బడేటి బుజ్జి హఠాన్మరణం బాధాకరం.. : చంద్రబాబు

By రాణి  Published on  26 Dec 2019 10:47 AM GMT
బడేటి బుజ్జి హఠాన్మరణం బాధాకరం.. : చంద్రబాబు

ఏలూరు : టీడీపీ నేత, ఏలూరు మాజీ ఎమ్మెల్యే బడేటి కోట రామారావు అలియాస్ బడేటి బుజ్జి(55) గుండెపోటుతో అకస్మాత్తుగా చనిపోవడం చాలా బాధాకరమన్నారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. గురువారం బడేటి బుజ్జి గుండెపోటుతో మృతి చెందారన్న విషయం తెలుసుకున్న చంద్రబాబు ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ...ఏలూరులో పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించిన వ్యక్తి, పార్టీకి కావలసిన వ్యక్తి బడేటి బుజ్జి ఇలా అర్ధాంతరంగా కన్నుమూస్తారని అనుకోలేదన్నారు. అమరావతి రాజధాని అయితే ఏలూరు కూడా అభివృద్ధి చెందుతుందని ఆయన భావించారని, ఏలూరులో నెలకొన్న సమస్యలను ఎప్పటికపుడు తన దృష్టికి తీసుకొచ్చి, వాటి పరిష్కారం కోసం కృషి చేసిన వ్యక్తి బుజ్జి అని కొనియాడారు. 2019 లో జరిగిన ఎన్నికల్లో ఇంకొంచెం కష్టపడి ఉంటే ఏలూరులో గెలిచేవారమని ఎప్పుడూ అంటుండేవారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.

బడేటి బుజ్జికి ఇంకా రాజకీయ భవిష్యత్ చాలా ఉందని అందరూ అనుకునే వారని, ఇలా హఠాత్తుగా చనిపోవడం చాలా దురదృష్టకరమన్నారు. బుజ్జి కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని, వారికి అన్ని విధాలుగా సహాయ సహకారులు అందిస్తామని చంద్రబాబు తెలిపారు.

బుజ్జి మరణవార్తను తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు ఆయన ఇంటికి వస్తున్నారు. బుజ్జి 2014 ఎన్నికల్లో ఏలూరు ఎమ్మెల్యేగా గెలిచారు. కాగా గత ఎన్నికల్లో ఆళ్ల నాని చేతిలో ఓటిమి పాలయ్యారు. దివంగత సినీ నటుడు ఎస్వీ రంగారావు మేనల్లుడు బడేటి బుజ్జి. ఏలూరులో టీడీపీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేశారు. టీడీపీలోనే సుదీర్ఘకాలం పాటు కొనసాగిన బుజ్జి.. మున్సిపల్‌ కౌన్సిలర్‌, చైర్మన్‌గా కూడా పని చేశారు. బడేటి బుజ్జి ఆకస్మిక మరణంతో టీడీపీ నేతలు విషాదంలో మునిగిపోయారు.

Next Story