్ట్రాల్ పూర్తిగా తగ్గిపోవడమే కాక, ఆ తర్వాత మళ్లీ ఇంజెక్షన్ తీసుకోవాల్సిన సమయం వచ్చేవరకూ ఏమాత్రం శరీరంలో డిపాజిట్ కాకుండా ఉంటుందని వైద్యులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు.

యూకేలో 2018లో కనీసం 56 వేలమంది గుండె జబ్బులవల్ల, గుండె పోటువల్ల చనిపోయారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. నిత్యం కొన్ని కోట్లమంది శరీరంలో పేరుకు పోయిన వృథా కొలస్ట్రాల్ ని తగ్గించుకోవడానికి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, గుండె జబ్బుల బారిన పడకుండా ఉండడానికి నోటి ద్వారా మాత్రల్ని తీసుకుంటున్నారు.

కేవలం ఒకే ఒక్క రోజు మాత్ర వేసుకోవడం మర్చిపోయినా చింత తప్పని పరిస్థితి. ఈ పరిస్థితినుంచి, రోజూ మాత్రలు మింగాల్సిన కష్టాల నుంచి కొత్త ఇంజెక్షన్ గట్టెక్కిస్తుందన్న వార్త తెలియగానే యూకే సిటిజన్లు దీనిపై గంపెడాశలు పెట్టుకున్నారు. ఒక్క సంవత్సరం ఓపిక పడితే అనేక అద్భుతాలు సాధించే వీలుంటుందని కలలుగంటున్నారు.

స్విస్ ఫార్మసూటికల్ కంపెనీ నోవార్టిస్ తో యూకే ప్రభుత్వం ఈ ఇంజెక్షన్ తయారీకి ఒక ఒప్పందం కుదుర్చుకుంది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కేర్ అండ్ ఎక్సలెన్స్ , మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రాడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీల నుంచి అనుమతి పొందడంకోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు.

నిజంగా ఇది యూకే వాసులకు మాత్రమే కాక విశ్వవ్యాప్తంగా గుండె జబ్బుల బారిన పడుతున్న అనేకమందికి ప్రాణదాయినిగా పరిణమించబోతోందని బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ మెడికల్ డైరెక్టర్ ప్రొఫెసర్ సర్ నీలేషన్ సమానీ చెబుతున్నారు. వచ్చే దశాబ్దంలో ఈ మందు వల్ల అనేక మంది పౌరులకు ఆరోగ్యాన్ని చేకూర్చడమే కాక, వారిని గుండె జబ్బుల బారిన పడకుండా నిరోధించే అవకాశం కలుగుతుందని యూకే హెల్త్ సెక్రటరీ మ్యాట్ హ్యాంకాక్ అంటున్నారు.

Next Story