చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇస్తే సాంబార్ రైస్ వచ్చింది..అంతే..

By రాణి  Published on  12 Feb 2020 10:51 AM GMT
చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇస్తే సాంబార్ రైస్ వచ్చింది..అంతే..

బిరియానీ ఉంటది సార్.. హైదరాబాదీ బిరియానీ సార్.. బిరియానీ అంతే..! ఎందుకంటే హైదరాబాద్ లో బిరియానీల టేస్టు అలా ఉంటుంది మరీ.. ఒక్కో రెస్టారెంట్ లో ఒక్కో టేస్టు.. అవి కూడా సూపర్ అనేంతగా ఉంటాయి. హైదరాబాద్ లో ఆన్ లైన్ యాప్స్ లో ఎక్కువగా ఆర్డర్ ఇచ్చే వంటకం కూడా చికెన్ బిరియానీనే..! అలా యాప్స్ లో చికెన్ బిరియానీని ఆర్డర్ పెట్టుకుందామని అనుకున్న ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఏకంగా 50000 రూపాయలు పోగొట్టుకున్నాడు.

జూబ్లీ హిల్స్ రహమత్ నగర్ కు చెందిన ఓ టెకీ ఆన్ లైన్ లో బిరియానీ ఆర్డర్ ఇచ్చాడు. 200 విలువైన ఆర్డర్ కాస్తా అతడికి మహా కాస్ట్లీ అయిపోయింది. డెలివరీ యాప్ కస్టమర్ కేర్ నంబర్ అనుకుని ఫోన్ చేయడమే అతడి చేసిన తప్పు. రెండు రోజుల క్రితం చోటుచేసుకున్న ఈ ఘటన ఎవరికి పడితే వారికి ఓటీపీలు, అకౌంట్ ల వివరాలు ఇస్తే మొదటికే మోసం వస్తుందని తెలియజేస్తుంది.

ఫుడ్ డెలివరీ యాప్ అయిన 'జొమాటో'లో సదరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ బిరియానీని ఆర్డర్ ఇచ్చాడు. బిరియానీ కాకుండా సాంబార్ రైస్ అతడికి డెలివరీ చేశారు. యాప్ లో ఉన్న కస్టమర్ సపోర్టుకు ఫోన్ చేయకుండా అతడు ఇంటర్నెట్ లో కనిపించిన కస్టమర్ కేర్ నంబర్ కు కాల్ కలిపాడు. అది కాస్తా కొందరు కంత్రీ గాళ్ళ ఫోన్ నెంబర్. ఇతడికి ఎటువంటి డౌట్ రాకుండా మేనేజ్ చేస్తూ.. సార్ మీ డబ్బులు మీకు 'రీఫండ్' చేస్తామని హామీ ఇచ్చారు. సార్ మీకు పేటీఎం అకౌంట్ ఎలాగూ ఉంటుంది కదా..అందులోకి డబ్బులను పంపిస్తామని చెప్పారు. అతడి డీటెయిల్స్ ను వాళ్ళు తీసుకున్నారు. తాము చెప్పినట్టు ఫాలో అవ్వమని సూచించారు.

అది నమ్మి అతడు తన పేటీఎం వివరాలు వారికి ఇచ్చాడు. రిఫండ్ ప్రాసెస్ లో అతడికి ‘Proceed to Pay’ అనే మెసేజ్ పంపారు. టెకీ అయిన అతడే ఏమీ ఆలోచించకుండా వాళ్ళు చెప్పినట్లే కన్ఫర్మ్ అని నొక్కాడు.. మూడు సార్లు ఆ ప్రాసెస్ ను రిపీట్ చేయించారు సైబర్ నేరగాళ్లు. ఇంతలో అతడి అకౌంట్ నుండి 50000 రూపాయలు మాయమైంది. తాను మోసపోయానని గుర్తించిన ఆ వ్యక్తి హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ కే.వి.ఎం.ప్రసాద్ ను ఆశ్రయించారు. ఆయన ఆ నేరగాళ్ళను పట్టుకుంటామని హామీ ఇచ్చారు. సైబర్ క్రైమ్ విభాగం సెక్షన్ 420 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. అనాధికారిక పోర్టల్స్ నుంచి ఎలాంటి ఆర్డర్లు, ట్రాన్సాక్షన్లు చేయరాదని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగినే ఇంత ఈజీగా బురిడీ కొట్టించిన నేరగాళ్లు ఇంకెంతమంది అమాయకులను మోసం చేస్తున్నారో..?

Next Story